Sakshi News home page

అమెరికా వడ్డీరేట్లు పెంచితే కష్టమే..

Published Wed, Mar 18 2015 12:02 AM

అమెరికా వడ్డీరేట్లు పెంచితే కష్టమే..

 ముంబై: అగ్రరాజ్యం అమెరికా వడ్డీ రేట్లను పెంచిన పక్షంలో వర్ధమాన దేశాల నుంచి మరోసారి పెట్టుబడులు పెద్ద ఎత్తున తరలిపోవచ్చని ఐఎంఎఫ్ ఎండీ క్రిస్టీన్ లగార్డ్ హెచ్చరించారు. దీంతో పాటు మార్కెట్లలో మళ్లీ భారీ హెచ్చుతగ్గులు చూడాల్సి రావొచ్చన్నారు. ఈ పర్యవసానాలు ఎదుర్కొనేందుకు భారత్ సహా వర్ధమాన దేశాలు సిద్ధంగా ఉండాలని ఆమె సూచించారు. ‘సంప్రదాయానికి భిన్నమైన ద్రవ్య విధానాలు.. వర్ధమాన దేశాలు నేర్చుకోతగిన పాఠాలు’ అంశంపై మంగళవారం రిజర్వ్ బ్యాంక్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా లగార్డ్ ఈ విషయాలు తెలిపారు.

‘సహాయక ప్యాకేజీల ఉపసంహరణ ప్రభావాలు ఇక్కడితో ఆగిపోకపోవచ్చు. అమెరికాలో వడ్డీ రేట్ల పెంపు తీరు మార్కెట్లను ఆశ్చర్యపర్చే విధంగానే ఉండొచ్చు. ఇన్వెస్టర్లు తమ పోర్ట్‌ఫోలియోల్లో మార్పులు, చేర్పులు చేయొచ్చు. దీంతో పెట్టుబడులు భారీగా వెనక్కి వెళ్లిపోయి, మార్కెట్లు మరోసారి భారీ హెచ్చుతగ్గులకు లోను కావొచ్చు’ అని లగార్డ్ పేర్కొన్నారు. వడ్డీ రేట్ల పెంపు ఎప్పుడు జరుగుతుంది, పెరుగుదల తీరు ఎంత వేగంగా .. ఏ విధంగా ఉంటుందనేది మార్కెట్లను ఎప్పటికప్పుడు ఆశ్చర్యపరుస్తూనే ఉండొచ్చని ఆమె అభిప్రాయపడ్డారు.
 
 సెంట్రల్ బ్యాంకులు కలసి పనిచేయాలి...
 2007-08 నాటి ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో పాశ్చాత్య దేశాలు అనుసరించిన ద్రవ్య విధానాలు.. వర్ధమాన దేశాలకు కొంత ప్రయోజనం చేకూర్చాయని లగార్డ్ చెప్పారు. 2009-12 మధ్య వర్ధమాన దేశాల్లోకి 4.5 లక్షల కోట్ల డాలర్ల మేర పెట్టుబడులు రాగా, భారత్‌లోకి 47,000 కోట్ల డాలర్లు వచ్చాయని పేర్కొన్నారు. దీంతో స్థానిక కరెన్సీల మారక విలువలతో పాటు బాండ్లు, షేర్లూ భారీగా పెరిగాయన్నారు. అయితే, ఈ సానుకూలాంశంతో పాటు వర్ధమాన దేశాలకు రిస్కులు కూడా క్రమంగా పెరిగాయన్నారు. 2013లో ప్యాకేజీల ఉపసంహరణ వార్తలు వచ్చిన తరుణంలో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు భారత్ నుంచి దాదాపు 19 బిలియన్ డాలర్లను వెనక్కి తీసుకెళ్లిపోయారని ఆమె చెప్పారు. దీంతో రూపాయి మారకం విలువ డాలర్‌తో పోలిస్తే రికార్డు కనిష్ట స్థాయి 68.85కి పడిపోయిందన్నారు. ఇలా.. రెండేళ్ల క్రితం చోటుచేసుకున్న పరిణామాలు పునరావృతం కాకుండా మార్కెట్లలో అనిశ్చితి పరిస్థితులను నియంత్రించేందుకు వర్ధమాన దేశాలు సంసిద్ధంగా ఉండాలని లగార్డ్ సూచించారు. ప్యాకేజీల ఉపసంహరణ, వడ్డీ రేట్ల పెంపునకు సంబంధించిన ప్రతికూల ప్రభావాలను తగ్గించేందుకు ప్రపంచ దేశాల సెంట్రల్ బ్యాంకులు కలసి పనిచేయాల్సి ఉంటుందన్న రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురామ్ రాజన్ వ్యాఖ్యలతో లగార్డ్ ఏకీభవించారు.
 
 పాఠాలు నేర్పాయి..

 ప్యాకేజీల ఉపసంహరణ పరిణామాలు ప్రపంచానికి ప్రధానంగా మూడు పాఠాలు నేర్పాయని లగార్డ్ చెప్పారు. సంపన్న దేశాలు సహాయం అందించగలవన్నది మొదటి పాఠం అని వివరించారు. ముందు నుంచీ తమ మార్కెట్లను నియంత్రించుకోగలిగిన వర్ధమాన దేశాలు, ప్యాకేజీల ఉపసంహరణ అనంతరం కూడా మెరుగ్గా రాణించగలవన్నది రెండో పాఠం కాగా.. మార్కెట్లు హెచ్చుతగ్గులకు లోనైన పక్షంలో సెంట్రల్ బ్యాంకులు తక్షణమే తగు చర్యలు తీసుకునేందుకు సంసిద్ధంగా ఉండాలన్నది మూడో పాఠమని ఆమె పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితి తలెత్తినప్పుడు.. విదేశీ మారక విలువల్లో హెచ్చుతగ్గులను సరిదిద్దడంతో పాటు కొన్ని రంగాలకు తాత్కాలికంగానైనా తోడ్పాటు అందించాల్సి ఉంటుందన్నారు.
 
 రాజన్ హెచ్చరించినా..
 2008లో రుణ సంక్షోభం తలెత్తగలదంటూ 2005లోనే రాజన్ హెచ్చరించినా.. ఐఎంఎఫ్ పట్టించుకోకపోవడం పెద్ద తప్పిదమని లగార్డ్ అభిప్రాయపడ్డారు. కానీ ప్రస్తుతం మాత్రం ఆయన చెప్పేదేదైనా సరే ఐఎంఎఫ్ శ్రద్ధగా ఆలకిస్తోందన్నారు. అత్యుత్తమ ఆర్థికవేత్తల్లో ఆయన ఒకరన్నారు. ఇటు కరెన్సీ సంక్షోభం తలెత్తకుండా దేశాన్ని గట్టెక్కించడంలో రాజన్ భేషైన పాత్ర పోషించారంటూ లగార్డ్ కితాబిచ్చారు. ఆర్‌బీఐ కీలక రంగాలకు విదేశీ మారకం లభ్యమయ్యేలా చూడటం, రూపాయి క్షీణతను కృత్రిమంగా నిలువరించకుండా వదిలేయడం మొదలైనవి దేశ ఎకానమీ కోలుకునేందుకు తోడ్పడ్డాయని చెప్పారు. ఇతర వర్ధమాన దేశాలతో పోలిస్తే ఇటు దేశంలో అంతర్గతంగా, అటు అంతర్జాతీయంగా వచ్చే సమస్యలను భారత్ సమర్ధమంతంగా ఎదుర్కొనగలిగిందన్నారు. రాజన్‌ను ప్రశంసిస్తూ.. భారత ద్రవ్యపరపతి విధానం సురక్షితమైన చేతుల్లోనే ఉందని లగార్డ్ చెప్పారు. భారతీయ నేతలతో సమావేశాలను బట్టి చూస్తే ప్రపంచ వృద్ధికి భారత్ చోదకంగా నిల్చేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయన్న భావన కలుగుతోందని లగార్డ్ పేర్కొన్నారు.
 

Advertisement

What’s your opinion

Advertisement