ఐటీపై హైదరాబాద్ మార్క్ | Sakshi
Sakshi News home page

ఐటీపై హైదరాబాద్ మార్క్

Published Fri, Dec 18 2015 1:39 AM

ఐటీపై హైదరాబాద్ మార్క్ - Sakshi

సాక్షి, హైదరాబాద్: ప్రఖ్యాత సాఫ్ట్‌వేర్ దిగ్గజం గూగుల్ తన రెండో అతిపెద్ద ప్రాంగణాన్ని హైదరాబాద్‌లో నెలకొల్పనున్నట్లు ప్రకటించడంతో ప్రపంచ ఐటీ పటంపై తెలంగాణ రాష్ట్రం ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంది. ప్రపంచవ్యాప్తంగా 40 దేశాల్లో 60 శాఖలు క లిగిన గూగుల్ సంస్థ... అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలో ఉన్న కేంద్ర కార్యాలయం తర్వాత (సొంత క్యాంపస్) అంత పెద్ద మరో క్యాంపస్‌ను నెలకొల్పేందుకు హైదరాబాద్‌ను ఎంచుకోవడం అరుదైన అంశమని ఐటీ నిపుణులు అంటున్నారు.

దీనిపై రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎంతో ఆసక్తిగా ఉన్నందున త్వరలోనే క్యాంపస్ పనులు మొదలు కానున్నాయి. ఈ క్యాంపస్ ఏర్పాటు అనంతరం గూగుల్ ఉత్పత్తులకు సంబంధించిన పైలట్ ప్రాజెక్టులకు రాష్ట్రంలోని పలు ప్రాంతాలు వేదిక లుగా మారనున్నాయి. ప్రజలకు వైవిధ్యమైన సేవలు లభిస్తాయి. గూగుల్ రాకతో మిగతా దిగ్గజ కంపెనీలను కూడా హైదరాబాద్ ఆకర్షించే అవకాశముంది.
 
గూగుల్ స్ట్రీట్ వ్యూతో..
ఆకాశం నుంచి పక్షులకు కనిపించే విధంగా హైదరాబాద్ నగరమంతటినీ అతి సమీపంగా, స్పష్టంగా 360 డిగ్రీల్లో కంప్యూటర్‌లో వీక్షించే అవకాశం ఉంటుంది. దేశంలో ఇప్పటివరకు చారిత్రక కట్టడాలైన తాజ్‌మహల్, కుతుబ్ మినార్‌లకు మాత్రమే గూగుల్ స్ట్రీట్‌వ్యూసదుపాయం ఉంది. హైదరాబాద్‌కు గూగుల్ స్ట్రీట్‌వ్యూ సదుపాయం అందుబాటులోకి వస్తే నావిగేషన్ ఎంతో సులువు అవుతుంది. ట్రాఫిక్ సమస్యల నుంచి నగర వాసులకు కష్టాలు తప్పుతాయి. గూగుల్ స్ట్రీట్‌వ్యూ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎంతోకాలంగా ఎదురుచూస్తోంది.
 
తక్కువ ఖర్చుతో ఎక్కువ సేవలు
మిషన్ భగీరథ (వాటర్‌గ్రిడ్) ప్రాజెక్టుతో రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ నల్లా ద్వారా మంచినీటిని అందించనున్న ప్రభుత్వం.. ఆ పైప్‌లైన్‌తో పాటు ఫైబర్ ఆప్టిక్ కేబుల్ వేసి ఇంటింటికీ ఇంటర్నెట్ సదుపాయం కల్పించాలని నిర్ణయించడం తెలిసిందే. ఈ ప్రాజెక్టుకు గూగుల్ సంస్థ సంపూర్ణ సహకారాన్ని అందిస్తుండడంతో.. రాష్ట్రంలోని ప్రతి ఇంటికి ఇంటర్నెట్‌తో పాటు కేబుల్ టీవీ, మొబైల్ సేవలు చవకగా లభ్యం కానున్నాయి. డిజిటల్ లిటరసీ పెరగడం ద్వారా ప్రతి ఒక్కరికీ విద్యా, ఆరోగ్య రంగాలకు సంబంధించిన సేవలు అతి తక్కువ ధరకు దొరికే అవకాశముంది.
 
గూగుల్ క్యాంపస్.. విశేషాలివీ
* హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో గూగుల్ ప్రాంగణం ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 7.20 ఎకరాల స్థలాన్ని కేటాయించింది.
* ఇక్కడ గూగుల్ మూడేళ్లలో సుమారు రూ.వెయ్యి కోట్లతో అతిపెద్ద ప్రాంగణాన్ని నిర్మించనుంది.
* సుమారు 13 వేల మంది ఉద్యోగులు పనిచేసేలా అధునాతన వసతులతో ప్రాంగణాన్ని నిర్మించనున్నట్లు ప్రకటించింది.
* నాస్కామ్ నివేదిక ప్రకారం... ఒక ఐటీ కంపెనీ రూపాయి పెట్టుబడి పెడితే, దాని ద్వారా పలు రకాలుగా ప్రభుత్వానికి రెండు రూపాయల రెవెన్యూ లభిస్తుంది. ఈ లెక్కన గూగుల్ రూ.వెయ్యి కోట్లు పెట్టుబడి పెడితే, రాష్ట్ర ప్రభుత్వానికి రూ. రెండు వేల కోట్లు రెవెన్యూ రానుంది.
* ప్రత్యక్షంగా ఒక ఐటీ  ఉద్యోగం కల్పనతో పరోక్షంగా ముగ్గురికి ఉపాధి లభిస్తుంది. ముఖ్యంగా ట్రాన్స్‌పోర్ట్, సెక్యూరిటీ, క్యాంటీన్ అవసరాలకే సుమారు 40 వేల మంది అవసరమవుతారని అంచనా.
* ఒక పెద్ద ఐటీ కంపెనీ ఏర్పాటు ద్వారా స్థానికంగా రియల్ ఎస్టేట్, ఎంటర్‌టైన్‌మెంట్ వంటి ఇతర రంగాల్లోనూ వేలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి.
* భారీ వరదల కారణంగా చెన్నై ఐటీ పరిశ్రమ ఛిన్నాభిన్నం కావడంతో దిగ్గజ ఐటీ కంపెనీలన్నీ హైదరాబాద్‌పై దృష్టిపెట్టాయి.
* ప్రముఖ కంపెనీల కేంద్ర కార్యాలయాలు (సొంత ప్రాంగణాలు) హైదరాబాద్‌కు రావడం ద్వారా రాష్ట్రంలోని ఇతర (టైర్ టూ) నగరాలకూ ఐటీ పరిశ్రమ విస్తరించే అవకాశాలు ఉన్నాయి.
 
పపంచ ఐటీ రాజధానిగా..
హైదరాబాద్ నగరం ప్రపంచ ఐటీ రాజధానిగా అభివృద్ధి చెందడానికి ఇదే సరైన సమయం. చెన్నైలో భారీ వరదల కారణంగా పరిశ్రమ తీవ్రంగా దెబ్బతినడంతో అన్ని కంపెనీలు హైదరాబాద్‌ను ఎంచుకుంటున్నాయి. ఈ సమయంలో ైెహ దరాబాద్‌కు ఐటీ కంపెనీలను ఆకర్షించేలా రాయితీలు, మౌలిక వసతులు కల్పించాల్సిన అవసరం ఉంది.
- సందీప్‌కుమార్ మక్తాల, రాష్ట్ర ఐటీ అసోసియేషన్ అధ్యక్షుడు
 
హైదరాబాద్ గ్లామర్ ఇదీ..
మే నెలలో అమెరికా పర్యటన సందర్భంగా మాతో గూగుల్ ప్రతినిధులు ఒప్పందం కుదుర్చుకున్నారు. దానికి కట్టుబడి అమెరికా వెలుపల అతిపెద్ద క్యాంపస్‌ను ఏర్పాటు చేస్తుండడం ఎంతో సంతోషంగా ఉంది. ప్రస్తుతమున్న 6,400 మంది ఉద్యోగుల సంఖ్యను త్వరలోనే రెట్టింపు చేస్తామని గూగుల్ చెప్పింది. హైదరాబాద్ గ్లామర్ ఏమిటో, పొటెన్షియాలిటీ ఏమిటో ప్రపంచానికి అర్థమవుతోంది.

ఇప్పటికే ఫేస్‌బుక్, అమెజాన్, నోవార్టిస్ తదితర మల్టీ నేషనల్ కంపెనీలను హైదరాబాద్ ఆకర్షిస్తోంది. పెట్టుబడులను ఆకర్షించే విధంగా మంచి పాలసీలను తెస్తాం. త్వరలోనే నాలుగు ఐటీ పార్కులను ఏర్పాటు చేయబోతున్నాం.
- కె.తారక రామారావు, ఐటీశాఖ మంత్రి

Advertisement

తప్పక చదవండి

Advertisement