Sakshi News home page

‘అవసరాలకు అనుగుణంగా హెచ్‌-1బీలు ఇవ్వాలి’

Published Wed, Mar 29 2017 9:44 PM

‘అవసరాలకు అనుగుణంగా హెచ్‌-1బీలు ఇవ్వాలి’ - Sakshi

వాషింగ్టన్‌: అమెరికా ఆర్థిక వ్యవస్థ అవసరాలకు అనుగుణంగా హెచ్‌-1బీ వీసాల సంఖ్యను పెంచడం లేదా కుదించడం చేయాలని ఉత్తర కరోలినా సెనేటర్‌ థామ్‌ టిల్లిస్‌ అన్నారు. సెనేట్‌లో ఫైనాన్స్‌ కంపెనీలపై మంగళవారం జరిగిన చర్చలో ఆయన పాల్గొన్నారు. ‘అమెరికా కంపెనీల అవసరాలను తీర్చగలిగేంత నైపుణ్యం గల వ్యక్తులు మన దేశంలోనే ఉన్నారా?’అని ఆయన ప్రశ్నించారు. అమెరికా జీడీపీ వృద్ధి రేటు 3.5 నుంచి 4 శాతం మధ్య ఉందనీ, అంత వృద్ధిని సాధించేందుకు దేశంలోని కంపెనీలకు అవసరమైన నిపుణులు ఉన్నారో లేదో తాను తెలుసుకోవాలని అనుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు.

లాటరీ పద్ధతిలోనే హెచ్‌-1బీ వీసాలు
హెచ్‌-1బీ వీసాలను లాటరీ పద్ధతిలో కేటాయించడాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన రెండు పిటిషన్లను ఓ అమెరికా కోర్టు కొట్టేసింది. సాధారణంగా ఏడాదికి జనరల్‌ కేటగిరీలో 65 వేలు, యూఎస్‌లో చదువుకున్న ఇతర దేశాల వారి కేటగిరీలో 20 వేల హెచ్‌-1బీ వీసాలను మంజూరు చేస్తారు. అయితే హెచ్‌-1బీకి దరఖాస్తులు మాత్రం దాదాపు రెండింతలు వస్తున్నాయి. దీంతో వీసాలు మంజూరు చేయడానికి యూఎస్‌సీఐఎస్‌ (యూఎస్‌ సిటిజెన్‌షిప్‌ అండ్‌​ఇమిగ్రేషన్‌ సర్వీసెస్‌) లాటరీ పద్ధతిని వినియోగిస్తోంది. దీనిని సవాల్‌ చేస్తూ పోర్ట్‌లాండ్‌కు చెందిన రెండు కంపెనీలు కోర్టులో పిటిషన్‌ వేయగా.. యూఎస్‌ డిస్ట్రిక్ట్‌ కోర్టు జడ్జి మైకేల్‌ సైమన్‌ వాటిని కొట్టేశారు. దీంతో హెచ్‌-1బీలను లాటరీ పద్ధతిలోనే కేటాయించనున్నారు.

Advertisement

What’s your opinion

Advertisement