రైతుల అప్పులన్నీ ప్రభుత్వ ఖాతాలోకి.. | Sakshi
Sakshi News home page

రైతుల అప్పులన్నీ ప్రభుత్వ ఖాతాలోకి..

Published Mon, Sep 14 2015 12:56 AM

రైతుల అప్పులన్నీ ప్రభుత్వ ఖాతాలోకి.. - Sakshi

* ‘జాగృతి’ రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రొఫెసర్ కోదండరాం డిమాండ్
* ఇందుకు ఆర్‌బీఐని రాష్ట్ర ప్రభుత్వం ఒప్పించాలి
* ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు పరిహారం రూ.5 లక్షలకు పెంచాలి
* రైతుల ఆత్మహత్యలపై ప్రభుత్వం స్పందించే తీరు మారాలి
* రైతు కుటుంబాల దత్తతకు ముందుకు రండి: ఎంపీ కవిత పిలుపు
సాక్షి, హైదరాబాద్: ‘‘రైతుల పేర బ్యాంకుల్లో ఉన్న రుణాల(అప్పు)ను ప్రభుత్వ ఖాతాలోకి బదిలీ చేయాలి. తక్షణం రైతులను రుణ విముక్తులను చేయాలి.

రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఢిల్లీ వెళ్లి ఆర్‌బీఐపై ఒత్తిడి తేవాలి. రైతుల ఆత్మహత్యలు జరగలేదని గత ప్రభుత్వాలు చెప్పేవి. ఈ పద్ధతికి స్వస్తి చెప్పాలి. రైతుల ఆత్మహత్యలను తక్కువ చేయడం మానుకోవాలి. కారణం ఏదైనా, ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాన్ని ఆదుకోవాలి. వారికి ప్రభుత్వమే భరోసా ఇవ్వాలి. ఇది మానవీయ ధృక్పథం కూడా..’’ అని తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. రైతుల్లో భరోసా నింపేందుకు తెలంగాణ జాగృతి ఆదివారం హైదరాబాద్‌లో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించింది.

జాగృతి అధ్యక్షురాలు, నిజామాబాద్ ఎంపీ కవిత అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ.. రైతులకు అండగా ఉంటామని, రైతు జేఏసీ ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. ‘రైతులు ఆత్మహత్యలు చేసుకోవద్దు. మీరు చనిపోతే, మీ కుటుంబానికి మాత్రమే కాదు, మొత్తం సమాజానికి బాధ. ఏ సమస్యకూ ఆత్మహత్య పరిష్కారం కాదు..’ అని అన్నారు. 421 జీవో మేరకు ఆర్థిక దుస్థితితో చనిపోతే అది ఆత్మహత్యే అని, నష్టపరిహారాన్ని రూ.1.5 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే ‘సమగ్ర వ్యవసాయ విధానం’ ప్రకటించాలని కోదండరాం కోరారు.
 
ఇవీ.. సూచనలు
దాదాపు రెండున్నర గంటల పాటు సాగిన రౌండ్ టేబుల్ సమావేశంలో రైతుల ఆత్మహత్యల నివారణకు పలు సలహాలు, సూచనలు వచ్చాయి. రైతుల సమస్యలు వినడానికి వ్యవసాయ అధికారులు సిద్ధంగా లేరని, రైతులకు ఆదాయ భధ్రత విధానం అమల్లోకి తేవాలని వ్యవసాయరంగ విశ్లేషకులు రామాంజనేయులు సూచించారు. సన్న, చిన్నకారు రైతులే ఒత్తిడిలో ఉన్నారని, వీరికి ఉపాధి అవకాశాలు పెంచాలని ఆర్థిక సామాజిక అధ్యయన కేంద్రం ప్రతినిధి రేవతి పేర్కొన్నారు.

వ్యవసాయ రంగం సంక్షోభానికి రైతుల ఆత్మహత్యలే సూచనని, రైతు ఆత్మహత్య చేసుకుంటే భార్యాభర్తల గొడవలే కారణమని తేలిగ్గా తీసుకుంటున్నారని ఓ ఎన్‌జీవో ప్రతినిధి సజయ ఆవేదన వ్యక్తం చేశారు. దీనిని వృత్తిపరమైన ఒత్తిడిగా గుర్తించాలని, రైతులకు కౌన్సెలింగ్ ఇవ్వాలని రెయిన్‌బో ఫౌండేషన్ డెరైక్టర్ అనురాధ డిమాండ్ చేశారు.

రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్న ప్రాంతాలను అధ్యయనం చేయాలని, అశాస్త్రీయంగా ఉన్న బీమా విధానాన్ని మార్చాలని తెలంగాణ వికాస కమిటీ కోఆర్డినేటర్ శ్రీధర్ కోరారు. వ్యవసాయాన్ని ప్రయారిటైజ్ చేయాలని, వ్యవసాయాన్ని స్థానిక సంస్థలకు లింక్ చేయాలని సామాజిక ఉద్యమకారిణి రమా మెల్కోటే, సమష్టి వ్యవసాయ విధానాన్ని అమల్లోకి తేవాలని టీఆర్‌ఎస్ నాయకుడు దేవీప్రసాద్, ఎమ్మెల్యే సీహెచ్ రమేష్ సూచించారు.
 
‘ఈచ్ వన్.. అడాప్ట్ వన్’
రాష్ట్ర రైతాంగానికి ప్రభుత్వం అండగా ఉంటుందని, రౌండ్ టేబుల్ సమావేశంలో అందిన సూచనలు, సలహాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళతానని ఎంపీ కవిత పేర్కొన్నారు. ఇప్పటికే ప్రభుత్వం చేపడుతున్న వివిధ కార్యక్రమాల గురించి వివరించారు. ‘‘ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను అక్కున చేర్చుకోవాలి. ఈచ్ వన్.. అడాప్ట్ వన్ నినాదంతో జాగృతి కార్యకర్తలు, టీఆర్‌ఎస్ కార్యకర్తలు, ఎన్‌ఆర్‌ఐ మిత్రులు, దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న తెలంగాణ బిడ్డలు, ఒక్కో కుటుంబాన్ని దత్తత తీసుకునేందుకు ముందుకు రావాలి. పిల్లల చదువులు, అప్పులు తీర్చే ఆలోచన చేయాలి. ప్రతీ గ్రామంలో పనిచేయాలి. రైతులకు భరోసాగా ఉండండి..’ అని ఎంపీ కవిత పిలుపునిచ్చారు.

Advertisement
Advertisement