సర్కారు దవాఖానాల్లో నరకయాతన | Sakshi
Sakshi News home page

సర్కారు దవాఖానాల్లో నరకయాతన

Published Tue, Sep 8 2015 2:42 AM

సర్కారు దవాఖానాల్లో నరకయాతన - Sakshi

* ఎక్కడ చూసినా దారుణ పరిస్థితులే..
సిబ్బంది ఉండరు.. పరికరాలుండవు.. అన్నీ ఉంటే రోగులకు బెడ్లు ఉండవు
* రోగులంటే సిబ్బందికీ లోకువే.. నానా ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోని తీరు
* రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ‘సాక్షి’ పరిశీలన


కల్పనకు నెలలు నిండాయి. ఆదివారం సాయంత్రం ఆమె భర్త రాజు హన్మకొండలోని ప్రభుత్వాసుపత్రికి తీసుకొచ్చాడు. సిబ్బంది పరీక్షించారు. అడ్మిట్ చేయాలని చెప్పారు కానీ.. బెడ్ ఇవ్వలేదు. చేసేదేమీ లేక నొప్పులు పడుతూనే ఆసుపత్రిలో రాత్రంతా ఓ మూలన పడుకుంది. సోమవారం ఉదయం మళ్లీ బెడ్ అడిగినా ఇచ్చేవారు లేరు. మధ్యాహ్నం రక్తస్రావం మొదలైంది. డ్యూటీ డాక్టర్ దగ్గరకు వెళితే... బయట కూర్చోమంటూ ఈసడింపు. అక్కడ నిల్చునే ఓపిక లేక.. వరండాలో మరో రోగి బెడ్‌పై కూర్చుండిపోయింది. చివరికి అక్కడకు వచ్చిన ‘సాక్షి’ విలేకరి ఆ ఫొటోలన్నీ తీస్తుండటంతో సిబ్బంది గమనించి.. కల్పనను బెడ్ మీదికి చేర్చారు. ఇదీ... హన్మకొండ ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో సోమవారం నాటి పరిస్థితి!
 
 (సాక్షి ప్రత్యేక బృందాలు)
 ఒళ్లంతా కాలినా... సూది మందు, సెలైన్ బాటిల్ తప్ప గతిలేదు కొన్ని ఆసుపత్రుల్లో. ఎక్స్‌రే యంత్రాలున్నా కమీషన్ల కోసం పక్కనున్న ప్రైవేటు డయాగ్నస్టిక్స్‌కు పంపిస్తున్నారు మరికొన్ని ఆసుపత్రుల్లో. అంబులెన్సు ఉంటే డ్రైవరుండడు... స్కానింగ్ మెషిన్లున్నా టెక్నీషియన్లుండరు.. ఏడుగురు వైద్యులుంటే ఐదుగురు లీవులోనే ఉంటారు... అన్నీ ఉన్నచోట బెడ్‌లు ఫుల్!. ఇలా చెప్పుకుంటూ పోతే సర్కారీ ఆసుపత్రుల్లో సమస్యలకు అంతుండదు.
 
 సోమవారం ఒక్కరోజు... ‘వైద్య విధ్వంసాన్ని’ ప్రత్యక్షంగా చూడటానికి రాష్ట్రంలోని పలు ప్రభుత్వాసుపత్రులకు వెళ్లిన ‘సాక్షి’ విలేకరులకు కొన్ని గంటల వ్యవధిలోనే ఈ దారుణాలన్నీ కనిపించాయి. దీన్నిబట్టి ఆసుపత్రుల్లో ప్రతిరోజూ ఎంతమంది నిస్సహాయంగా వెనుదిరుగుతున్నారో తెలుసుకోవచ్చు. రోగులను సాటి మనుషుల్లా చూసి.. వారి బాధను గమనించి... తక్షణ చికిత్స అందించిన ఆసుపత్రి ఒక్కటంటే ఒక్కటి కూడా కనిపించదెందుకు? ప్రభుత్వాసుపత్రుల్లో సౌకర్యాలు లేకపోవటమన్నది కొత్త విషయం కాదు. కానీ ఉన్న సౌకర్యాలను పూర్తిస్థాయిలో వాడకపోవటం... కనీసం రోగుల్ని సాటి మనుషుల్లా చూసి వారికి సాధ్యమైన రీతిలో తక్షణ చికిత్స అందించకపోవటం... అసలు స్పందన అనేది లేకపోవటం... వీటిని పీడిస్తున్న జబ్బులు. అసలు ‘ప్రభుత్వమనేది ఉందా?’ అని డౌటొచ్చే స్థాయిలో ఆసుపత్రుల్ని పీడిస్తున్న ఈ జబ్బులకు... చికిత్స కావాలి. ఇదిగో... వివిధ ప్రభుత్వాసుపత్రుల్లో సోమవారం ఒక్కరోజే కనిపించిన సంఘటనల సమాహారం... 


  ఎంజీఎం ఆస్పత్రి అవుట్ పేషెంట్ విభాగంలో ఎంత పెద్ద రోగానికైనా మందు బిళ్లలే దిక్కవుతున్నాయి. సోమవారం ఆస్పత్రిలో ఓపీ ఆవరణలో చాలప కాంతమ్మ అనే వృద్ధురాలు వచ్చిపోతున్న వారిని ఆపుతూ.. ‘‘ఓ బిడ్డా.. ఇవి గుండెనొప్పి గోళీలేనా? గుండెల్లో నొప్పి ఉందని ఈడికి వచ్చిన. మందు బిళ్లలే ఇచ్చిళ్లు. దీనితోని తక్కువైత లేదు. మూడు సార్లు వచ్చినా ఈ గోళీలే (డైక్లోఫినాక్) ఇస్తున్నరు’’ అని దీనంగా అడ గడం కనిపించింది. ‘‘ఆర్నెళ్ల కిందట యాక్సిడెంట్ అయ్యింది. వెన్నుపూసల చీలిక వచ్చిందని చెప్పిళ్లు. నెల సంది ఈడ తిరుగుతున్నం. మందు బిళ్లలే ఇస్తుళ్లు.. నొప్పితో కూసోనికే వస్తలేదు. రోజుకు యాభై కిలోమీటర్లు పోయి వచ్చుడు కష్టమైతంది’’ అని కరీంనగర్ జిల్లా కమలాపురం మండలం పెద్ద పాపాయ్యపల్లికి చెందిన ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది.

ఎక్కడ చూసినా అరకొర వసతులు.. బెడ్ల కోసం తిప్పలు
 ఎంజీఎంలో మందుబిళ్లలే దిక్కు..
వరంగల్ జిల్లా ప్రజలకు ఎంజీఎం, హన్మకొండలోని ప్రసూతి ఆసుపత్రులే పెద్దదిక్కు. ఇతర జిల్లాల నుంచి కూడా రోగులు వస్తుంటారు. రోగుల పట్ల ఆస్పత్రి సిబ్బంది నిర్దయగా వ్యవహరిస్తున్నారు. అడుగడుగునా సెక్యూరిటీ సిబ్బందికి లంచాలు సమర్పించాల్సి వస్తోంది. ఇంత కష్టపడి లోపలికి వెళ్లిన రోగులకు సరిపడా బెడ్లు అందుబాటులో లేవు. వేయి పడకల సామర్థ్యం ఉన్న ఎంజీఎం ఆస్పత్రిలో మహిళల వార్డులో రోగులకు సరిపడా బెడ్లులేక నేలపైనే పడుకోబెడుతున్నారు. అత్యవసర వైద్య సేవల విభాగంలో సరిపడా స్ట్రెచర్లు, వీల్‌చైర్లు లేవు. నడవలేని స్థితిలో ఉన్న రోగులను వారి బంధువులే మోసుకెళ్తూ తీసుకెళ్లాల్సిన దుస్థితి నెలకొంది.

మంచిర్యాలకు చెందిన ఆరేళ్ల నరేశ్‌ను బైక్ ఢీకొంది. కాలు విరిగింది. ఎముక వేలాడుతోంది. దగ్గర్లోని పసరు వైద్యుడి దగ్గరికి తీసుకెళ్లారు. బద్దలు పెట్టి కట్టు కట్టి... పెద్దాసుపత్రికి తీసుకుపొమ్మన్నాడు. అప్పటికప్పుడు అప్పులు చేసి కరీంనగర్ పెద్దాసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చూసే వారే లేరు. అదేంటి! ఎమర్జెన్సీకి ఎవరూ ఉండరా? అని నరేశ్ తండ్రి చంద్రయ్య అమాయకంగా అడగ్గా.. 9 గంటలకు వస్తారన్నారు. కానీ 10 గంటల తరవాతే చీటీ రాశారు. ఎవ్వరూ సాయం చేయకపోతే తన బిడ్డను తానే స్ట్రెచర్‌పై పడుకోబెట్టి డాక్టర్ దగ్గరికి.. అక్కడ్నుంచి ఎక్స్‌రే రూమ్‌కి... అక్కడి నుంచి పట్టీ వేసే దగ్గరికి తీసుకెళ్లాడు. చివరకు బ్లడ్ టెస్టులూ అవీ చేసి... అన్నీ బాగుంటే రేపు ఆపరేషన్ చేస్తామన్నారు. లేకుంటే టైమ్ పడుతుందట!!
 
వైద్యం కోసం ‘ప్రసవ’ వేదన..
ఏటూరు నాగారం, మంగపేట, తాడ్వాయి మండలాల్లోని దళిత, గిరిజన గర్భిణులు పురుడు పోసుకోవాలంటే చేతి నిండా డబ్బులు పట్టుకొని పట్టణాలకు పరుగులు తీయాల్సిందే! ఏజెన్సీలోని సామాజిక ఆస్పత్రిలో వైద్యాధికారుల కొరత తీవ్రంగా ఉంది. రెండు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కూడా అదే పరిస్థితి. సామాజిక ఆస్పత్రిలో ప్రసూతి ఆపరేషన్ గది ఉన్నా.. ఆపరేషన్ చేయడానికి వైద్యుడు, మత్తు మందు ఇచ్చే డాక్టర్ లేడు.
 
చెప్పుకోవడానికి ఇబ్బంది పడుతున్నాం
 ‘‘స్త్రీలకు వచ్చే రోగాలను చెప్పుకోవడానికి ఇబ్బంది పడుతున్నాం. మహిళా డాక్టర్ ఉంటే మా బాధను చెప్పుకొని చికిత్స పొందే వాళ్లం. ఇక్కడ వారు లేక వరంగల్‌కు లేక ప్రైవేటు ఆస్పత్రికి పోవాల్సిన పరిస్థితి ఉంది’’    
- కర్నె దివ్య, చెల్పాక, గర్భిణి. ఏటూరునాగారం
 
 రాజధానిలో ఇదీ పరిస్థితీ..
 హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రికి వెళితే ఎటువంటి జబ్బు అయినా నయం అవుతుందని, సకల సదుపాయాలు ఉంటాయనే ఆశతో ఎక్కడెక్కడి నుంచో రోగులు వస్తుంటారు. అయితే వాస్తవాలు మాత్రం ఇందుకు విరుద్ధంగా ఉంటున్నాయి. డాక్టర్ల రాక కోసం రోగులు పడిగాపులు కాయాల్సిందే. వైద్య పరీక్షల కోసం చాలా దూరం నడిచి వెళ్లాల్సి ఉంటుంది. స్ట్రెచర్‌లు కూడా దొరకని పరిస్థితి అక్కడిది. డబ్బులుంటేనే పడకలు.. ఆరోగ్య శ్రీ పేషంట్లకు నెల రోజులు ఎదురు చూసినా దొరకవు. దీంతో చేసేదేం లేక ఆస్పత్రి ప్రాంగణంలోనే పడుకుంటున్నారు.
 
 నాలుగు రోజులుగా పడిగాపులు..
 భార్యకు సపర్యలు చేస్తున్న ఈ వృద్ధుడి పేరు తిగుళ్ల బాలకిష్టారెడ్డి. మెదక్ జిల్లా తోగుట మండలం క్రిష్టాపురం గ్రామానికి చెందిన ఆయన.. తీవ్ర నడుంనొప్పితో బాధపడుతూ నడవలేని స్థితిలో ఉన్న తన భార్య రామవ్వ (65)ను నాలుగు రోజుల కింద ఉస్మానియా ఆస్పత్రికి తీసుకొచ్చాడు. ఆస్పత్రిలో చేర్పించుకోవాలని డాక్టర్ల కాళ్లా వేళ్లా పడ్డాడు. అయితే ఓపీ చిట్టీ లేదని వైద్యులు అడ్మిట్ చేసుకోలేదు. ఓపీ చిట్టీ కోసం వెళితే రోగి లేనిదే ఇచ్చేది లేదని సిబ్బంది చెప్పారు. దీంతో ఏమీ చేయలేక నాలుగు రోజులుగా అక్కడే పడిగాపులు పడుతున్నారు. బయట దాతలు పెడుతున్న ఆహారం తిని అక్కడే ఎదురు చూపులు చూస్తున్నారు. వీరిని చూసి అక్కడి వారు చలించిపోతున్నారు.
 
 పేట్లబురుజులో ప్రసవ వేదన!
 రాజధానిలోని పేట్లబురుజు ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో నిండు గర్భిణులకు ప్రసవ వేదన తప్పడం లేదు. ఔట్ పేషంట్(ఓపీ) టోకెన్ల కోసం నానా తిప్పలు పడాల్సి వస్తోంది. తెల్లవారుజామున నాలుగు గంటలకు వెళ్లి క్యూలో నిలబడితే కానీ టోకెన్ దొరకని దుస్థితి. అసలే పురిటి నొప్పులతో బాధపడుతున్న మహిళలకు చాంతాండంత క్యూలైన్లు నరకం చూపుతున్నాయి. 600 పడకల సామర్థ్యం ఉన్న పేట్లబురుజు ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రికి నగరం నలుమూలల నుంచే కాకుండా రంగారెడ్డి, మెదక్, నల్లగొండ, మహ బూబ్‌నగర్ జిల్లాల నుంచి కూడా రోగులు వస్తుంటారు. రక్త, మూత్ర పరీక్షల కోసం ప్రైవేటు ల్యాబ్‌లను ఆశ్రయించాల్సి వస్తోంది.
 
 వెళ్లిపొమ్మంటుండ్రు...
 ‘‘నా పెనిమిటి లేడు. కొడుకులు లేరు. అన్నింటికి కూతురే దిక్కు. కూలీనాలీ చేసుకుంటూ పొట్టనింపుకునేటోళ్లం. వారం రోజుల నుంచి జ్వరంతో బాధపడుతున్న. ఐదు రోజుల కిందట మంచిర్యాల ఏరియా ఆస్పత్రికి వచ్చిన ఇక్కడికి అచ్చిన తర్వాత డాక్టర్లు సరిగా చూస్తలేరు. కూర్చుందామన్నా.. కూర్చోవస్తలేదు. నిన్నట్నుంచి నన్ను ఆస్పత్రి నుంచి వెళ్లిపోమంటుండ్రు. ప్రైవేటు దవాఖానాలో చూపించుకునేంత డబ్బుల్లేవ్’’     
 - కంపెల దుర్గక్క. రోగి.
 
 పడకలు ఖాళీ లేవట..
 గుంటూరు జిల్లాకు చెందిన నాగమణి గత రెండు నెలలుగా కాలేయ సంబంధ వ్యాధితో బాధపడుతోంది. పది రోజుల కింద వైద్యం కోసం నిమ్స్‌కు వచ్చింది. ఆరోగ్య శ్రీ కార్డులో ఉన్న పలు వైద్య పరీక్షలు చేశారు. కాలేయానికి క్యాన్సర్ వచ్చిందని, శస్త్రచికిత్స చేయాలని డాక్టర్లు నిర్ధరించినా ఇప్పటివరకు ఆస్పత్రిలో చేర్పించుకోలేదు. ఇదేంటని ప్రశ్నిస్తే పడకలు ఖాళీ లేవని సమాధానమిస్తున్నారు. చేసేదేం లేక రోగుల విశ్రాంతి శాలలో పదిరోజుల నుంచి ఉంటున్నారు.
 
 నో అడ్మిషన్

 డెంగీ, విష జ్వరాలతో బాధపడుతున్న రోగులతో కరీంనగర్‌లోని ప్రభుత్వాసుపత్రి కిక్కిరిసిపోయింది. తగినన్ని బెడ్స్ లేకపోవడంతో రోగులకు ప్లాస్టిక్ మంచాలే దిక్కయ్యాయి. సెలైన్ ఎక్కించడానికి స్టాండ్‌లు కూడా లేవు. కిటికీ చువ్వలకే సెలైన్ బాటిళ్లు కట్టారు. ఒక కుటుంబంలో ఇద్దరు వస్తే వారికి ఒకే మంచం మీద చికిత్స అందిస్తున్నారు. పరిస్థితి ఎంత తీవ్రంగా ఉన్నా మందులు రాసి పంపుతున్నారే తప్ప.. అడ్మిట్ చేసుకోవడం లేదు. అడిగితే.. ‘బెడ్ ఖాళీ లేదు. ఏం చేయాలే..’ అని చెబుతున్నారు.
 
పరీక్షలు లేవు.. పారాసిటమాలే దిక్కు..
 ఖమ్మం జిల్లాలోని ప్రభుత్వాసుపత్రుల్లో మందులకు తీవ్ర కొరత ఉంది. కొత్తగూడెంలోని వంద పడకల ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో సమస్యలు తిష్ట వేశాయి. రోగులకు సరైన సేవలు అందడం లేదు. మలేరియా, టైఫాయిడ్, డెంగీ జ్వరాలతో రోగులు బాధపడుతున్నా పారాసిటమాల్ మందుబిళ్లలిచ్చి పంపిస్తున్నారు. దీంతో పేదలు ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.
 - సాక్షి, నెట్‌వర్క్
 
  రాష్ట్రంలో ప్రభుత్వాసుపత్రులు ఇవీ..
 ఆసుపత్రులు            సంఖ్య
 బోధనాసుపత్రులు        18
 ప్రసూతి ఆసుపత్రులు        05
 జిల్లా ఆసుపత్రులు        10
 ప్రాంతీయ ఆసుపత్రులు        42
 సామాజిక ఆరోగ్య కేంద్రాలు    115
 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు    740
 ఆరోగ్య ఉప కేంద్రాలు        4,905
 ప్రత్యేక నవజాత        
 సంరక్షణ కేంద్రాలు        18    
 నవజాత స్థిరీకరణ కేంద్రాలు    61
 నవజాత సంరక్షణ కేంద్రాలు    587
 పోషకాహార పునరావాస కేంద్రాలు    13
 అన్ని ఆసుపత్రుల్లో
 పడకల సంఖ్య        17,239
 
 కదులుదాం.. కదిలిద్దాం..
 సర్కారీ, కార్పొరేట్ వైద్యంలో మీకెదురైన చేదు అనుభవాలను.. మీరు చూసిన మంచి డాక్టర్ల గురించి ‘సాక్షి’తో పంచుకోండి. వైద్య దుస్థితిని మార్చడానికి సూచనలు కూడా తెలియజేయండి. వీటిని ప్రచురించటం ద్వారా నిర్మాణాత్మకమైన చర్చకు అవకాశమిద్దాం. మీ అనుభవాలు, ఆలోచనలను ఈమెయిల్స్, లేఖల ద్వారా ‘సాక్షి’కి పంపేటపుడు... మీ పేరు, మీకు చికిత్స చేసిన ఆసుపత్రి లేదా డాక్టరు పూర్తి పేరును, మొబైల్ నంబర్లను తప్పనిసరిగా తెలియజేయండి. మీ పేరు రహస్యంగా ఉంచాలని భావిస్తే అది కూడా రాయండి.
 లేఖలు, మెయిల్ పంపాల్సిన చిరునామా:
 ఎడిటర్, సాక్షి, రోడ్ నం.1,
 బంజారాహిల్స్, హైదరాబాద్-34
 sakshihealth15@gmail.com

Advertisement
Advertisement