అనాథలు బీసీ జాబితాలోకా? | Sakshi
Sakshi News home page

అనాథలు బీసీ జాబితాలోకా?

Published Sat, Oct 3 2015 4:37 AM

BC orphans Loca list?

అశాస్త్రీయమంటున్న కొన్ని బీసీ, విద్యార్థి సంఘాలు
 
 సాక్షి, హైదరాబాద్: శాస్త్రీయ అధ్యయనం, జిల్లాల వారీ పరిశీలన లేకుండా,అనాథలను బీసీ  జాబితాలో ఎలా చేరుస్తారని కొన్ని బీసీ, విద్యార్థి సంఘాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాయి. దీనిపై విస్తృతంగా చర్చ జరపాలనీ, తమ అభిప్రాయాలు తెలుసుకోవాలని కోరుతున్నాయి. కేవలం బీసీ-ఏ జాబితాలో అనాథలను చేర్చినంత మాత్రాన సరిపోదని, రిజర్వేషన్ల శాతాన్నీ పెంచాలంటున్నాయి. అనాథల పేరిట ఇతర కులాల వారు తప్పుడు ధ్రువీకరణలతో ప్రస్తుతమున్న రిజర్వేషన్లకు గండికొట్టే అవకాశముందంటున్నాయి. అందుకే వారికి బీసీ సర్టిఫికెట్‌ను తహసీల్దార్లు కాకుండా ఆర్డీఓ స్థాయి అధికారి ఇచ్చేలా ఉత్తర్వులు సవరణలు చేయాలని కోరుతున్నాయి. బీసీ-ఏ జాబితాలో వారిని చేర్చినా రాజకీయ రిజర్వేషన్లు వర్తించకుండా చూడాలంటున్నాయి.

 తమిళనాడు జీవో ప్రకారమే ఇక్కడా
 అనాథలను బీసీ కేటగిరీలో చేర్చుతూ రాష్ట్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి తమిళనాడులో అనుసరిస్తున్న విధానమే మార్గదర్శకమైంది. అక్కడ అనాథలను బీసీ జాబితాలో పొందుపరచడంతో పాటు కేంద్రంలో ఓబీసీలుగా పరిగణించాలని కూడా సంబంధిత కమిషన్‌కు ఆ ప్రభుత్వం తెలిపింది. తమ విధానానికి మద్ధతుగా మూడు అంశాలను పేర్కొంది...

►పదేళ్ల వయసులోపు పిల్లలు తల్లితండ్రుల్ని కోల్పోయి,  నిరాశ్రయులై ఉండాలి.
► వారి బాగోగులు చూసేందుకు చట్టపరంగా, ఇతరత్రా ఎవరూ లేనివారు.
►  ప్రభుత్వం, అది గుర్తించిన సంస్థల స్కూళ్లు, అనాథ శరణాలయాల్లోనివారు

 ఈ మార్గదర్శకాలకు అనుగుణంగా ఉన్నవారిని తమిళనాడు సర్కార్ బీసీలుగా పరిగణిస్తోంది. ఇదే ప్రాతిపదికన ఇక్కడి అనాథలను కూడా  బీసీ-ఏ(55) క్రమసంఖ్యలో వారిని చేర్చాలని తెలంగాణ ప్రభుత్వమూ నిర్ణయించింది. అయితే తమిళనాడులో 69 శాతం రిజర్వేషన్లు అమల్లో  ఉన్నాయి. ఈ విషయాన్నే  ఇక్కడ బీసీ నేతలు ప్రస్తావిస్తున్నారు.
 
 అభ్యంతరాలు తెలిపితే పరిశీలిస్తాం
 బీసీ సంఘాల వారు అభ్యంతరాల ను రాతపూర్వకంగా తమకు తెలియజేస్తే పరిశీలిస్తామని బీసీ సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శి టి.రాధ వెల్లడించారు. గురువారం బీసీ సంక్షేమసంఘం నేత ఆర్.కృష్ణయ్య, రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్, ఇతర బీసీ, విద్యార్థిసంఘాల ప్రతి నిధులు కలిసిన నేపథ్యంలో ఆమె ఇలా స్పందించారు.
 
 అధ్యయనం లేకుండానా!
 విస్తృత అధ్యయనం చేయకుండా కేవ లం కేబినెట్‌లో నిర్ణయించి, జీవో విడుదల చేయడం సరికాదు. అనాథలంటే మాకూ సానుకూల దృక్ఫథమే ఉంది. ప్రభుత్వం గుర్తించిన సంస్థలంటే అవకతవకలకు ఆస్కారముంది. ప్రస్తుతం నకిలీ ఎంబీబీఎస్ సర్టిఫికెట్లు, ఐఏఎస్ లు పుట్టుకొస్తున్నారు. అందువల్ల ఎమ్మార్వోలు కాకుండా ఆర్డీఓలకు బీసీ సర్టిఫికెట్లు జారీచేసే అధికారమివ్వాలి.     - జాజుల శ్రీనివాస్‌గౌడ్,
 బీసీసంక్షేమసంఘం

Advertisement
Advertisement