ఇంకా ఉద్రిక్తంగానే కశ్మీర్ | Sakshi
Sakshi News home page

ఇంకా ఉద్రిక్తంగానే కశ్మీర్

Published Sun, Apr 17 2016 1:15 AM

Kashmir is still tense

పోలీసు కాల్పుల్లో ఇద్దరికి గాయాలు

 

శ్రీనగర్: కశ్మీర్ లోయ ఇంకా ఉద్రిక్తంగానే ఉంది. కుప్వారా జిల్లాలోని త్రెహగామ్‌లో రాళ్లురువ్వుతున్న నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు ఎయిర్ గన్ వినియోగించటంతో పెల్లెట్స్ తగిలి ఇద్దరు యువకులకు గాయాలయ్యాయి. ఐదు రోజులుగా జరుగుతున్న ఆందోళనల్లో మృతిచెందిన ఐదుగురి కుటుంబాలను కశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ పరామర్శించారు. నలుగురు యువకులు ప్రాణాలు కోల్పోవటం బాధాకరమన్నారు. నిష్పాక్షిక విచారణ జరిపి బాధితులకు న్యాయం చేస్తానని భరోసా ఇచ్చారు. అనంతరం డిప్యూటీ సీఎం నిర్మల్ సింగ్, ఉన్నతాధికారులతో అత్యవసరంగా సమావేశం అయ్యారు. శాంతిభద్రతల పరిరక్షణలో భద్రతా బలగాలు సామాన్య ప్రజానీకానికి హాని తలపెట్టరాదని ముఫ్తీ స్పష్టం చేశారు. లోయలో శాంతి నెలకొనేందుకు ప్రజలు సహకరించాలని ఆమె కోరారు. అయితే ముఫ్తీ ప్రకటన వచ్చిన తర్వాత కూడా ఆందోళనకారులు వెనక్కు తగ్గలేదు.

కాగా, హంద్వారాలో మంగళవారం 16ఏళ్ల బాలికపై అత్యాచారం విషయంలో వాస్తవాలు చెప్పకుండా పోలీసులు ఒత్తిడి చేశారని బాలిక తల్లి ఆరోపించారు. కారకులెవరైనా ఈ ఘటనపై న్యాయవిచారణ జరిపించాలని ఆమె డిమాండ్ చేశారు. మరోవైపు, లోయలో అదుపుతప్పుతున్న శాంతిభద్రతల పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు 3600 మంది పారామిలటరీ బలగాలను పంపాలని కేంద్రం నిర్ణయించింది. శ్రీనగర్‌తోపాటు కుప్వారా, హంద్వారా ప్రాంతాల్లో ప్రత్యేకమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. దీంతో పాటు మొబైల్ ఇంటర్నెట్‌పై నిషేధాన్ని కొనసాగిస్తున్నట్లు వెల్లడించింది

Advertisement
Advertisement