ఎదిరించింది.. మార్పును తెచ్చింది | Sakshi
Sakshi News home page

ఎదిరించింది.. మార్పును తెచ్చింది

Published Mon, Aug 31 2015 3:33 PM

ఎదిరించింది.. మార్పును తెచ్చింది - Sakshi

పెళ్లి మాటున బాలికలకు జరుగుతున్న అన్యాయాన్ని ఆమె ఎదిరించింది. బాల్యవివాహం కోసం తల్లిదండ్రులు చేసిన ప్రయత్నాన్ని ధైర్యంతో తిప్పికొట్టింది. విద్య మహిళల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపుతుందని నిరూపించింది. తనకు ఎదురైన కష్టం మరెవ్వరికీ రాకూడదని పదకొండేళ్ల వయసులోనే సమాజాన్ని ఎదిరించి నిలబడిన గుజరాత్కు చెందిన రేఖా కాళింది.. సంప్రదాయం వెనుక సాగుతున్న సాంఘిక దురాచారానికి స్వస్తి చెప్పింది.

కేవలం తన ఇంట్లోనే, తల్లిదండ్రుల ముందు రేఖా కాళింది చేసిన తిరుగుబాటు ఫలితాన్నిచ్చింది. బాల్య వివాహంతో కష్టాలు పడుతున్న స్నేహితుల్లా తన జీవితం కాకూడదనుకుంది. భవిష్యత్తులో మరే బాలికా బాల్యవివాహ చట్రంలో కూరుకొని జీవితాన్ని ఛిద్రం చేసుకోకూడదన్నదే ఆమె ఆశయం. స్కూలు నుంచి ఇంటికి చేరేసరికి తనకు ఎదురైన పరిస్థితి చూసి రేఖా కాళింది ఖంగారు పడింది. తనను చూసేందుకు వచ్చిన పెళ్లి కొడుకు, వాళ్ల బంధువుల మాటలను వింటూ ఓ పక్కన కూర్చుండిపోయింది. వరుడి తల్లితో తన గురించి తల్లి చెబుతున్న మాటలు వింటూ ఆలోచనలో పడింది. "మా అమ్మాయి చదువులో టాపర్, ఎంతో సౌమ్యంగా, మర్యాదగా వ్యవహరిస్తుంది. తన తమ్ముళ్లు, చెల్లెళ్ల పట్ల బాధ్యతగా ఉంటుంది. మా అమ్మాయి కోడలు కావడం మీ అదృష్టం." అంటూ తల్లి పాజిటివ్ గా చెప్పడం... అదివిన్న వరుడి తల్లి తనను మెచ్చుకోవడం అన్నీ రేఖ చెవులకు లీలగా వినిపిస్తున్నాయి. ఇంతలో ఒక్క మాటతో స్పృహలోకి వచ్చింది. "అన్నీ బాగానే ఉన్నాయి. కానీ మీ అమ్మాయి మా అబ్బాయి కంటే నల్లగా ఉంటుంది. కాబట్టి కట్నం కాస్త ఎక్కువ ఇవ్వాల్సి ఉంటుంది" అన్న వరుడి తల్లి మాటలు రేఖకు ఆగ్రహాన్ని తెప్పించాయి. అదే ఆగ్రహం ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది.

తనకంటే ఆరేళ్లు పెద్దవాడైన పెళ్లికొడుకును ఆమె కొన్ని సూటి ప్రశ్నలు వేసింది.
జాతీయ గీతాన్ని ఎవరు రాశారో తెలుసా?
దోమలవల్ల వ్యాధులు ప్రబలుతాయని తెలుసా?
కిషలయ కథలో బోనునుంచి విడుదలైన పులి.. నేను నిన్ను ఆహారంగా తీసుకోను అంటూ బ్రాహ్మణుడికిచ్చిన మాట గురించి తెలుసా?

వీటిలో ఏ ఒక్క ప్రశ్నకూ సమాధానం రాలేదు. ఒక్క ఉదుటున అక్కడ్నుంచి లేచి వెళ్లి, ''నీ కొడుకును నేను పెళ్లి చేసుకోను. అతడికి లోకజ్ఞానం లేదు'' అని అతడి తల్లికి చెప్పి, విసురుగా బయటకు వచ్చేసింది. రేఖ తల్లితో సహా అంతా విస్తుపోయారు. ఎంతో తలవంపులుగా ఫీలయ్యారు. అవేమీ ఆమెకు పట్టలేదు. తర్వాత తనకు స్కూల్లో స్నేహితుల నుంచి ఎదురైన విమర్శలకూ తలవంచలేదు. తాను అనుకున్నది సాధించింది. అజ్ఞానంతో బాల్య వివాహాలకు బలైపోతున్న ఆడపిల్లలకు స్ఫూర్తిగా నిలిచింది. ఇదంతా దాదాపు ఆరేళ్ల నాటి మాట. ఆ తర్వాత ఆమెకు సాహస బాలల అవార్డు కూడా లభించింది. నాటి రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ చేతుల మీదుగా ఆ అవార్డును అందుకుంది. ఇటీవల రేఖా కాళింది జీవిత కథ 'ది స్ట్రెంగ్త్ టు సే నో' పేరున పుస్తక రూపంలో విడుదలయ్యింది.

బాల్య వివాహల నిరోధ చట్టం ప్రకారం పెళ్లి చేయాలంటే ఆడపిల్లలకు 18, మగపిల్లవాడికి 21 ఏళ్లు ఉండి తీరాలి. అంతకుముందు పెళ్లి చేయిస్తే అందుకు కారకులైన వారికి రెండేళ్ల జైలుతో పాటు రెండు లక్షల రూపాయల జరిమానా విధిస్తారు. అయితేనేం ఈ మూఢాచారం ఇప్పటికీ కొనసాగుతోంది. మన దేశంలో 47 శాతం పెళ్లిళ్లు 18 ఏళ్లలోపే జరుగుతున్నాయని యునిసెఫ్ సర్వేలో వెల్లడైంది. ప్రతి వివాహాన్ని రిజిస్టర్ చేస్తే బాల్యవివాహాలను అరికట్టే అవకాశం ఉంది. పుట్టిన తేదీని ధ్రువీకరించే సర్టిఫికెట్ చూసే వివాహాన్ని రిజిస్టర్ చేయాలి. అలా రిజిస్టర్ అయినవాటినే పెళ్లిళ్లుగా గుర్తించాలి.

Advertisement
Advertisement