Sakshi News home page

'తెలంగాణకు రూ. లక్ష కోట్లు తీసుకురండి'

Published Thu, Aug 20 2015 8:57 PM

'తెలంగాణకు రూ. లక్ష కోట్లు తీసుకురండి' - Sakshi

బాన్సువాడ(నిజామాబాద్): దేశ ప్రధాని నరేంద్రమోదీ బీహార్ రాష్ట్రానికి ప్రత్యేకంగా రూ. లక్షా 25 కోట్ల ప్యాకేజీని ప్రకటించారని, అయితే బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డికు కేంద్రంలో పలుకుబడి ఉంటే తెలంగాణకు లక్ష కోట్ల ప్రత్యేక ప్యాకేజీ మంజూరు చేయించాలని రాష్ట్ర పంచాయతిరాజ్, ఐటి శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు సవాల్ చేశారు. గురువారం సాయంత్రం ఆయన బాన్సువాడలోని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డితో కలిసి ఆయన స్వగృహంలో విలేకరులతో మాట్లాడారు. పనికిమాలిన ఆరోపణలను మాని, తెలంగాణ అభివృద్ధికి కేంద్రం నుంచి ప్రత్యేక ప్యాకేజీని మంజూరు చేయించాలని సూచించారు.

రాష్ట్ర విభజన సందర్భంగా ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలు ఆంధ్రప్రదేశ్‌లో కలిపినప్పుడు నోరుమెదపని కిషన్‌రెడ్డి, తమను విమర్శించడం హాస్యాస్పదమని అన్నారు. వికారాబాద్‌ను జిల్లా కేంద్రంగా మార్చాలని డిమాండ్ చేస్తున్న టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, గతంలో పదేళ్ళ పాటు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారని ప్రశ్నించారు. గృహ నిర్మాణ శాఖలో వేల కోట్ల కుంభకోణం జరిగినా పట్టించుకోని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ప్రస్తుతం ప్రభుత్వాన్ని విమర్శించడం ఎంత వరకు సమంజసమని అన్నారు.

రాష్ట్రంలో 8,700 గ్రామాలు ఉండగా, సుమారు వెయ్యి గ్రామాలను మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, పోలీసులు, అధికారులు దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తున్నారని అన్నారు. గ్రామజ్యోతిలో భాగంగా వంద శాతం పారిశుధ్యం, రోడ్లు, మురికి కాలువల, ప్రభుత్వ కార్యాలయాల్లో పారిశుధ్యం సాధిస్తే ఆ గ్రామాలను ఎంపిక చేసి, ప్రోత్సాహకాలు అందజేస్తామని మంత్రి పేర్కొన్నారు. రాష్ర్టంలో 50శాతం ప్రజలు సంక్షేమ పథకాల ద్వారా లబ్దిపొందుతున్నారని అన్నారు. మరిన్ని సంక్షేమ పథకాలను త్వరలో ప్రారంభిస్తామని, అప్పుడు రాష్ట్రంలో ఇతర రాజకీయ పార్టీలకు పుట్టగతులు ఉండవని మంత్రి కేటీఆర్ జోస్యం పలికారు. సంక్షేమ రంగంలో దేశానికే తమ రాష్ట్రం ఆదర్శంగా మారిందన్నారు.

రాష్ట్ర వ్యవసాయ శాఖమంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ వైఎస్సార్ ప్రభుత్వ హయాంలో రూ.9,500 కోట్లతో చేపట్టిన ప్రాణహిత-చేవేళ్ళ పథకం కేవలం కాంట్రాక్టర్లు, కాంగ్రెస్‌పార్టీ నాయకుల జేబులు నింపుకోవడానికే పనికి వచ్చిందని అన్నారు. తమ ప్రభుత్వం అవినీతి రహిత పాలన అందిస్తోందని, ఏ ఒక్క పథకంలో అవినీతి జరగడం లేదని, ప్రతిపక్షాలు హుందాగా ఉండి మాట్లాడడం నేర్చుకోవాలని పోచారం అన్నారు. విలేకరుల సమావేశంలో జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే, జడ్పీ చైర్మన్ దఫేదార్ రాజు, ఎమ్మెల్సీ వీజీ గౌడ్, టీఆర్‌ఎస్ అధ్యక్షుడు గంగారెడ్డి పాల్గొన్నారు.

Advertisement
Advertisement