పల్లెలు, పట్టణాలనూ అభివృద్ధి చేయాలి | Sakshi
Sakshi News home page

పల్లెలు, పట్టణాలనూ అభివృద్ధి చేయాలి

Published Tue, Sep 30 2014 12:11 AM

పల్లెలు, పట్టణాలనూ అభివృద్ధి చేయాలి

‘అర్బన్ ఫైనాన్స్’ వర్క్‌షాప్‌లో మంత్రి ఈటెల
 
హైదరాబాద్: నగరాలతోపాటు పల్లెలు, పట్టణాలను సమాంతరంగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక శాఖల మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. నగరంలో త్వరలో జరుగనున్న మెట్రో పొలిస్ సదస్సు సన్నాహకాల్లో భాగంగా సోమవారం ఇక్కడి సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (సీజీజీ)లో ‘అర్బన్ ఫైనాన్స్’ అంశంపై జరిగిన ప్రీ-కాన్ఫరెన్స్ వర్క్‌షాప్‌లో ఆయన కీలకోపన్యాసం చేశారు. నగరాలు, పల్లెలు రెంటికీ ప్రాధాన్యమిస్తూ మానవీయ కోణంలో చేపట్టే చర్యలపై మెట్రోపొలిస్ సదస్సులో ఫోకస్ చేయాలని కోరారు. అభివృద్ధి కంటే భద్రత, ఉపాధి కల్పన తదితర అంశాలు కూడా ముఖ్యమేనన్నారు. నగరీకరణ అనివార్యంగా పెరుగుతోందని, నగర వాసుల జీవితం యాంత్రికంగా మారి మానవ సంబంధాలు దారుణంగా దెబ్బతింటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. చట్టాలు, నిబంధనలు వ్యక్తులు, హోదాలను బట్టి కాకుండా అందరికీ ఒకేవిధంగా పక డ్బందీగా అమలు కావాలని అభిలషించారు. ప్రభుత్వాలు మారినా శాస్త్రీయంగా చేపట్టిన పథకాలు మారరాదని సూచించారు.  

మన్నికే ప్రధానం: తాగునీటి లైన్లు, డ్రెయినేజీల ఏర్పాటు వంటి ఏపనికైనా నాణ్యత పాటించకుంటే ఎన్ని నిధులు వెచ్చించినా నిష్ర్పయోజనమేనని మంత్రి తెలిపారు. నగరంలో అస్తవ్యస్తంగా ఉన్న రహదారులు, ఫుట్‌పాత్‌లను ఇందుకు ఉదాహరణగా ఆయన ప్రస్తావించారు. ప్రజలు నగరాల వైపు ఉపాధి కోసం చూసే ధోరణి మారాలంటే పల్లెలు, పట్టణాలు కూడా అభివృద్ధి చెందాలని అన్నారు. మెట్రోపొలిస్ సదస్సు నిర్వహించే అవకాశం ఆసియా దేశాల్లో తొలిసారిగా తెలంగాణ రాష్ట్రానికి రావడం గర్వకారణమన్నారు. సదస్సు కోసం ప్రభుత్వం, జీహెచ్‌ఎంసీ ప్రతిష్టాత్మకంగా పనులు చేస్తున్నాయన్నారు. సమావేశంలో ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ పి.కె.మహంతి, సీజీజీ  డెరైక్టర్ జనరల్ కె. రామకృష్ణారావు, అడిషనల్ డెరైక్టర్ జనరల్ డాక్టర్ గంగయ్య, జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్, స్పెషల్ కమిషనర్ అహ్మద్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

‘రేషన్’పై నేడు కేబినెట్ సబ్‌కమిటీ భేటీ

అర్హులైన పేదలందరికీ రేషన్‌కార్డులు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి ఈటెల స్పష్టం చేశారు. గచ్చిబౌలిలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కేబినెట్ సబ్ కమిటీ మంగళవారం సమావేశమై సీఎంకు నివేదిక అందజేస్తుందన్నారు. ప్రస్తుతం రూపా యికి కిలో చొప్పున కుటుంబానికి ఇస్తున్న 30 కిలోల బియ్యాన్ని 35 కిలోలకు పెంచే విషయం పరిశీలనలో ఉందన్నారు. సాధ్యాసాధ్యాలు బేరీజు వేసి నిర్ణయం తీసుకుంటామన్నారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement