మెట్రో సర్వీసులకు బ్రేక్ | Sakshi
Sakshi News home page

మెట్రో సర్వీసులకు బ్రేక్

Published Sat, Mar 18 2017 8:00 PM

మెట్రో సర్వీసులకు బ్రేక్ - Sakshi

జాట్ల సమ్మె కారణంగా ఢిల్లీ వెలుపల మెట్రోరైలు సేవలను ఆదివారం రాత్రి నుంచి తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు డీఎంఆర్‌సీ ప్రకటించింది. సోమవారం నుంచి తమ సమ్మెను ఉధృతం చేయనున్నట్లు జాట్ సంస్థలు ప్రకటించడంతో ఈ చర్య తీసుకున్నారు. ఆదివారం రాత్రి 8 గంటల తర్వాత సెంట్రల్ ఢిల్లీలోని 12 మెట్రో స్టేషన్లు కూడా మూతపడతాయని, అయితే ఇంటర్‌ఛేంజ్ సదుపాయం మాత్రం అన్నిచోట్లా అందుబాటులో ఉంటుందని డీఎంఆర్‌సీ ప్రకటించింది. గురు ద్రోణాచార్య నుంచి హుడా సిటీసెంటర్‌కు, కౌశాంబి నుంచి వైశాలి వరకు, నోయిడా సెక్టార్ -15 నుంచి నోయిడా సిటీ వరకు, సరాయ్ నుంచి ఎస్కార్ట్స్ ముజేశ్వర్ వరకు మళ్లీ ప్రకటించేవరకు సేవలను ఆపేస్తున్నామని ఢిల్లీ మెట్రో అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

రాజీవ్ చౌక్, పటేల్ చౌక్, సెంట్రల్ సెక్రటేరియట్, ఉద్యోగ్ భవన్, లోక్ కళ్యాణ్ మార్గ్, జన్‌పథ్, మండీ హౌస్, బారాఖంబా రోడ్, ఆర్‌కే ఆశ్రమ్ మార్గ్, ప్రగతి మైదాన్, ఖాన్ మార్కెట్, శివాజీ స్టేడియం మెట్రో స్టేషన్లను కూడా మూసేస్తున్నారు. మార్చి 20వ తేదీన పార్లమెంటు వెలుపల భారీ నిరసన నిర్వహిస్తామని జాట్ గ్రూపులు తెలిపాయి. ప్రభుత్వోద్యోగాలతో పాటు విద్యాసంస్థల్లో కూడా తమకు రిజర్వేషన్లు కావాలని జాట్లు డిమాండ్ చేస్తున్నారు. దాంతోపాటు గత సంవత్సరం ఆందోళనలో మరణించినవారి పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలంటున్నారు.

Advertisement
Advertisement