తేలని సారథి | Sakshi
Sakshi News home page

తేలని సారథి

Published Sun, Jul 6 2014 1:22 AM

తేలని సారథి - Sakshi

కొలిక్కిరాని జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నిక
కోరానికి సరిపడా హాజరుకాని జెడ్పీటీసీ సభ్యులు
గంటపాటు వేచిచూసిన కలెక్టర్ శ్రీధర్
అనంతరం సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటన
 సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నికపై సస్పెన్స్ కొనసాగుతోంది. సారథి ఎన్నికపై శనివారం నిర్వహించిన సమావేశం కోరం లేకపోవడం తో వాయిదా పడింది. సమావేశం నిర్వహణ కు సరిపడా 17 మంది హాజరుకాకపోవడంతో ఎన్నికను వాయిదా వేస్తున్నట్లు కలెక్టర్ శ్రీధర్ ప్రకటించారు. కో ఆప్షన్ సభ్యుల నామినేషన్ల ప్రక్రియ అనంతరం మధ్యాహ్నం ఒంటిగంట కు సమావేశం ప్రారంభమైనా జెడ్పీటీసీ సభ్యులెవరూ రాలేదు. టీఆర్‌ఎస్ సభ్యులు జిల్లా పరిషత్ భవనంలోనే ఉన్నప్పటికీ, టీడీపీ, కాంగ్రెస్ సభ్యులు సమావేశానికి హాజరు కావడంలేదనే సమాచారంతో గదులకే పరిమితమయ్యారు. నిర్దేశిత కోరం కోసం గంటపాటు వేచిచూసిన కలెక్టర్... రెండు గంటలకు సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.
 
13న మళ్లీ ఎన్నికలు..
కోరంలేక వాయిదా పడిన ఎన్నికలు ఈ నెల 13న జరుగుతాయని రాష్ర్ట ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ మేరకు శనివారం షెడ్యూల్  విడుదల చేసింది. సోమవారం నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభమవుతున్నం దున.. ఎంపీలు సమావేశానికి అందుబాటు లో ఉండరనే ఉద్దేశంతో సెలవు రోజయినప్పటికీ వచ్చే ఆదివారం ఎన్నికలు చేపడుతున్న ట్లు తెలుస్తోంది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో వైభవంగా జరిగే బోనాల పండుగ రోజున జిల్లా పరిషత్ ఎన్నికల తేదీని ఖరారు చేయడాన్ని పార్టీలు తప్పుబడుతున్నాయి. శనివారం కో ఆప్షన్ సభ్యుల పదవులకు దాఖలు చేసిన నామినేషన్లు చెల్లవని, తిరిగి ఎన్నిక రోజున కొత్తగా నామినేషన్లు దాఖలు చేయాలని ఎన్నికల సీఈఓ స్పష్టం చేశారు.
 
పంచుకుందాం రండి!
జిల్లా రాజకీయాల్లో శనివారం నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. జెడ్పీ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు టీడీపీ, కాంగ్రెస్‌లు జతకట్టాయి. పరస్పర అవగాహనతో పదవీకాలాన్ని పంచుకోవాలని ఇరుపార్టీలు నిర్ణయించినప్పటికీ, ఎవరూ ముందు పగ్గాలు చేపట్టాలనే అంశంపై పేచీ తెగలేదు. ఒక దశలో లాటరీ పద్ధతిలో ఈ వివాదానికి ముగింపు పలుకుదామని కాంగ్రెస్ భావించినప్పటికీ, టీడీపీ ససేమిరా అనడంతో వెనక్కి తగ్గింది.

వరంగల్, మహబూబ్‌నగర్‌లలో మద్దతు ఇస్తున్నందున రంగారెడ్డి జిల్లా పరిషత్‌ను తమకు వదిలేయాలని టీడీపీ అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి షరతుకు అంగీకరించిన కాంగ్రెస్ అధిష్టానం... తొలుత తమకే అవకాశం ఇవ్వాలని పట్టుబట్టింది. ఈ అంశం తేలకపోవడంతో సీఎల్‌పీ నేత జానారెడ్డితో చర్చించిన తర్వాత తుది నిర్ణయం తీసుకుందామని ఇరుపార్టీలూ భావించాయి.

నల్గొండ జెడ్పీ ఎన్నికల్లో ఉన్న ఆయన నగరానికి చేరుకునేసరికి ఆలస్యమవుతుందని భావించిన రెండు పార్టీలు జిల్లా పరిషత్ సమావేశానికి హాజరు కాకూడదని నిర్ణయించారు. తద్వారా కోరంలేక సమావేశం మరుసటి రోజుకు వాయిదా పడుతుందని అంచనా వేశారు. దీంతో ఇరుపార్టీలూ తాత్కాలికంగా చర్చలకు విరామం ప్రకటించాయి.
 
జంగారెడ్డికి గ్రీన్‌సిగ్నల్!
టీడీపీతో సర్దుబాటు ఖరారుకావడంతో కాంగ్రెస్ చైర్మన్ అభ్యర్థిగా ఎనుగు జంగారెడ్డి పేరును ప్రకటించింది. మరో ఇద్దరు జెడ్పీటీసీలు రేసులో నిలిచినప్పటికీ, పార్టీ నేతలు సబిత, ప్రసాద్, కేఎల్లార్‌ఙ జోక్యంతో వెనక్కి తగ్గారు.ఈ నేపథ్యంలో జంగారెడ్డి అభ్యర్థిత్వాన్ని అధికారికంగా ఖరారు చే స్తూ విప్ కూడా జారీ చేశారు.అయితే, టీడీపీతో పదవీకాలం పై స్పష్టత రాకపోవడంతో దీన్ని అధికారులకు ఇవ్వలేదు.
 
వేచి చూసి.. వెనుదిరిగి
జిల్లా పరిషత్ పీఠం దక్కించుకోవాలని గట్టి పట్టుదలతో ఉన్న టీఆర్‌ఎస్... ప్రత్యర్థుల కదలికలను పసిగట్టే ప్రయత్నంలో మునిగిపోయింది. క్యాంపు నుంచి నేరుగాా జెడ్పీకి చేరుకున్న టీఆర్‌ఎస్ సభ్యులతో జిల్లా మంత్రి మహేందర్‌రెడ్డి ప్రత్యేకంగా పలు దఫాలుగా భేటీ అయ్యారు. ఆ పార్టీ చైర్‌పర్సన్ అభ్యర్థి సునీత ఒంటిగంట సమయంలో జిల్లా పరిషత్‌కు వచ్చారు. మేజిక్ ఫిగర్‌ను చేరేందుకు ఆపరేషన్ ఆకర్ష్‌కు తెరలేపిన మహేందర్‌రెడ్డి ఎప్పటికప్పుడు ప్రత్యర్థుల వ్యూహాలను తెలుసుకోవడంలో బిజీగా గడిపారు.

ఇప్పటికే తమతో బేరాలు కుదుర్చుకున్న టీడీపీ, కాంగ్రెస్ సభ్యులు తాజా పరిణామాల నేపథ్యంలో ఎటువైపు మొగ్గు చూపుతారోననే అంశంపై సన్నిహితులతో చర్చించారు. ఊహించని విధంగా ప్రత్యర్థులు మిలాఖత్ కావడం... ఆ పార్టీలు కూడా భారీ ప్యాకేజీలకు తెరలేపడం మహేందర్‌కు ఇబ్బంది కలిగిస్తోంది. ఎన్నిక వాయిదా పడడంతో మరో వారం క్యాంపులు నిర్వహించాల్సి రావడం కూడా ఆయనకు చికాకు తెప్పిస్తోంది.
 
యాదవరెడ్డి చెట్టాపట్టాల్!
కాంగ్రెస్ ఎమ్మెల్సీ, నవాబుపేట జెడ్పీటీసీ సభ్యుడు యాదవరెడ్డి టీఆర్‌ఎస్ పంచన చేరిపోయారు. మంత్రి మహేందర్ రెడ్డి వెన్నంటి తిరిగిన ఆయన టీఆర్‌ఎస్ నేతలతో చెట్టాపట్టాలేసుకోని తిరిగారు. దీంతో ఆయన టీఆర్‌ఎస్‌కు మద్దతు ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. కాంగ్రెస్ చైర్మన్ అభ్యర్థిగా జెడ్పీ బరిలో దిగిన ఆయన... చివరి నిమిషంలో గులాబీ శిబిరానికి చేరువయ్యారు. ఇప్పుడు బహిరంగంగా ఆ పార్టీ నేతలతో దోస్తీకట్టారు. యాదవరెడ్డి చేరికతో టీఆర్‌ఎస్ బలం కాంగ్రెస్‌తో సమానంగా మారింది. పార్టీ బలాబలాలు సమంగా కావడంతో ఫలితం ఎటువైపు మొగ్గుతుందనేది ఆసక్తికరంగా మారింది.

Advertisement
Advertisement