హెచ్‌టీసీ తొలి ఫ్యాబ్లెట్ ‘వన్ మ్యాక్స్’ వచ్చేస్తోంది | Sakshi
Sakshi News home page

హెచ్‌టీసీ తొలి ఫ్యాబ్లెట్ ‘వన్ మ్యాక్స్’ వచ్చేస్తోంది

Published Tue, Nov 19 2013 12:35 AM

హెచ్‌టీసీ తొలి ఫ్యాబ్లెట్ ‘వన్ మ్యాక్స్’ వచ్చేస్తోంది - Sakshi

 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ హెచ్‌టీసీ తొలి ఫ్యాబ్లెట్ ‘వన్ మ్యాక్స్’ వారం రోజుల్లో భారత్‌లో విడుదల కానుంది. 5.9 అంగుళాల ఫుల్ హెచ్‌డీ స్క్రీన్, 1.7 గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, హెచ్‌టీసీ అల్ట్రా పిక్సెల్ కెమెరా, 3,300 ఎంఏహెచ్ బ్యాటరీ తదితర ఫీచర్లున్నాయి. 16, 32 జీబీ ఇంటర్నల్ మెమరీతో రెండు వేరియంట్లలో ఇది లభిస్తుంది. 4జీ సపోర్ట్ చేస్తుంది. ధర రూ.56 వేలుగా నిర్ణయించామని హెచ్‌టీసీ కంట్రీ మేనేజర్ ఫైసల్ సిద్ధిఖి చెప్పారు. సోమవారమిక్కడ మీడియాకు ఈ కొత్త ఫ్యాబ్లెట్‌ను ప్రదర్శించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ ఏడాది భారత్‌లో 10 స్మార్ట్‌ఫోన్లు ఆవిష్కరించామని, డిసెంబరుకల్లా మరో నాలుగు మోడళ్లు రానున్నాయని చెప్పారు. కాగా, హెచ్‌టీసీ వన్, హెచ్‌టీసీ వన్ మినీ మోడళ్లపై బై బ్యాక్ ఆఫర్‌ను కంపెనీ ప్రకటించింది. పాత స్మార్ట్‌ఫోన్‌ను తీసుకువస్తే ఈ మోడళ్లపై రూ. 5 వే ల దాకా డిస్కౌంట్ ఇస్తారు. మైక్రోసాఫ్ట్ విండోస్ ప్లాట్‌ఫాంపై మరిన్ని మొబైల్ ఫోన్లను కంపెనీ ఆవిష్కరించనుంది.
 
 ఫోన్‌కు చిన్న ఫోన్..
 హెచ్‌టీసీ వన్ మినీ ప్లస్ పేరుతో రిమోట్‌లాంటి పరికరాన్ని వారం రోజుల్లో మార్కెట్లోకి తెస్తోంది. దీని నుంచి ఇ-మెయిల్, ఎస్‌ఎంఎస్‌తోపాటు కాల్స్ అందుకోవచ్చు. అలాగే చేయవచ్చు కూడా. ప్రపంచంలో ఇటువంటి ఉత్పాదన మరొకటి లేదని హెచ్‌టీసీ అంటోంది. ధర రూ.7,500. అలాగే ఫెచ్ పేరుతో చేతిలో ఇమిడే చిన్న పరికరాన్ని సైతం కంపెనీ రూపొందించింది. ఇది చేతిలో ఉంటే చాలు ఫోన్ ఎక్కడుందో తెలుసుకోవచ్చు. ధర రూ.2,500.

Advertisement
Advertisement