బికినీ బీచ్... ఎక్కడోచ్! | Sakshi
Sakshi News home page

బికినీ బీచ్... ఎక్కడోచ్!

Published Sun, Aug 17 2014 10:29 AM

బికినీ బీచ్... ఎక్కడోచ్!

చదివేస్తే ఉన్న మతి పోయిందన్న చందంగా ఉంది మన రాజకీయ నాయకుల వ్యవహారం. దేశ సంస్కృతిని కాపాడాల్సిన పాలకులే మన సంప్రదాయాలకు పాతర వేస్తున్నారు. ప్రజల సమస్యలపై దృష్టి పెట్టడం మానేసి అనవసర విషయాలపై హడావుడి చేస్తున్నారు. ప్రజలకు కావాల్సిన కూడు, గూడు, గుడ్డ వంటి గురించి పట్టించుకోకుండా 'బికినీ'పై బాగా చర్చించుకుంటున్నారు గోవా రాజకీయ నాయకులు.

బికినీలు, మినీస్కర్టులను నిషేధించాలని ఓ మంత్రి అంటే... రాష్ట్రానికి అమితాదాయాన్ని ఆర్జించిపెట్టే అందాల దారిని ఎందుకు మూసివేయాలంటూ మరో మంత్రి అడ్డం వేస్తారు. అసలు బీచుల్లో బికినీలు లేకపోతే రాష్ట్రానికి పర్యాటకులు వస్తారా అంటూ గడుసుగా ప్రశ్నిస్తారు. బికినీలు వల్లే బోల్డు గొడవలు అయిపోతున్నాయని వాటిని నిషేధిస్తేగాని రాష్ట్రం ప్రశాంతంగా ఉండదని కూడా అన్నారు కొందరు.

మహారాష్ట్రవాదీ గోమంతక్ పార్టీ ఎమ్మెల్యే లావు మామ్లేదర్ మరో అడుగు ముందుకేశారు. ఏకంగా 'బికినీ బీచ్' పెట్టేద్దామంటూ బేషైన ఐడియా ఇచ్చారు. బికినీ బీచ్కు కొన్ని ప్రత్యేకతలుండాయని కూడా ఆయన సెలవిచ్చారు. బికినీ బీచ్ చుట్టూ ప్రత్యేక కంచె ఏర్పాటు చేయాలట. లోపలకు వెళ్లే వారి నుంచి తలా రూ.వెయ్యి నుంచి రూ.2 వేలు- 'టూ పీస్' టోల్ టాక్స్ వసూలు చేయాలన్నారు. ఇలా చేస్తే పైసలు రావడంతో పాటు పర్యాటకం కూడా పురోభివృద్ధి చెందుతుందని వివరించారు.

లావు మామ్లేదర్ 'బికినీ బీచ్' ప్రతిపాదనపై కాంగ్రెస్తో పాటు మహిళా హక్కుల కార్యకర్తలు భగ్గుమన్నారు. భామామణులను 'బికినీ బీచ్'లకే పరిమితం చేసి స్వేచ్ఛను హరిస్తారా అంటూ కాంగ్రెస్ అధికార ప్రతినిధి దుర్గాదాస్ కామత్ కయ్యిమన్నారు. గోవా బీచుల్లో బికినీలు, మినీస్కర్టులను నిషేధించాలని మంత్రి సుదీన్ దావలికర్ కూడా ఇంతకుముందు విమర్శలపాలయ్యారు. గోవా ప్రజలు సంప్రదాయ పద్దతిలో ధోతిలు ధరించి తిరిగాలని ఆయన సలహాయిచ్చారు. పాశ్చాత్య పోకడలను, సంస్కృతిని నిషేధించాలనుకుంటే మంత్రే గోచీ పెట్టుకు తిరగాలంటూ ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ వెన్‌డెల్ రోడ్రిక్స్ లేఖ రాశారు. 'టూ పీస్'పై టూమచ్ డిస్కషన్ అంటే ఇదేనేమో!

Advertisement
Advertisement