మీ ఉద్యోగానికో నమస్కారం! | Sakshi
Sakshi News home page

మీ ఉద్యోగానికో నమస్కారం!

Published Tue, Feb 7 2017 8:13 AM

మీ ఉద్యోగానికో నమస్కారం!

పైలట్ ఉద్యోగం అంటే బయటి నుంచి చూసేవాళ్లకు భలే క్రేజ్ ఉంటుంది. ప్రతిరోజూ విమానాల్లో తిరగడం, అనేక దేశాలు చూడటం, మంచి జీతాలు.. ఇలాంటి అవకాశాలన్నీ ఉంటాయనుకుంటాం. కానీ.. ఎయిరిండియాలో బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్లు నడిపే 24 మంది పైలట్లు ఒకేసారి ఈ ఉద్యోగం తాము చేయలేమంటూ నమస్కారం పెట్టేస్తున్నారు. తాము రాజీనామా చేయడానికి నిరభ్యంతర పత్రం (ఎన్ఓసీ) ఇవ్వాలంటూ దరఖాస్తు చేసుకున్నారు. కెరీర్‌లో ఏమాత్రం పురోగతి లేకపోవడంతో.. ఇక ఈ ఉద్యోగం చేయడం ఎందుకు దండగని అంటున్నారు. 2005 సంవత్సరంలో ఎయిరిండియా 27 డ్రీమ్‌లైనర్ల విమానాలకు ఆర్డర్ చేసింది. ఇప్పటివరకు 23 విమానాలు వచ్చాయి. ఇవి మంచి మైలేజి ఇస్తుండటంతో వీటిని బాగా ఉపయోగిస్తున్నారు. 
 
ఈ విమానాల కోసం దాదాపు 300 మంది పైలట్లను తీసుకుంది. 2007-08 సమయంలో ఈ 24 మంది పైలట్లు ఇండియన్ ఎయిర్‌లైన్స్‌లో చేరారు. వీళ్లంతా ఎయిర్‌బస్ ఎ-320లు నడిపినవాళ్లు. 2012 సంవత్సరంలో డ్రీమ్‌లైనర్లు తమకు వస్తాయని ఎయిరిండియా వాటిని నడిపేందుకు వీళ్లను ఉద్యోగాల్లోకి తీసుకుంది. అయితే, అప్పట్లో కో-పైలట్లుగా చేరిన తామంతా ఇప్పటికీ బోయింగ్-787 విమానాలకు కో-పైలట్లుగానే ఉండిపోయాం తప్ప ఎలాంటి పదోన్నతులు ఇవ్వలేదని వాళ్లు మండిపడుతున్నారు. దాంతో తాము ఉద్యోగాలకు రాజీనామా చేసేస్తామని చెబుతున్నారు. ఇందుకోసం తమకు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్లు ఇవ్వాలని కోరుతున్నారు.

Advertisement
Advertisement