బీజేపీ కార్యాలయంపై దాడి.. తీవ్ర ఉద్రిక్తత! | Sakshi
Sakshi News home page

బీజేపీ కార్యాలయంపై దాడి.. తీవ్ర ఉద్రిక్తత!

Published Tue, Jan 3 2017 5:30 PM

BJP office was attacked

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో రాజకీయాలు ఉద్రిక్తంగా మారుతున్నాయి. వారం రోజుల వ్యవధిలో అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ (టీఎంసీ)కి చెందిన ఇద్దరు ఎంపీలను సీబీఐ అరెస్టు చేయడంతో ఆ పార్టీ శ్రేణులు భగ్గుమన్నారు. రోజ్‌వ్యాలీ కుంభకోణంలో సోమవారం టీఎంసీ ఎంపీ సుదీప్‌ బందోపాధ్యాయ్‌ను సీబీఐ అరెస్టు చేసింది.

అంతకుమునుపు ఇదే స్కాంలో టీఎంసీ ఎంపీ తపస్‌ పాల్‌ను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ అరెస్టులను వ్యతిరేకిస్తూ టీఎంసీ విద్యార్థి విభాగం ఆందోళనకు దిగింది. కోల్‌కతాలోని బీజేపీ ప్రధాన కార్యాలయంపై ఆ పార్టీ శ్రేణులు దాడి చేశాయి. కార్యాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. దీనిని పోలీసులు అడ్డుకోవడంతో వారిపై రాళ్లతో దాడులు చేశారు. ఈ ఘటనతో బీజేపీ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.



పెద్దనోట్ల రద్దును తాను బాహాటంగా వ్యతిరేకిస్తుండటంతోనే రాజకీయ కక్షతో తమ పార్టీ ఎంపీలను కేంద్రంలోని నరేంద్రమోదీ సర్కారు అరెస్టు చేయిస్తున్నదని, దీనికి తాను బెదిరేది లేదని టీఎంసీ అధినేత్రి, బెంగాల్‌ సీఎం మమతాబెనర్జీ అంటున్నారు. ఈ విషయంలో తాను చట్టబద్ధమైన పోరాటం చేస్తానని, న్యాయం కోసం కోర్టులను ఆశ్రయిస్తానని ఆమె అంటున్నారు. పశ్చిమ బెంగాల్‌, ఒడిశా, అసోం, జార్ఖండ్‌, పంజాబ్‌, ఢిల్లీ, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, త్రిపుర, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో కోట్లాది మంది చిన్న పెట్టుబడిదారులను మోసం చేసి రూ. 17వేల కోట్ల కుంభకోణానికి రోజ్‌వ్యాలీ చిట్‌ఫండ్‌ సంస్థ పాల్పడిందని, ఈ వ్యవహారంలో అధికార టీఎంసీ నేతల ప్రమేయం కూడా ఉందని సీబీఐ పేర్కొంటున్నది.

Advertisement
Advertisement