పేరుకే మహిళలు.. పెత్తనమంతా మగాళ్లదే! | Sakshi
Sakshi News home page

పేరుకే మహిళలు.. పెత్తనమంతా మగాళ్లదే!

Published Thu, May 18 2017 3:07 PM

పేరుకే మహిళలు.. పెత్తనమంతా మగాళ్లదే!

కోచి: అనేక ఏళ్లు కమ్యూనిస్టులే పాలించినప్పటికీ కేరళ రాష్ట్ర అసెంబ్లీలో మహిళల ప్రాతినిధ్యం బాగా తక్కువ. 1957లో రాష్ట్ర అసెంబ్లీలో 114 సీట్లు ఉండగా, ఆరుగురు మహిళలు గెలిచారు. ప్రస్తుతం 140 సీట్లుగల అసెంబ్లీకి ఏడుగురు మహిళలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. స్థానిక సంఘాల్లో ఈ పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. ఎన్నికైన మహిళల సంఖ్య 54 శాతం ఉంది. అయినా ఏం లాభం పెత్తనమంతా మగవాళ్లదే.

రాష్ట్రం మొత్తం మీద స్థానిక స్వయం పాలక సంఘాలు లేదా సంస్థలు 1200 ఉన్నాయి. వాటిలో 941 గ్రామ పంచాయతీలు, 152 బ్లాక్‌ పంచాయతీలు, 14 జిల్లా పంచాయితీలు, 87 మున్సిపాలిటీలు, ఆరు మున్సిపల్‌ కార్పొరేషన్లు ఉన్నాయి. గ్రామ పంచాయతీలకు ఎన్నికైన మహిళా సర్పంచులను సంప్రతించగా, పేరుకే తాము సర్పంచులమని, పెత్తనమంతా తమ భర్తలది లేదా పాలకపక్ష నాయకులదేనని మెజారిటీ సభ్యులు చెప్పారు. రిజర్వేషన్ల కారణంగా ఎక్కువ మంది మహిళలు పదవుల్లోకి వస్తున్నారని, అయితే వారికి సరైన రాజకీయ అనుభవం లేకపోవడం వల్ల అభివృద్ధి కార్యక్రమాలు కుంటుపడుతున్నాయని ప్రతిపక్షాలకు చెందిన నాయకులు ఆరోపిస్తున్నారు.

మహిళలకు రిజర్వ్‌ చేయడం వల్లనే తాను మేయర్‌గా ఎన్నికయ్యానని లేకపోతే ఎన్నికయ్యే అవకాశమే లేదని కోచి మేయర్‌ సౌమిని జైన్‌ తెలిపారు. తనకు విధులు నిర్వహించడమంటే ప్రతిరోజు గడ్డు రోజేనని ఆమె చెప్పారు. కేరళ రాజకీయాల్లో మొదటి నుంచి మగవాళ్ల ప్రాబల్యమే ఎక్కువని ప్రముఖ ఆర్థిక వేత్త ఎంఏ ఊమ్మెన్‌ చెప్పారు. రాజకీయాల్లో మహిళల ప్రాబల్యం పెరగాలంటే పార్టీలకు అతీతంగా పదవుల్లో ఉన్న మహిళలంతా ఏకం కావాలని ఆయన సూచించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement