ఆహార భద్రత బిల్లును ఆమోదించిన లోక్సభ.. బిల్లుకు బీజేపీ మద్దతు | Sakshi
Sakshi News home page

ఆహార భద్రత బిల్లును ఆమోదించిన లోక్సభ.. బిల్లుకు బీజేపీ మద్దతు

Published Mon, Aug 26 2013 11:22 PM

Lok Sabha passes food security bill

యూపీఏ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ఆహార భద్రత బిల్లును లోక్సభ ఆమోదించింది. భారతదేశంలో ఉన్న మొత్తం జనాభాలో మూడింట రెండొంతుల మంది పేదలకు భారీ సబ్సిడీతో ఆహార ధాన్యాలను అందించడానికి ఉద్దేశించిన ఈ బిల్లు 2014 ఎన్నికల్లో తమకు ఓట్ల కాసులు రాలుస్తుందని సోనియాగాంధీ భావిస్తున్న విషయం తెలిసిందే. అయితే, బిల్లుపై ఏకంగా ఎనిమిది గంటల పాటు చర్చ జరగడంతో అస్వస్థతకు గురైన ఆమెను ఎయిమ్స్కు తరలించారు.

ప్రతిపక్షాలు ఈ బిల్లుకు దాదాపు ౩00 సవరణలను ప్రతిపాదించగా, అన్నింటినీ తోసిపుచ్చారు. అయితే, ప్రధాన బిల్లుపై ఓటింగ్ జరగడానికి కొద్ది నిమిషాల ముందు ఈ బిల్లుకు బీజేపీ మద్దతిస్తున్నట్లు విపక్ష నేత సుష్మా స్వరాజ్ ప్రకటించారు. బిల్లు అరకొరగా, బలహీనంగా ఉన్నా, పేదల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని తాము మద్దతిస్తున్నామన్నారు. తాము అధికారంలోకి వచ్చాక దీన్ని మరింత మెరుగు పరుస్తామని చెప్పారు. అన్నాడీఎంకే మాత్రమే ఈ బిల్లును వ్యతిరేకించింది.

సమాజంలో దురదృష్టవంతులైన వర్గాల కోసమే ఆహార భద్రతా బిల్లును ఉద్దేశించామని, దేశంలోని పౌరులందరి ఆహార భద్రత బాధ్యతను భారతదేశం తలకెత్తుకుంటుందన్న సందేశాన్ని ప్రపంచానికి చాటాల్సిన సమయం ఆసన్నమైందని అంతకుముందు బిల్లుపై చర్చ సందర్భంగా సోనియా లోక్సభలో అన్నారు.

Advertisement
Advertisement