మీ అందరికీ రుణపడి ఉంటా : తుమ్మల | Sakshi
Sakshi News home page

మీ అందరికీ రుణపడి ఉంటా : తుమ్మల

Published Mon, Sep 1 2014 4:36 AM

మీ అందరికీ రుణపడి ఉంటా : తుమ్మల

సత్తుపల్లి : ‘నాకు రాజకీయ జన్మనిచ్చి ఈ స్థాయికి తీసుకొచ్చిన మీ అందరి జన్మజన్మలా రుణపడి ఉంటా’నని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భావోద్వేగానికి లోనయ్యారు. సత్తుపల్లిలోని చల్లగుళ్ల నర్సింహారావు నివాసంలో ఆదివారం జరిగిన ఐదు నియోజకవర్గాల ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘గత 30 సంవత్సరాలుగా ఎలా పని చేశమో, భవిష్యత్తులో కూడా మీ కీర్తి ప్రతిష్టల కోసం.. మీ సౌభాగ్యం కోసం, మీ తుమ్మల పనిచేస్తాడు.. మీరిచ్చిన అపూర్వ సంఘీభావం జీవితాంతం గుర్తు పెట్టుకుంటా..’ అని అన్నారు.
 
పలుమార్లు కంటతడి పెట్టిన తుమ్మల...
 టీడీపీకి రాజీనామా చేసిన జిల్లా అధ్యక్షులు కొండబాల కోటేశ్వరరావు మాట్లాడుతున్న సమయంలో తుమ్మల నాగేశ్వరరావు పలుమార్లు కన్నీటి పర్యంతమయ్యారు. ‘తుమ్మల నిర్ణయానికి కట్టుబడి ఉంటాం.. మీ అనుమతితో ప్రతిష్టాత్మకమైన నిర్ణయాన్ని ప్రకటిద్దాం.. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో పనిచేద్దాం.. మీ అందరి అనుమతితో సభ్యత్వం తీసుకుందాం.. తుమ్మల నాయకత్వాన్ని బలపర్చుదాం’ అని కొండబాల కోటేశ్వరరావు కార్యకర్తల హర్షద్వానాల మధ్య ప్రకటించటంతో తుమ్మల నాగేశ్వరరావు కన్నీరు ఆపుకోలేకపోయారు. దీంతో సభాప్రాంగణంలో నిశ్శబ్దం అలుముకుంది.
 
 ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ మాట్లాడుతూ జిల్లాలో నియంతలా తయారైన వ్యక్తి పోకడలపై అధిష్టానానికి ఎన్నిసార్లు విన్నవించుకున్నా ఫలితం లేకుండా పోయిందని, అది భరించలేకనే  బయటకు రావాల్సి వచ్చిందని మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావును ఉద్దేశించి వ్యాఖ్యానించారు. తాము పదవుల కోసమో, డబ్బు కోసమో టీడీపీని వీడడం లేదన్నారు. ఈ సమావేశంలో జడ్పీ చైర్‌పర్సన్ గడిపల్లి కవిత, డీసీసీబీ చైర్మన్ మువ్వా విజయ్‌బాబు, డీసీఎంఎస్ చైర్మన్ అంజయ్య, జెడ్పీ వైస్ చైర్మన్ బరపాటి వాసు, డీసీసీబీ డెరైక్టర్లు బోడేపూడి రమేష్‌బాబు, పాల నర్సారెడ్డి, వెలిశాల చెన్నాచారి, చల్లగుండ్ల కృష్ణయ్య, నాయకులు దొడ్డాలకుల స్వాతి, బీరెడ్డి నాగచంద్రారెడ్డి, తోటకూర రవిశంకర్, బాలాజీ నాయక్, మచ్చా శ్రీనివాసరావు తదితరులు  పాల్గొన్నారు.

Advertisement
Advertisement