నేటినుంచి 48 గంటల బంద్‌ | Sakshi
Sakshi News home page

నేటినుంచి 48 గంటల బంద్‌

Published Fri, Oct 4 2013 2:00 AM

నేటినుంచి 48 గంటల బంద్‌ - Sakshi

సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక పిలుపు
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర విభజన నిర్ణయానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలపడాన్ని నిరసిస్తూ శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి 48 గంటల పాటు బంద్‌ పాటించాలని ఉద్యోగ, కార్మిక సంఘాలతో కూడిన ‘సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక’ పిలుపునిచ్చింది. ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులను దిగ్బంధం చేయాలని సూచించింది. రహదారులను దిగ్బంధం చేయాలని, అంతర్‌రాష్ట్ర సరిహద్దుల్లో వాహనాలను అడ్డుకోవాలని చెప్పింది. కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి.. నేర చరితుల ఆర్డినెన్‌‌సను వెనక్కి తీసుకున్న విధంగా విభజన నిర్ణయాన్ని కూడా వెనక్కి తీసుకొనే వరకు సమ్మె కొనసాగించాలని, ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలని పిలుపునిచ్చింది. కేంద్ర మంత్రివర్గ నిర్ణయం వెలువడిన తర్వాత వేదిక చైర్మన్‌ అశోక్‌బాబు, ఏపీఎన్జీవో సంఘం ప్రధాన కార్యదర్శి చంద్రశేఖరరెడ్డి, రెవెన్యూ సర్వీసెస్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు తదితరులతో కలసి విలేకరులతో మాట్లాడారు. విభజన నిర్ణయానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసిన అక్టోబర్‌ 3వ తేదీని సీమాంధ్రలకు బ్లాక్‌డేగా అభివర్ణించారు.

మంత్రివర్గం నిర్ణయం తీసుకోగానే రాష్ట్రం విడిపోయినట్లు కాదని, ప్రజామోదం లేకుండా రాష్ట్రాన్ని విభజించడం ఎవరితరం కాదన్నారు. రాష్ట్రం విడిపోయిందనే సందేశాన్ని ప్రజలకు ఇవ్వడం ద్వారా సీమాంధ్ర ప్రజలను మానసికంగా దెబ్బకొట్టడానికే ఈ నిర్ణయం తీసుకున్నారన్నారు. విభజనను ఎలా అడ్డుకుంటారనే విషయంపై రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా సంప్రదిస్తామని తెలిపారు. రాజకీయ విభేదాలను పక్కనబెట్టి విభజనను అడ్డుకోవడానికి కృషి చేయాలని అన్ని రాజకీయ పార్టీలకు ఆయన విజ్ఞప్తి చేశారు. అసెంబ్లీలో తీర్మానాన్ని ఓడించేందుకు అన్ని పార్టీలు సంసిద్ధంగా ఉండాలని కోరారు. కేంద్ర మంత్రులంతా రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. రాజీనామాలు చేయకుండానే విభజన నిర్ణయాన్ని అడ్డుకుంటామని ఎంపీలు, మంత్రులు చెప్పిన విషయాన్ని గుర్తు చేస్తూ, ఇప్పుడు ఎలా అడ్డుకుంటారో సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. సమ్మెలో లేనివారు వెంటనే సమ్మెలోకి రావాలని పిలుపునిచ్చారు. సమ్మెలోకి రానివారిని ఉద్యమ ద్రోహులుగా పరిగణిస్తామని, ఈనెల 6న అన్ని సంఘాలతో సమావేశం ఏర్పాటు చేసి భవిష్యత్‌ కార్యాచరణను ఖరారు చేస్తామని అశోక్‌బాబు తెలిపారు.

మూడు రోజుల పాటు వైద్యసేవలు బంద్‌
న్యూస్‌లైన్‌ నెట్‌వర్‌‌క: తెలంగాణ నోట్‌ ఆమోదానికి నిరసనగా శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు ప్రభుత్వానికి వైద్యపరంగా సహాయ నిరాకరణ చేస్తున్నట్లు ప్రభుత్వ వైద్యుల సంఘం రాష్ట్ర కార్యదర్శి, కోస్తా జిల్లాల మెడికల్‌ జేఏసీ కన్వీనర్‌ డాక్టర్‌ పి.శ్యాంసుందర్‌ ప్రకటించారు. సీమాంధ్రలోని 13 జిల్లాల్లో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో అత్యవసర వైద్యసేవలు మినహా మిగిలిన అన్ని రకాల వైద్యసేవలను నిలిపివేయనున్నట్లు తెలిపారు. పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, జిల్లాల ఏరియా ఆస్పత్రులు, ఈఎస్‌ఐ, రిమ్‌‌స, ప్రభుత్వ బోధనాస్పత్రులు, వైద్య కళాశాలలు, వాటి అనుబంధ ఆస్పత్రుల్లో విధులను బహిష్కరిస్తున్నట్లు వెల్లడించారు.
నేడు బంద్‌కు పిలుపు: కేంద్ర కేబినెట్‌లో తెలంగాణ నోట్‌ ప్రవేశపెట్టడాన్ని నిరసిస్తూ శుక్రవారం సీమాంధ్ర బంద్‌కు పిలుపునిస్తున్నట్లు సమైక్యాంధ్ర జేఏసీ గౌరవాధ్యక్షుడు ఆచార్య పి.నరసింహారావు తెలిపారు.

 బిల్లు పెడితే మెరుపు సమ్మె: తెలంగాణ బిల్లు పార్లమెంటులో పెడితే మెరుపు సమ్మెకు దిగుతామని సీమాంధ్ర విద్యుత్తు ఉద్యోగుల జేఏసీ అధ్యక్షుడు ఆర్‌.సాయిబాబా హెచ్చరించారు. సమైక్యాంధ్రకు మద్దతుగా శుక్రవారం రాత్రి జిల్లా వ్యాప్తంగా ప్రజలు స్వచ్ఛందంగా లైట్లు ఆపి నిరసనను వ్యక్తం చేయాలన్నారు. జిల్లాలోని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల సర్వీసులకు సంబంధించి ఎలాంటి మరమ్మతులు నిర్వహించరాదని తీర్మానించామన్నారు.

బ్రహ్మోత్సవాలకూ టీ నోట్‌ సెగ: బ్రహ్మోత్సవాల నేపథ్యంలో తిరుపతి కొండమీదికి వంద ప్రత్యేక బస్సులు నడుస్తున్నాయి. తెలంగాణ నోట్‌ నేపథ్యంలో ఆ బస్సుల్ని కూడా నిలిపేస్తున్నట్లు ఆర్టీసీ ఎంప్లాయిస్‌ యూనియన్‌ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి పలిశెట్టి దామోదర్‌ రావు చెప్పారు.

సమ్మె ఆపం: ఆర్టీసీ ఈయూ
ఎన్ని కష్టాలెదురైనా, ఆర్థిక ఇబ్బందులున్నా సమ్మె కొనసాగించి తీరుతామని ఆర్టీసీ ఈయూ(ఉద్యోగ సంఘం) సమైక్యాంధ్ర పోరాట కమిటీ చైర్మన్‌ చంద్రశేఖరరెడ్డి, కన్వీనర్‌ దామోదరరావు స్పష్టం చేశారు.
 

Advertisement
Advertisement