పాక్‌ అనుకున్నట్టు చైనా ఏం చేయదు! | Sakshi
Sakshi News home page

పాక్‌ అనుకున్నట్టు చైనా ఏం చేయదు!

Published Tue, Mar 28 2017 3:30 PM

పాక్‌ అనుకున్నట్టు చైనా ఏం చేయదు! - Sakshi

ఇస్లామాబాద్: చైనా విషయంలో పాకిస్థాన్‌ అప్రమత్తంగా ఉండాలని ఆ దేశ మాజీ రాయబారి ఒకరు తాజాగా పేర్కొన్నారు. పాకిస్థాన్‌ తన అంతర్గత సమస్యలను తానే పరిష్కరించుకోవాలని, పాక్‌ సమస్యలను చైనా ఎప్పుడూ తనదిగా భావించి నెత్తిన వేసుకోబోదని, అమెరికా, భారత్‌లతో విభేదాలను దృష్టిలో పెట్టుకొనే ఆ దేశం పాక్‌తో సన్నిహితంగా మెలుగుతున్నదని అష్రఫ్‌ జహంగీర్‌ ఖాజీ స్పష్టంచేశారు. 'అమెరికా విదేశీ విధానం, ట్రంప్‌ పాలన: ఒక సమీక్ష' పేరిట నిర్వహించిన సదస్సులో అమెరికాలో పాక్‌ రాయబారిగా పనిచేసిన జహంగీర్‌ మాట్లాడారు.

'హిందూ మహా సముద్రంలోనూ, యావత్‌ ఆసియా ఖండంలోనూ ప్రధాన శక్తిగా చైనా ముందుకొస్తున్నప్పటికీ ఆ దేశం ఏ దేశాన్ని సవాల్‌ చేయడం లేదు. ఈ నేపథ్యంలో చైనాను ట్రంప్‌ ఎలా ఎదుర్కొంటారన్నది చూడాలి' అని పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ తాను ఆశిస్తున్న కలలను నెరవేర్చుకోవడం అంత సులభం కాదని పాక్‌ మాజీ విదేశాంగమంత్రి ఇనాముల్‌ హక్‌ పేర్కొన్నారు. 'ప్రమాదకరమైన భవిష్యత్తు దిశగా ప్రపంచం సాగుతోంది. అంతర్జాతీయ సమాజాన్ని ఇబ్బందిపెట్టే పరిణామాలు పెరిగిపోతున్నాయి' అని ఆయన అన్నారు.

Advertisement
Advertisement