చౌదరికి ఐడియా లేదు.. | Sakshi
Sakshi News home page

చౌదరికి ఐడియా లేదు..

Published Sat, Aug 15 2015 5:38 AM

చౌదరికి ఐడియా లేదు.. - Sakshi

సాక్షి, విజయవాడ బ్యూరో: ‘‘చౌదరి గారు (కేంద్రమంత్రి సుజనా చౌదరి) ఐడియా లేకుండా మాట్లాడుతున్నారు.. రాష్ట్రానికి ప్యాకేజీ కాదు.. విభజన సమయంలో కేంద్రం ఇచ్చిన హామీలను అమలు చేయాల్సిందే.. నేను ప్రధాని పిలుపుకోసం చూస్తున్నా.. ఆయనతో అన్నీ మాట్లాడుతా’’ అని సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. విజయవాడ క్యాంపు కార్యాలయంలో శుక్రవారం రాత్రి మీడియా సమావేశంలో ‘కేంద్రప్రభుత్వం రాష్ట్రాన్ని విభజించిన తీరు, పార్టీల వైఖరి, పార్లమెంటులో ఆమోదం’ అనే అంశాలపై వివరణ పత్రం-2ను సీఎం విడుదల చేశారు.

అన్ని పార్టీలూ ఏపీకి ప్రత్యేక హోదాకోసం అడుగుతుంటే కేంద్రమంత్రి సుజనాచౌదరి నెలాఖరులోగా ప్రత్యేక ప్యాకేజీ వస్తుందని చెప్పిన విషయంపై మీడియా ప్రతినిధులు ఈ సందర్భంగా సీఎంను ప్రశ్నించారు. దీంతో చంద్రబాబు బదులిస్తూ చౌదరి గారికి ఐడియా లేక అలా మాట్లాడారని బదులిచ్చారేతప్ప.. రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుందా? లేదా? అన్నవిషయంపై స్పష్టత ఇవ్వలేదు.

ఎన్‌డీఏ హయాంలో మూడు రాష్ట్రాల విభజన చేసినా ఎటువంటి ఇబ్బందులు రాలేదని సీఎం అన్నారు. కానీ యూపీఏ హయాం లో అడ్డగోలుగా రాష్ట్రాన్ని విభజించారన్నారు. తమిళనాడు ప్రయోజనాలకోసం అప్పటి ఆర్థిక మంత్రి చిదంబరం, మహారాష్ట్ర ప్రయోజనాలకోసం నాటి హోంమంత్రి షిండే,  కొడుకును ప్రధానిని చేయాలని సోనియా విభజన ప్రక్రియకు కొమ్ముకాశారని ఆయన ఆరోపిం చారు. తన ఫోన్ ట్యాపింగ్ జరిగిన సంగతిపై కేంద్రానికి ఫిర్యాదు చేశానని చెప్పారు.
 
సీఎంతో మైక్రోసాఫ్ట్ ఎండీ భేటీ
మైక్రోసాఫ్ట్ ఎండీ అనిల్ బన్సారీ శుక్రవారం విజయవాడలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఏపీలో తమ సంస్థ కార్యకలాపాల విస్తరణకు తోడ్పడాలని సీఎంను కోరారు. రాష్ట్రాన్ని సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ హబ్‌లుగా తీర్చిదిద్దాలన్న ప్రభుత్వ అకాంక్షకు అనుగుణంగా సేవలు అందిస్తామని చెప్పారు.
 
శ్రీకాకుళంలో పైలట్ ప్రాజెక్టుగా ‘వైట్‌స్పేసెస్’

వినియోగంలోలేని టీవీ స్పెక్ట్రంను ఉపయోగించి తక్కువధరకే ఇంటర్నెట్ సదుపాయాన్ని అందించే ‘వైట్‌స్పేసెస్’ ప్రాజెక్టును మైక్రోసాఫ్ట్ సంస్థ శ్రీకాకుళంలో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించనుంది. ఈ ప్రాజెక్టు ద్వారా సామాన్యులకు ఇంటర్నెట్ అందుబాటులోకి వస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు.
 
18, 19 తేదీల్లో ఢిల్లీ పర్యటన

సాక్షి, హైదరాబాద్: ఈ నెల 18, 19 తేదీల్లో సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్న రాష్ట్ర అంశాలపై ప్రధానిమోదీతో పాటు పలువురు మంత్రులను కలసి చర్చించడంతో పాటు వినతిపత్రాలను సమర్పించనున్నారు.ప్రత్యేక హోదాపై రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాన్ని ఇటీవలే ప్రతిపక్షనేత జగన్‌మోహన్‌రెడ్డి ఢిల్లీలో ధర్నా  ద్వారా చాటి చెప్పారు. ఈ నేపథ్యంలో సీఎం ఢిల్లీ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.

Advertisement
Advertisement