సామాన్య మహిళ నుంచి మేయర్ దాకా.. | Sakshi
Sakshi News home page

సామాన్య మహిళ నుంచి మేయర్ దాకా..

Published Thu, Nov 19 2015 12:56 AM

సామాన్య మహిళ నుంచి మేయర్ దాకా.. - Sakshi

చిత్తూరు : ఎవరూ అనుకోలేదు.. ఆమెకు అప్పుడే నిండూ నూరేళ్లు నిండుతాయని. ఏ ఒక్కరూ ఊహించలేదు.. ఓ సామాన్య గృహిణి  నుంచి మేయర్‌గా ఎదిగిన ఈమెను హతమార్చేంత శత్రుత్వం ఉందని. నిజమే.. కఠారి అనురాధ మామూలు గృహిణి. అయితే ఆమె పట్టుదల, పోరాట ప్రతిమ మాత్రం అందర్నీ ఆశ్చర్యంలో పడేస్తుంది.

అనురాధ తండ్రి పేరు రాధాక్రిష్ణ. 1970-80లో ఈయన చిత్తూరు మునిసిపల్ కార్యాలయంలో బిల్ కలెక్టర్‌గా పనిచేసి ఉద్యోగ విరమణ పొందారు. నగరంలోని కస్తూర్భా మునిసిపల్ పాఠశాలలో కఠారి అనురాధ చదివారు. రాజకీయాలు ఈమెకు పూర్తిగా కొత్త. అయితే 2005లో అనురాధ భర్త కఠారి మోహన్ కౌన్సిలర్‌గా ఉన్నప్పుడు ఆయనపై హత్యాయత్నం జరిగింది. దీంతో ఆయన అజ్ఞాతంలోకి వెళ్లడంతో అప్పటి మునిసిపల్ పాలకవర్గం మోహన్‌ను కౌన్సిలర్ పదవి నుంచి తొలగించింది.

2007లో జరిగిన ఉప ఎన్నికల్లో అనురాధ తొలిసారిగా గంగనపల్లె ప్రాంతం నుంచి టీడీపీ తరపున కౌన్సిలర్‌గా పోటీ చేసి గెలుపొందారు. ఈ సమయంలో తన వార్డులో ఓ నీటి బోరుకు మోటరు బిగించుకోవడానికి కఠారి అనురాధ పడ్డ కష్టాలు అన్నీ ఇన్నీ కావు. తన వార్డు ప్రజలకు నీళ్లను ఇవ్వడానికి ఆమె కార్పొరేషన్ కార్యాలయం చుట్టూ వందలసార్లు తిరిగారు. అయినా కుదర్లేదు. ఈ సమయంలోనే అనురాధలో ఉన్న పోరాట ప్రతిమ నాయకురాలిని చేసింది.


2014 మునిసిపల్ ఎన్నికల్లో చిత్తూరు కార్పొరేషన్‌కు ఎన్నికలు జరిగాయి. నగర మేయర్ స్థానం బీసీ మహిళకు రిజర్వ్ చేశారు. గంగనపల్లె నుంచి కఠారి అనురాధ కార్పొరేటర్‌గా ఎన్నికయ్యారు. నగరంలో టీడీపీ 30కు పైగా డివిజన్లలో కార్పొరేట్లను గెలుచుకుంది. ఇందులో మోహన్ పాత్ర చాలా కీలకం. 50 డివిజన్లలో తిరుగుతూ పార్టీ గెలుపు ఆర్థికంగా, సామాజికంగా బలాన్ని కూడగట్టుకుని పాదయాత్ర చేశారు. ఈ కష్టం అనురాధను చిత్తూరు నగర తొలి మేయర్‌ను చేసింది.

సామాన్య గృహిణిగా ఉన్న ఈమె తొలి మేయర్ పదవిని చేపట్టి చిత్తూరు రాజకీయాల్లో తన కంటూ ఓ చరిత్రను లిఖించుకున్నారు. తన రాజకీయ గురువు మాత్రం తన భర్త కఠారి మోహన్‌నే నంటూ అనురాధ అందరి ముందు గర్వంగా చెప్పుకునేది. అవే రాజకీయాలు తన ప్రాణాలను హరిస్తాయని ఆమె ఏ నాడూ ఊహించుకుని ఉండరు.

Advertisement
Advertisement