మార్చి 31 తర్వాత ఆ నోట్లు చెల్లవు | Sakshi
Sakshi News home page

మార్చి 31 తర్వాత ఆ నోట్లు చెల్లవు

Published Wed, Jan 29 2014 1:20 AM

మార్చి 31 తర్వాత ఆ నోట్లు చెల్లవు

 ముంబై: ఐదు రూపాయల నుంచి వెయ్యి రూపాయల వరకు... ఏ నోటైనా సరే! 2005 కన్నా ముందు ముద్రించినట్లయితే అది మార్చి 31 తరవాత చెల్లదు. మార్చి 31 తరవాత ఈ నోట్లను ఏ లావాదేవీలోనూ, ఏ కొను గోలులోనూ ఉపయోగించలేరు. ఒకవేళ అప్పటికీ మీ దగ్గర ఇలాంటి నోట్లు మిగిలిపోతే వీటిని బ్యాంకులకు ఇవ్వాల్సి ఉంటుంది. బ్యాంకులు వీటిని తీసుకుని... బదులుగా 2005 తరవాత ముద్రించిన నోట్లను మీకు అందజేస్తాయి.

అయితే మార్చి 31 దాకా వీటిని ఏ లావాదేవీలోనైనా యథేచ్చగా వినియోగించవచ్చు. బ్యాంకుల్లో డిపాజిట్లు చేయటం సహా ఏదైనా చేయొచ్చు. మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో రిజర్వు బ్యాంకు ఈ విషయాలను స్పష్టంగా పేర్కొంది.

 మంగళవారం నాటి ప్రకటనలో నోట్ల మార్పిడిపై బ్యాంకులన్నిటికీ ఆర్‌బీఐ తగు సూచనలు చేసింది. మార్చి 31 తరవాత ఇవి చెల్లవు కనక... వీటిని ఏ బ్యాంకు బ్రాంచిలోనైనా ఇచ్చి మార్పు చేసుకోవచ్చని స్పష్టంచేసింది. ‘‘ఇలా జులై 1వ తేదీ వరకూ ఏ బ్రాంచిలోనైనా, ఎన్ని నోట్లయినా మార్చుకోవచ్చు. జులై 1 తరవాత కూడా ఏ బ్రాంచిలోనైనా నోట్లను మార్పిడి చేసుకునే అవకాశం ఉంటుంది.

ఆ బ్రాంచిలో మీకు ఖాతా లేకున్నా సరే!. అయితే సదరు బ్యాంకులో ఖాతా లేనివారు రూ.500, రూ.1000 నోట్లను 10 కన్నా ఎక్కువ ఇస్తే మాత్రం వారి గుర్తింపు కార్డు, నివాస ధ్రువీకరణ వివరాలను ఆ బ్రాంచిలో ఇవ్వాల్సి ఉంటుంది. ఖాతా ఉన్న బ్రాంచిలో గనక ఎన్ని నోట్లిచ్చినా వివరాలు ఇవ్వాల్సిన అవసరం లేదు’’ అని ఆర్‌బీఐ వివరించింది. ఈ ప్రక్రియకు బ్యాంకులన్నీ సహకరించాలని తన నోట్‌లో కోరింది.

 ఇకపై బ్యాంకులు తమ కస్టమర్లకు 2005కు ముందు ముద్రించిన నోట్లను ఇవ్వకూడదని, ఎవరైనా పాత నోట్లను తీసుకొచ్చి కొత్తవి ఇవ్వాలని అడిగితే మార్పు చేయాలని బ్యాంకులకు సూచించింది. 2005కు ముందు ముద్రించిన నోట్లను ఎలా గుర్తు పట్టాలనే విషయమై ఆర్‌బీఐ ఇప్పటికే కొన్ని సూచనలు చేసింది.
 
 ఇది గుర్తుంచుకోండి...
 2005 తరవాత ముద్రించిన నోట్ల వెనక వైపున దాని ముద్రణ సంవత్సరం ఉంటుంది. 2005కు ముందు ముదించిన నోట్ల వెనక ఎలాంటి తేదీ కానీ సంవత్సరం కానీ ఉండదు. నోట్ల వెనక సంవత్సరం కనక లేకున్నట్లయితే... దాన్ని పాత నోటుగానే భావించాలి.పాత నోట్లు కూడా మార్చి 31 వరకూ యథావిధిగా చెల్లుతాయి. ఆ తర్వాత కూడా వీటిని బ్యాంకుల్లో ఇచ్చి మార్పిడి చేసుకోవచ్చు.

 నకిలీ కరెన్సీని నిరోధించడానికే: రాజన్
 నకిలీ కరెన్సీని నిరోధించడానికే ఈ చర్య తీసుకున్నట్లు మంగళవారం ఉదయం ఒక సమావేశంలో ఆర్‌బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ స్పష్టంచేశారు. ‘‘నల్ల ధనం, పన్ను ఎగవేతల వంటివి మంచి పనులని నేను చెప్పటం లేదు. కానీ మా నిర్ణయం మాత్రం వాటి నివారణకు తీసుకున్నది కాదు’’ అన్నారాయన. గతంలో జారీచేసిన నోట్లలో సెక్యూరిటీ ఫీచర్లు చాలా తక్కువని, వాటిని ఉపసంహరించుకోవడానికి ఇదో సాంకేతికపరమైన చర్యని తెలియజేశారు. 2005 క్రితం నోట్లతో పోలిస్తే తరవాత ముద్రించిన నోట్లలో 6 నుంచి 8 భద్రత ఫీచర్లు అదనంగా ఉన్నట్లు తెలిపారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement