ఓపిగ్గా కూర్చుని వినండి... | Sakshi
Sakshi News home page

ఓపిగ్గా కూర్చుని వినండి...

Published Tue, Sep 1 2015 11:01 AM

ఓపిగ్గా కూర్చుని వినండి... - Sakshi

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదాపై అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటన చేశారు. ప్రత్యేక హోదాతో అన్ని వస్తాయన్నది అపోహ అని చెప్పే ప్రయత్నం చేశారు. ప్రత్యేక ప్యాకేజీ కోసం కేంద్రాన్ని అడిగినట్టు వెల్లడించారు. విభజన తర్వాత రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యల గురించి ఏకరువు పెట్టారు.

చంద్రబాబు ప్రసంగం ఆయన మాటల్లోనే..

  • ప్రత్యేక హోదాపై నిన్నటి చర్చ మధ్యలో నిలిచిపోయింది
  • రాష్ట్రంలో ప్రత్యేక హోదా రాదనే ఆవేదనతో, భవిష్యత్తు దెబ్బతింటుందనే ఆవేదనతో ఆత్మహత్యలు చేసుకున్నారు. అలా ఎవరూ చేసుకోవద్దని విజ్ఞప్తి చేస్తున్నాను
  • పద్ధతి లేకుండా ఇష్టానుసారంగా రాష్ట్రాన్ని విభజించారు. ప్రజలను విశ్వాసంలోకి తీసుకోలేదు
  • ఇంతవరకు దేశంలో ఎప్పుడు విభజన జరిగినా స్టేక్హోల్డర్లందరినీ విశ్వాసంలోకి తీసుకునేవారు తప్ప ఏకపక్ష నిర్ణయం ఎప్పుడూ జరగలేదు. మన రాష్ట్రం విషయంలోనే అది జరిగింది.
  • ఒకప్పుడు తమిళనాడులో ఉండే రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్గా విభజించినప్పుడు అందరితో అనేకసార్లు మాట్లాడి విభజించారు
  •  జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్ విషయాల్లో కూడా చర్చించే చేశారు
  • తొలిసారి ఆర్టికల్ 3ని యూపీఏ ప్రభుత్వం అమలు చేసింది. ఆ సమయంలో నావంతుగా నేను చేయాల్సిన ప్రయత్నాలు చేశాను
  • రాష్ట్రం విభజిస్తే వచ్చే నష్టాలేంటో 8 శ్వేతపత్రాలు విడుదల చేశాను
  • సమన్యాయం చేయాలని అప్పుడు, ఇప్పుడు కోరాను.
  • విభజన ఎంత దారుణంగా చేశారంటే, ఆస్తులు భౌగోళికంగా విభజించారు.
  • కనీస ప్రొసీజర్ కూడా యూపీఏ ప్రభుత్వం పాటించలేదు
  •  ఆస్తులు భౌగోళికంగా, అప్పులు మాత్రం జనాభా నిష్పత్తిలో చేశారు
  • 59 శాతం జనాభా ఉండే ఆంధ్రాకు 47 శాతం ఆదాయం వచ్చింది. 41 శాతం జనాభా ఉండే తెలంగాణకు 53 శాతం ఆదాయం వచ్చింది.
  • ఏపీకి ఇప్పుడు రాజధాని లేదు. తెలంగాణకు హైదరాబాద్ ఉంది. పట్టణీకరణ, పెద్ద నగరాలు ఉన్నచోట మాత్రమే రాష్ట్రానికి ఆదాయం వస్తుంది.
  • ఇంతకుముందు జరిగిన విభజనల్లో, రాజధాని ఉన్న ప్రాంతం ఎప్పుడూ విడిపోలేదు. 59 శాతం జనాభా రాజధాని నగరాన్ని విడిచిపోవడం ఇదే మొదటిసారి.
  • ప్రత్యేక సైనిక విమానంలో బిల్లు పంపించి మనోభావాలు దెబ్బతీశారు
  • ఢిల్లీలో ఆరోజు వార్ రూం చర్చలు జరిపారు.. పీస్ రూం కావాలని నేను అన్నాను
  • రోజుల తరబడి అప్పట్లో పార్లమెంటును స్తంభింపజేశారు గానీ, విభజన చట్టం వచ్చినప్పుడు తలుపులు మూసేసి, టీవీలు కట్ చేసి, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసి 40 నిమిషాల్లో బిల్లును ఆమోదించారు
  • ఇంత చేసినా కాంగ్రెస్ పార్టీని చిత్తుచిత్తుగా ఓడించారంటే ప్రజల్లో ఎంత కోపం ఉందే అర్థమవుతుంది
  • ఏపీ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 46/2 ప్రకారం.. 2014-15 సంవత్సరానికి ఏపీకి 15,300 కోట్ల రెవెన్యూ లోటు ఉంటుందని అంచనా వేశారు. ఆ డబ్బు ఇస్తామని హామీ ఇచ్చారు.
  • అసెంబ్లీలో ఏం జరుగుతోందో రాష్ట్రమంతా చూస్తున్నారు. నేను ప్రజలందరికీ జవాబుదారీని.
  • ఓపిగ్గా కూర్చుని వినండి.. తర్వాత ఏం కావాలంటే అది అడగండి
  • ప్రత్యేక హోదా మాత్రమే కాదు, విభజన చట్టంలోని అన్ని అంశాలనూ సాధించాలన్నదే మా ప్రయత్నం
  • హుందాగా ప్రవర్తించకుండా ప్రతిదానికీ పైకిలేస్తే పెద్ద నాయకులనుకుంటున్నారు
  • ఒక ప్రత్యేక హోదానే కాకుండా, ఆరోజు విభజన చట్టంలో పెట్టినవాటి ప్రభావాలు గత 15 నెలలుగా అనుభవించాం.
  • రెండు రాష్ట్రాల మధ్య శాంతిభద్రతల సమస్యలు, ఉద్యోగుల సమస్యలు ఉన్నాయి. అవి మీకు పట్టవా?
  • ఏజీ అంచనా వేస్తే రూ. 14,409 కోట్ల లోటు ఉందని అంచనావేశారు. అందులో 2,300 కోట్లు కేంద్రం ఇచ్చింది. మిగిలింది ఇవ్వాలి
  • రాయలసీమ, ఉత్తరాంధ్రకు ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజి ఇస్తామని చెప్పారు
  • ఒక్కో జిల్లాకు 300 కోట్ల చొప్పున ఐదేళ్ల పాటు ఇవ్వాలని అడిగాం. కేంద్రం మొదటి సంవత్సరం 50 కోట్లు ఇచ్చింది.
  • కొత్త రాజధాని నగరం హైదరాబాద్లా ఉండాలంటే 20 ఏళ్లు పడుతుందని చెప్పాను.
  • రాజ్భవన్, హైకోర్టు, అసెంబ్లీ, మండలి, సచివాలయం, మిగిలిన సదుపాయాలతో హైదరాబాద్ కంటే పెద్ద రాజధాని కడతామని పెట్టారు
  • ఇప్పటికి 1500 కోట్లు ఇచ్చారు. ఇది చాలదని, మరిన్ని నిధులు ఇవ్వాలని కోరాను.
  • ప్రత్యేక హోదా కావాలి. అయితే, మిగిలిన సమస్యలు మీకు కనపడలేదా? కనపడినా ఊరుకున్నారా
  • సెక్షన్ 50, 51, 56 ఒకదానికొకటి పూర్తి కాంట్రడిక్టరీ
  • వెనకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం 371 డి ద్వారా రిజర్వేషన్లు కల్పిస్తామన్నారు. కానీ, దీనివల్ల ఆదిలాబాద్లో ఉండేవాళ్లు శ్రీకాకుళంలో ఉద్యోగాలు చేయచ్చు. శ్రీకాకుళం వాళ్లు వరంగల్లో ఉద్యోగాలు చేయచ్చు. కానీ దీన్ని సవరించాలంటే 2/3 మెజారిటీతో రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుంది.
  • దీనివల్ల హైదరాబాద్లో చదువుకున్నవాళ్లు ఏపీకి వస్తే వాళ్లు నాన్ లోకల్ అవుతున్నారు.
  • మొన్న ఒకతను ఉద్యోగం కోసం వచ్చాడు. నాన్ లోకల్ కాబట్టి ఇవ్వలేమంటే.. ఆత్మహత్యాయత్నం చేశాడు
  • విభజన వల్ల అనేక సమస్యలు రాష్ట్రానికి వచ్చాయి. నేను తెలంగాణ ప్రభుత్వానికి అనేక సార్లు విజ్ఞప్తి చేశాను
  • కూర్చుని మాట్లాడుకుని సమస్యలు పరిష్కరించుకుందామని అప్పీలు చేశాను.
  • కానీ దురదృష్టవశాత్తు వాళ్లు ముందుకు రాలేదు
  • కర్ణాటకలో ఇష్టానుసారంగా ప్రాజెక్టులు కడుతున్నారు. దాంతో మనకు నీళ్లు లేని పరిస్థితి ఏర్పడింది
  • ప్రత్యేక హోదా గురించి ప్రతిపక్ష నాయకుడితోపాటు రాష్ట్రానికి చెందిన నాయకులు చెప్పిన విషయాలన్నింటినీ తాను విన్నట్లు నాటి ప్రధాని చెప్పారు.
  • దీన్ని అమలుచేయాలని నాడు అరుణ్ జైట్లీ, వెంకయ్య నాయుడు అప్పట్లో గట్టిగా పోరాడారు
  • ఇప్పుడు కూడా మనం పోరాడుతున్నాం. దీన్ని అమలుచేయాలని అడుగుతున్నాం
  • ఇటీవల నేను ఢిల్లీ వెళ్లినప్పుడు ప్రధానికి లేఖ ఇచ్చాను. అందులో మొదటి అంశం ప్రత్యేక హోదా. గంటన్నర మాట్లాడినప్పుడు దాని గురించి చెబుతూనే.. ఇంకా చాలా విషయాలను చెప్పాను.
  • ఇప్పుడు చదివి వినిపించిన అంశాలన్నింటినీ ఆయనకు వివరించాను.
  • రెండు రాష్ట్రాలను తగలబెట్టొద్దని స్పష్టంగా కోరాను.

Advertisement
Advertisement