పాట్నా గాంధీ మైదాన్లో మరో బాంబు

29 Oct, 2013 13:33 IST|Sakshi

బీహార్ రాజధాని పాట్నాలోని గాంధీ మైదాన్లో ఈ రోజు ఉదయం మరో బాంబును కనుగొన్నట్లు నగర పోలీసు ఉన్నతాధికారి మను మహారాజ్ మంగళవారం ఇక్కడ వెల్లడించారు. దాంతో బాంబును నిర్వీర్యం చేసేందుకు పోలీసులు, బాంబు నిర్వీర్య దళం హుటాహుటిన గాంధీ మైదానం చేరుకుని, ఆ బాంబును నిర్వీర్యం చేసేందుకు చర్యలు చేపట్టారని వివరించారు. అందులోభాగంగా ఆ సమీపంలోని  ప్రజలను నివాసాల నుంచి ఖాళీ చేయించినట్లు పేర్కొన్నారు.

 

ఈ రోజు ఉదయం గాంధీ మైదాన్లో పాదచారులు నడుస్తున్న సమయంలో ఆ బాంబును కనుగొని, పోలీసులకు సమాచారం అందించారని చెప్పారు. దాంతో పోలీసులు వెంటనే అప్రమత్తమైనట్లు తెలిపారు. బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ ఆదివారం పాట్నాలోని గాంధీ మైదాన్లో హూంకార్ ర్యాలీ నిర్వహించారు.

 

ఆ ర్యాలీ ప్రారంభానికి కొన్ని గంటల ముందు పాట్నాలో వరుస బాంబు పేలుళ్లు చోటు చేసుకున్నాయి. ఆ బాంబు పేలుళ్లలో ఇప్పటివరకు 8 మంది మరణించారు. మరో 82 మంది గాయపడిన సంగతి తెలిసిందే.  ఆ వరుస బాంబు పేలుళ్ల వెనక ఇండియన్ ముజాహిదీన్ హస్తం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు.

మరిన్ని వార్తలు