ఇక జనతా దర్బార్ ఉండదు | Sakshi
Sakshi News home page

ఇక జనతా దర్బార్ ఉండదు

Published Tue, Jan 14 2014 2:11 AM

ఇక జనతా దర్బార్ ఉండదు

ఆన్‌లైన్‌లో సమస్యలు చెప్పుకోవచ్చు: కేజ్రీవాల్
హాట్‌లైన్‌లను ఏర్పాటుచేస్తాం

 
 సాక్షి, న్యూఢిల్లీ:
ప్రజా సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని, వారినుంచి వినతిపత్రాలు స్వీకరించే ఉద్దేశంతో ప్రారంభించిన జనతాదర్బార్ కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సోమవారం ప్రకటించారు. ఇకపై జనతాదర్బార్ ఉండబోదని, ఆన్‌లైన్లో కానీ, హెల్ప్‌లైన్ ద్వారా కానీ, పోస్ట్ ద్వారా కానీ ప్రజలు తమ సమస్యలను ప్రభుత్వానికి తెలియజేయాలని స్పష్టం చేశారు. సంబంధిత శాఖల అధికారులు హెల్ప్‌లైన్ నంబర్లను త్వరలో ప్రకటిస్తారని, సెక్రటేరియట్‌లో కూడా త్వరలో ఒక హెల్ప్‌బాక్స్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. ఊహించని స్థాయిలో ప్రజలు రావడం, నిర్వహణ లోపంతో కేజ్రీవాల్ తన మంత్రివర్గ సహచరులతో కలిసి ఢిల్లీ సచివాలయ ఆవరణలో మొట్టమొదటిసారిగా శనివారం నిర్వహించిన జనతా దర్బార్ రసాభాసగా మారిన విషయం తెలిసిందే.
 
  పటిష్ట ఏర్పాట్లతో మళ్లీ జనతా దర్బార్‌ను ఏర్పాటుచేస్తామని అప్పుడు ప్రకటించిన ముఖ్యమంత్రి.. తాజాగా ఆ కార్యక్రమాన్ని రద్దుచేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే, తనను ప్రత్యక్షంగా కలవాలనుకునేవారి కోసం వారంలో ఒక రోజు రెండు నుంచి మూడుగంటల సమయం కేటాయిస్తానన్నారు. ప్రభుత్వం తనకు కల్పిస్తున్న జెడ్ కేటగిరీ భద్రతపై, వాటర్ ట్యాంకర్ మాఫియా, టెండర్ మాఫియా నుంచి ముప్పు ఉందన్న ఐబీ నివేదికలపై విలేకరులు ప్రశ్నించగా ‘నాకు భద్రత అవసరం లేదని ఇప్పటికే చాలాసార్లు చెప్పాను. ముఖ్యమంత్రులకు, మంత్రులకు భద్రత కల్పించడం ముఖ్యం కాదు. సామాన్యులకు రక్షణ కల్పించాలి’ అన్నారు.
 
 ఆప్‌కు జైకొట్టిన మేధా పాట్కర్
 ముంబై: ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)కి ప్రముఖ సామాజిక కార్యకర్త, నర్మదా బచావో ఆందోళన్ ఉద్యమకారిణి మేధా పాట్కర్ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో ఆప్ తరఫున ఆమె బరిలోకి దిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. దాదాపు 200 ప్రజా సంఘాలతో ఏర్పడిన ‘నేషనల్ అలయెన్స్ ఫర్ పీపు ల్స్ మూవ్‌మెంట్స్’ కూటమికి మేధాపాట్కర్ కన్వీనర్‌గా వ్యవహరిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీ చేస్తారా అని అడగ్గా.. ‘నేను ఇప్పుడు దేన్నీ తోసిపుచ్చలేను. రాజకీయాలు అంటరానివని మేం భావించడం లేదు. మా ఆలోచనలు ఆ పార్టీ ఆలోచనలకు సారూప్యత ఉంది’ అని ఆమె చెప్పారు. ‘బీజేపీ ఇప్పటికైనా తన తప్పు తెలుసుకోవాలి. మోడీకి బదులు గోవా సీఎం మనోహర్ పారికర్‌ను ప్రధాని బరిలో దించాలి’ అని ఆప్ సూచించింది.

Advertisement
Advertisement