టీచర్ పోస్టుల్లో మిగిలేవెన్ని? | Sakshi
Sakshi News home page

టీచర్ పోస్టుల్లో మిగిలేవెన్ని?

Published Fri, Jan 15 2016 2:50 AM

టీచర్ పోస్టుల్లో మిగిలేవెన్ని? - Sakshi

* డీఎస్సీ ప్రకటన నాటికి తగ్గిపోనున్న ఉపాధ్యాయ ఖాళీలు
* గత డీఎస్సీల్లో నష్టపోయిన వారు 6,907 మంది
* వీరిని తాత్కాలికంగా నియమించినా తగ్గనున్న ఖాళీలు

సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇప్పటివరకు ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులు సుమారు 10,961... విద్యాశాఖ ప్రాథమిక లెక్కల ప్రకారం గత డీఎస్సీల్లో నష్టపోయిన అభ్యర్థుల సంఖ్య 6,907.. మరి ఖాళీగా ఉన్న పోస్టుల్లో ఎన్నింటిలో గత డీఎస్సీల్లో నష్టపోయినవారిని నియమిస్తారు, మరెన్ని పోస్టులకు కొత్త డీఎస్సీ నిర్వహిస్తారన్నది గందరగోళంగా మారింది.
 
ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ మేరకు వివిధ డీఎస్సీల్లో నష్టపోయిన వారికి న్యాయం చేసేందుకు ప్రభుత్వం వివిధ కోణాల్లో పరిశీలన జరుపుతోంది. వారిని కన్సాలిడేటెడ్ పేతో తాత్కాలిక పద్ధతిన నియమించాలన్న అంశంపై ఆలోచనలు చేస్తోంది. దీంతో ఖాళీగా ఉన్న పోస్టుల్లో సగానికిపైగా వారితో తాత్కాలికంగా భర్తీ చేస్తే.. డీఎస్సీ ద్వారా భర్తీ చేసేందుకు మిగిలే పోస్టులు ఎన్ని? అన్న ఆందోళన దాదాపు 5 లక్షల మంది ఉపాధ్యాయ అభ్యర్థుల్లో నెలకొంది. వారు ఇప్పటికే తమ జిల్లాల్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి.. ఎన్ని పోస్టులు తగ్గుతాయి, ఎన్ని పోస్టులను డీఎస్సీ ద్వారా భర్తీ చేస్తారన్న లెక్కలు వేసుకుంటున్నారు.

అయితే గత డీఎస్సీల్లో నష్టపోయామంటున్న అందరికీ న్యాయం చేసే చర్యలు చేపడతారా, లేదా అభ్యర్థి వారీగా పరిశీలన జరిపి వాస్తవంగా నష్టం జరిగినట్లు తేలితే కన్సాలిడేటెడ్ పేతో నియమిస్తారా? అన్నది తేలాల్సి ఉంది. ఒకవేళ పాత డీఎస్సీల్లో నష్టపోయిన వారందరినీ తాత్కాలిక పద్ధతిన తీసుకుంటే.. కొత్త డీఎస్సీ ద్వారా భర్తీ చేసే పోస్టుల సంఖ్య భారీగా తగ్గిపోతుందన్న ఆందోళన నెలకొంది.

Advertisement
Advertisement