కార్పొరేట్‌ ట్యాక్స్‌ తగ్గించే చాన్స్‌! | Sakshi
Sakshi News home page

కార్పొరేట్‌ ట్యాక్స్‌ తగ్గించే చాన్స్‌!

Published Mon, Jan 16 2017 1:53 AM

కార్పొరేట్‌ ట్యాక్స్‌ తగ్గించే చాన్స్‌!

బడ్జెట్లో చర్యలపై డెలాయిట్‌ సర్వేలో అంచనా...

న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు(డీమోనిటైజేషన్‌)తో సతమతమవుతున్న పారిశ్రామిక రంగాన్ని మోదీ సర్కారు ఈసారి బడ్జెట్లో కాస్త కనికరించనుందా? ట్యాక్స్‌ కన్సెల్టెన్సీ దిగ్గజం డెలాయిట్‌ ఇండియా సర్వేలో మెజారిటీ కార్పొరేట్లు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కార్పొరేట్‌ పన్నును తగ్గించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ మరో రెండు వారాల్లో(ఫిబ్రవరి1న) 2017–18 ఆర్థిక సంవత్సరానికిగాను బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న సంగతి తెలిసిందే. 2015 ఫిబ్రవరి బడ్జెట్‌ ప్రసంగంలో జైట్లీ కార్పొరేట్లకు ఇస్తున్న పన్ను ప్రోత్సాహకాలను దశలవారీగా తొలగించనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, 2017, ఏప్రిల్‌ 1 నుంచి కార్పొరేట్‌ పన్నును క్రమంగా 30 శాతం నుంచి 25 శాతానికి తగ్గిస్తామని అప్పుడే వెల్లడించారు. సర్వేలో పాల్గొన్న కార్పొరేట్లలో 53 శాతం మంది ఈసారి కార్పొరేట్‌ పన్ను రేటులో తగ్గింపు ఉండొచ్చని పేర్కొన్నారు. ‘నల్లధనాన్ని అరికట్టడం కోసం ప్రభుత్వం చాలా కఠిన చర్యలు తీసుకున్న నేపథ్యంలో పన్ను రేటు తగ్గించేందుకు ఇదే సరైన సమయం. డీమోనిటైజేషన్‌ ప్రకటన తర్వాత ఆర్థిక వృద్ధి దిగజారుతుండటం అత్యంత ఆందోళన కలిగిస్తున్న అంశం. దీనికి ప్రధానంగా డిమాండ్‌ పడిపోవడమే కారణం. సర్వేలో ఎక్కువమంది ఇదే విషయాన్ని ప్రస్తావించారు. డిమాండ్‌పై ప్రతికూల ప్రభావాన్ని తొలగించేందుకు బడ్జెట్లో ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశం ఉందని 80 శాతం మంది సర్వేలో స్పందించారు’ అని డెలాయిట్‌ పేర్కొంది. గతేడాది ప్రభుత్వ పన్ను ఆదాయాల్లో కార్పొరేట్‌ పన్ను వాటా దాదాపు 19 శాతం కాగా, ఆదాయపు పన్ను వాటా 14 శాతంగా నమోదైంది.
ఇతర ముఖ్యాంశాలివీ...

పన్ను ప్రోత్సాహకాలు పూర్తిగా తొలగించడం మంచిదని.. దీనివల్ల లిటిగేషన్‌లకు ఆస్కారం తగ్గుతుందని సర్వేలో 40% అభిప్రాయపడ్డారు.

ఇన్‌ఫ్రా వంటి రంగాల్లో వృద్ధి కొనసాగాలంటే లాభాలతో ముడిపడిన పన్ను ప్రోత్సాహకాలు తప్పనిసరి అని మరో 40% మంది పేర్కొన్నారు. ఇన్‌ఫ్రా రంగానికి ప్రోత్సాహకాలు పూర్తిగా తొలగించకుండా పెట్టుబడులతో ముడిపడిన పన్ను రాయితీలు కల్పించాలని 15శాతం మంది కోరారు.

నోట్ల రద్దు తర్వాత రియల్‌ ఎస్టేట్‌ పరిశ్రమకు సంబంధించి డిమాండ్‌ తీవ్రంగా దెబ్బతింది. బ్యాంకింగ్‌ వ్యవస్థలోకి డిపాజిట్‌ నిధులు పోటెత్తడంతో రుణాలపై వడ్డీ రేట్లు దిగిరానున్నాయి. మరోపక్క, ప్రభుత్వం కూడా వడ్డీరేట్ల రాయితీలను అందిస్తోంది. ఇవన్నీ చైక గృహాలకు డిమాండ్‌ను మళ్లీ భారీగా పెంచనున్నాయి.

మొత్తంమీద నిర్మాణాత్మక సంస్కరణల జోరు పెంచేందుకు ప్రభుత్వం విధానపరమైన చర్యలను కొనసాగించే అవకాశం ఉందని డెలాయిట్‌ అభిప్రాయపడింది.

Advertisement
Advertisement