విడిపిస్తారా, చేతగాదని ఊరుకుంటారా? | Sakshi
Sakshi News home page

విడిపిస్తారా, చేతగాదని ఊరుకుంటారా?

Published Tue, Apr 11 2017 11:45 AM

విడిపిస్తారా, చేతగాదని ఊరుకుంటారా?

న్యూఢిల్లీ: కుల్‌భూషణ్‌ జాధవ్‌ గూఢచారని పాకిస్తాన్‌ అబద్ధం చెబుతుంటే ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉందని కాంగ్రెస్‌ ప్రశ్నించింది. ప్రధాని నరేంద్ర మోదీ జోక్యం చేసుకుని అతడికి విముక్తి కల్పించాలని డిమాండ్ చేసింది. ఈ అంశాన్ని మంగళవారం లోక్‌ సభలో కాంగ్రెస్‌ లేవనెత్తింది.

'గూఢచర్యానికి పాల్పడ్డాడనే అసత్య, మోసపూరిత ఆరోణలతో కుల్‌భూషణ్‌ జాధవ్‌ కు పాకిస్తాన్ ఉరిశిక్ష విధించింది. కేంద్ర ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంది. జాధవ్‌ ను పాకిస్తాన్‌ ఉరి తీస్తే అది హత్య కిందకు వస్తుంది. అతడిని విడిపించకుంటే మోదీ సర్కారును చేవలేనిదిగా భావించాల్సి ఉంటుంద'ని విపక్షనేత మల్లిఖార్జున్‌ ఖడ్గే అన్నారు.

కుల్‌భూషణ్‌ జాధవ్‌ ను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ అన్నారు. అతడిని రక్షించేందుకు ప్రభుత్వం అన్నిచర్యలు చేపట్టాలని సూచించారు. ఎటువంటి ఆధారాలు లేకుండానే జాధవ్‌ కు పాకిస్తాన్ మిలటరీ కోర్టు ఉరిశిక్ష విధించడాన్ని ఆయన తప్పుబట్టారు. పార్లమెంట్‌ మొత్తం జాధవ్‌ పక్షాన ఉందని కేంద్ర మంత్రి అనంత్‌ కుమార్‌ చెప్పారు.

Advertisement
Advertisement