ఇన్‌ఫ్రా కంపెనీల పరుగు | Sakshi
Sakshi News home page

ఇన్‌ఫ్రా కంపెనీల పరుగు

Published Sat, Dec 21 2013 6:48 AM

Infra companies shares value hike

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రాష్ట్రానికి చెందిన పలు ఇన్‌ఫ్రా కంపెనీల షేర్లు శుక్రవారం మార్కెట్లో పరుగులు తీశాయి. నిఫ్టీలో ఇన్‌ఫ్రా ఇండెక్స్ కేవలం 0.86% పెరిగితే రాష్ట్ర ఇన్‌ఫ్రా కంపెనీలు మాత్రం నాలుగు నుంచి 8% పెరగడం విశేషం. ద్రవ్యోల్బణం గరిష్టస్థాయిలో ఉన్నప్పటికీ ఆర్‌బీఐ కీలక వడ్డీరేట్లను పెంచకుండా స్థిరంగా ఉంచడమే ఈ ర్యాలీకి ప్రధాన కారణంగా మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. శుక్రవారం ఎన్‌సీసీ షేరు 9%, జీఎంఆర్ ఇన్‌ఫ్రా 7% పెరగ్గా, జీవికే, ఐవీఆర్‌సీఎల్, ల్యాంకో షేర్లు 4 నుంచి 5% వరకూ పెరిగాయి. అలాగే గత నాలుగు నెలలుగా వాటి కనిష్ట స్థాయిల నుంచి స్థిరంగా పెరుగుతూ వస్తున్నాయి.

గత నాలుగు నెలల్లో ఇన్‌ఫ్రా ఇండెక్స్ 22% పెరిగితే జీఎంఆర్ ఇన్‌ఫ్రా ఏకంగా 117%, ఎన్‌సీసీ 83%, ఐవీఆర్‌సీఎల్ 70% చొప్పున లాభాలను అందించాయి. నాలుగు నెలల్లో ఇంత పెరిగినట్లు కనిపిస్తున్నా... వాటి గరిష్ట స్థాయిల నుంచి పోలిస్తే అవి ఇంకా 80-85% నష్టాల్లోనే ఉన్నాయని జెన్ మనీ జాయింట్ మేనేజింగ్ డెరైక్టర్ సతీష్ కంతేటి పేర్కొన్నారు. ఇలా బాగా పడ్డ షేర్లలో ర్యాలీ అత్యంత సహజమని, అంతే కాని ఇక్కడ నుంచి ఈ షేర్లు మరింత పెరుగుతాయని అప్పుడే చెప్పలేమని తెలియజేశారాయన. ద్రవ్యోల్బణం తగ్గి వడ్డీరేట్లు పెరగకపోతే, అప్పుడు ఈ షేర్లు మరింత పెరగొచ్చన్నారు. ఇన్‌ఫ్రా కంపెనీల షేర్లు పెరగడానికి వాటికి ఉన్న అప్పులే గుదిబండలుగా మారాయని, అందుకే ఇండెక్స్‌లు గరిష్ట స్థాయిలో ఉన్నప్పటికీ ఇవి ఇంకా కనిష్ట స్థాయిల్లో ట్రేడ్ అవుతున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఆస్తులను విక్రయించుకొని అప్పులను తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తున్న జీఎంఆర్, ఎన్‌సీసీ, ఐవీఆర్‌సీఎల్, జీవీకే వంటి కంపెనీల షేర్లు అధికంగా పెరిగితే, ఇప్పటికీ ఇంకా అప్పులు గణనీయంగా ఉన్న ల్యాంకో వంటి షేర్లు అంతగా పెరగటం లేదు. విలువ పరంగా చూస్తే ఇవి తక్కువ స్థాయిలో ఉన్నప్పటికీ వాటికున్న అప్పులను ఏ విధంగా వదిలించుకుంటాయన్న దానిపైనే వాటి భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని ఇండియా ఇన్ఫోలైన్ మేనేజింగ్ డెరైక్టర్ ఆర్.వెంకట్రామన్ పేర్కొన్నారు. ఈ ఇన్‌ఫ్రా షేర్లు ఎంత దారుణంగా పతనమయ్యాయంటే ఉదాహరణకి మీ చేతిలో రూ.1,630 కోట్లు ఉంటే ల్యాంకో ఇన్‌ఫ్రా కంపెనీయే మీదవుతుంది. అయితే ఈ కంపెనీతో పాటు రూ.40,000 కోట్లు అప్పులు కూడా మీ ఖాతాలోకొస్తాయి. ఇంతటి భారీ స్థాయిలో అప్పులు ఉండబట్టే ఈ కంపెనీలు ఆస్తులను విక్రయించైనా వాటిని తగ్గించుకోవాలనుకుంటున్నాయి.

Advertisement
Advertisement