Sakshi News home page

ఢిల్లీలో మరో లొల్లి

Published Fri, Jan 1 2016 3:18 AM

Delhi babus go on mass leave; AAP govt sees 'conspiracy'

రాష్ట్రంలోని ఉన్నతాధికారుల మూకుమ్మడి సెలవు
* డానిక్స్ అధికారుల ‘సస్పెన్షన్’పై నిరసన
* ఆ అధికారుల సస్పెన్షన్ చెల్లదు: హోంశాఖ

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మరో రగడ రాజుకుంది. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల మధ్య ఇంకో వివాదం ముదురుతోంది. ఇద్దరు డానిక్స్ అధికారులను సస్పెండ్ చేయటానికి నిరసనగా.. ఢిల్లీ రాష్ట్ర సర్కారులోని సీనియర్ అధికారులంతా గురువారం మూకుమ్మడి సెలవు పెట్టారు. ఆ ఇద్దరు అధికారులను సస్పెండ్ చేయటం చెల్లదని కేంద్రంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం పేర్కొనగా.. రాజధానిలో శుక్రవారం నుంచి అమలు చేయనున్న ‘సరి - బేసి’ కార్యక్రమాన్ని విఫలం చేసే కుట్రలో భాగమే అధికారుల సమ్మె అని ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వం ఆరోపించింది.
 
కేబినెట్ నిర్ణయాన్ని అమలు చేయనందుకు సస్పెన్షన్...
 పబ్లిక్ ప్రాసిక్యూటర్ల జీతాలు పెంచుతూ రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయానికి సంబంధించిన ఫైలుపై సంతకాలు చేయటానికి ఢిల్లీ హోంశాఖలో ప్రత్యేక కార్యదర్శులు యశ్పాల్‌గార్గ్, సుభాష్‌చంద్రలు నిరాకరించటంతో వారిని ఆప్ సర్కారు సోమవారం నాడు సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ చర్యకు నిరసనగా ఢిల్లీ సర్కారులోని దాదాపు 200 మంది డానిక్స్ (ఢిల్లీ, అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ సివిల్ సర్వీస్) కేడర్ అధికారులు గురువారం రోజంతా మూకుమ్మడి సెలవు పెట్టగా.. మరో 70 మందికి పైగా ఐఏఎస్ అధికారులు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ సమ్మె చేశారు.
 
సుదీర్ఘ సెలవులో వెళితే సంతోషం: కేజ్రీవాల్
సమ్మెలో పాల్గొన్న అధికారులపై చర్యలు తీసుకునే అవకాశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని సీఎం కేజ్రీవాల్ హెచ్చరించారు.  డానిక్స్, ఐఏఎస్ సంఘాలు బీజేపీ బీ-టీమ్ (ప్రత్యామ్నాయ బృందం)గా తయారయ్యాయని విమర్శించారు. ప్రధానమంత్రి మోదీ.. లెఫ్టినెంట్ గవర్నర్, ఇతర అధికారుల ద్వారా ఢిల్లీ ప్రభుత్వంపై దాడి చేస్తున్నారని ట్విటర్‌లో ఆరోపించారు. ‘‘వీళ్లు (ఢిల్లీ అధికారులు) సుదీర్ఘ సెలవులో వెళ్తే జనం సంతోషిస్తారు. వారికి వేతనంతో కూడిన సెలవు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ’’ అని పేర్కొన్నారు.

శుక్రవారం నుంచి అమలు చేయనున్న ‘సరి - బేసి’ పథకాన్ని విఫలం చేసే కుట్ర ఇదని ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా అన్నారు. అధికారులకు సమ్మెపై వెళ్లే హక్కు లేదని.. అది వారి సర్వీసు నిబంధనలకు విరుద్ధమని ఢిల్లీ హోంమంత్రి సత్యేంద్రజైన్ పేర్కొన్నారు.
 
వారి సస్పెన్షన్ చెల్లదు: కేంద్ర హోంశాఖ
ఇద్దరు డానిక్స్ అధికారుల సస్పెన్షన్‌పై లెఫ్టినెంట్ గవర్నర్ ద్వారా సమాచారం అందిందని.. ఈ ఉత్తర్వును పొరపాటుగా లేదా మనుగడలో లేనిదిగా ప్రకటిస్తున్నామని కేంద్ర హోంశాఖ  పేర్కొంది. సదరు అధికారులు ఇద్దరూ విధుల్లో ఉన్నట్లే పరిగణించాల్సి ఉంటుందని హోంశాఖ అధికార ప్రతినిధి చెప్పారు.

Advertisement

What’s your opinion

Advertisement