Sakshi News home page

రోడ్డు సైడ్ దుకాణాలపై ఐటీ రైడ్స్

Published Thu, Sep 22 2016 2:59 PM

రోడ్డు సైడ్ దుకాణాలపై ఐటీ రైడ్స్ - Sakshi

ముంబాయి : మోదీ ప్రభుత్వ పన్ను జాబితాలో తర్వాతి టార్గెట్ ఎవరో తెలుసా? రోడ్డు పక్కనున్న వడాపావ్ దుకాణాలు, దోసా సెల్లర్స్ అట. పన్ను ఎగవేతదారులపై కొరడా ఝళిపించేందుకు సిద్దమైన ప్రభుత్వం, చిన్న చిన్న బిజినెస్లను సైతం వదలడం లేదు. చిన్న వ్యాపారస్తులు, రోడ్డు పక్కన దుకాణాలపై ఆదాయపు పన్ను శాఖ రైడ్స్ నిర్వహిస్తోంది. బ్లాక్ మనీని నిరోధించడానికి తీసుకొచ్చిన ఇన్కమ్ డిక్లరేషన్ స్కీమ్ కింద ఆదాయ వివరాలను తెలుపాలని అధికారులు ఆదేశాలు జారీచేస్తున్నారు. ఒక్క ముంబాయిలోనే ఈ రైడ్స్ 50కి పైగా జరిగాయి. థానేలోని ప్రముఖ వడాపావ్ సెంటర్, ఘట్కోపూర్లోని దోసా సెంటర్, అంథేరిలోని శాండ్ విచ్ షాపులపై ఈ దాడులు నిర్వహించారు. అదేవిధంగా అహ్మదాబాద్లోనూ 100కు పైగా దుకాణాలపై కూడా ఆదాయపు పన్ను శాఖ కొరడా ఝళించింది.. న్యూఢిల్లీ, కోల్కత్తాలోని ప్రముఖ దుకాణాలపై ఈ దాడులను చేపడుతున్నారు. 
 
గత ఆరు నెలలుగా ఆదాయపు పన్ను శాఖ సేకరించిన సమాచారం మేరకు అధికారులు ఈ దాడులు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. దాదాపు లక్ష వరకు చిన్న వ్యాపారులను, షాప్ కీపర్లను పన్ను ఎగవేతదారులుగా గుర్తించినట్టు అధికారులు వెల్లడించారు. ప్రతి పట్టణాన్ని టార్గెట్గా చేసుకుని ప్రభుత్వం ఈ దాడులు నిర్వహిస్తోంది. తన 25 ఏళ్ల అనుభవంలో ఎప్పుడూ ఇలాంటి రైడ్స్ను ఎరుగనని, అసలు పన్ను డీల్సే తెలియని వారికి మొదటిసారి అధికారులు చుక్కలు చూపిస్తున్నారని ముంబాయిలోని ఓ చార్టెడ్ అకౌంటెంట్ చెప్పారు. బ్లాక్మనీ నిరోధించడానికి మోదీ ప్రభుత్వం ఈ మేరకు చర్యలు తీసుకుంటున్నట్టు వెల్లడించారు. 
 
తాజాగా ముంబాయిలో పన్ను అధికారులు చేస్తున్న ఈ రైడ్స్ ద్వారా ఇప్పటికే రూ.2 కోట్లను సీజ్ చేసినట్టు అధికార వర్గాలు పేర్కొన్నాయి. సెప్టెంబర్ 30 లోపు దేశవ్యాప్తంగా ఇలాంటి రైడ్స్ వేయి వరకు జరుగుతాయని అధికారులు హెచ్చరించారు. ఇన్కమ్ డిక్లరేషన్ స్కీమ్కు ఇంకా 10 రోజులే మిగిలి ఉండటంతో ఈ రైడ్స్ మరింత ఊపందుకున్నాయి. సెప్టెంబర్ 30ను ఆదాయపు రిటర్న్స్కు ప్రభుత్వం తుది గడువుగా పేర్కొన్న సంగతి తెలిసిందే. ఇన్ని రోజులు ఎక్కువ విలువ కలిగిన లావాదేవీలను, వ్యక్తులను, షాపింగ్ బిల్లుల టార్గెట్గా చేసుకుని ప్రభుత్వం ఈ దాడులు చేసింది. గడువు సమీపిస్తున్నందున్న పన్ను ఎగవేసిన చిన్న వ్యాపారులను సైతం వదిలేది లేదని ఆదాయపు పన్ను శాఖ పేర్కొంటోంది. 

Advertisement

What’s your opinion

Advertisement