పాకిస్థాన్ కొత్త ఎత్తుగడ | Sakshi
Sakshi News home page

పాకిస్థాన్ కొత్త ఎత్తుగడ

Published Wed, Oct 12 2016 3:41 PM

పాకిస్థాన్ కొత్త ఎత్తుగడ

ఇస్లామాబాద్: పాకిస్థాన్ను దౌత్యపరంగా చావుదెబ్బ కొడుతూ దక్షిణ ఆసియా ప్రాంతీయ సహకార కూటమి(సార్క్) సమావేశాలను బహిష్కరించిన భారత్పై అంతకంతకూ ప్రతీకారం తీర్చుకునేలా దాయాది దేశం భారీ ప్రణాళికలు రచిస్తోంది. సార్క్ ఏర్పడిననాటి నుంచీ కూటమిలో ఇండియానే ఆధిపత్యం చెలాయిస్తోందని ఆరోపించిన పాక్.. సార్క్కు పోటీగా 'గ్రేటర్ సౌత్ ఏసియన్ ఎకనామిక్ అలయెన్స్'(విశాల దక్షిణాసియా ఆర్థిక కూటమి)ని ఏర్పాటుచేయాలని భావిస్తోంది.

ఇందులో చైనా, ఇరాన్ లతోపాటు మరికొన్ని మధ్య ఆసియా దేశాలనూ భాగస్వాములు చేయాలనుకుంటోంది. 'భారత్ కూడా ఈ కూటమిలో చేరొచ్చు' అని పైకి చెబుతున్నప్పటికీ 'గ్రేటర్ అలయెన్స్' అసలు ఉద్దేశం ఇండియాను ఇబ్బందిపెట్టడమే! ప్రస్తుతం న్యూయార్క్ లో పర్యటిస్తోన్న పాకిస్థాన్ పార్లమెంటరీ బృందం ఈ మేరకు కొత్త కూటమి విధివిధానాలపై చర్చిస్తున్నట్లు ప్రముఖ పాకిస్థానీ మీడియా సంస్థ బుధవారం ఒక రిపోర్టును ప్రచురించింది.

పాకిస్థాన్ పార్లమెంటరీ బృందంలో సభ్యుడైన ముషాహిద్ హుస్సేన్ సయీద్.. మంగళవారం అమెరికాలో మీడియాతో మాట్లాడుతూ గ్రేటర్ సౌత్ ఏసియా అలయెన్స్ ఏర్పాటు ప్రయత్నాలు నిజమేనని ధృవీకరించారు. 'నిజానికి ఈ కూటమి ఇప్పటికే మనుగడలో ఉన్నప్పటికీ ఆయా దేశాల మధ్య ఆర్థిక, వాణిజ్య పరమైన సహకార ఒప్పందాలేవీ లేవు. గ్రేటర్ సౌత్ ఏసియన్ ఎకనామిక్ అలయెన్స్ ఏర్పాటుతో అన్ని సభ్యదేశాలు అభివృద్ధిలో భాగస్వాములు కావచ్చు. భారత్ ను కూడా కూటమిలోకి ఆహ్వానిస్తాం.. కానీ వాళ్లు చేరకపోవచ్చు' అని ముషాహిద్ హుస్సేన్ అన్నారు. సార్క్లో తన ఆధిపత్యం కొనసాగుతుండగా.. భారత్ కొత్త కూటమిలోకి చేరకపోవచ్చని ఆయన వ్యాఖ్యానించారు.

మరి కొద్ది రోజుల్లో (నవంబర్ లో) ఇస్లామాబాద్ వేదికగా జరాగాల్సిఉన్న 19వ సార్క్ సదస్సును బహిష్కరిస్తున్నట్లు ఇదివరకే ప్రకటించిన భారత్.. పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నందునే తామీ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఇతర సభ్యదేశాలైన బంగ్లాదేశ్, అప్ఘానిస్థాన్, నేపాల్, శ్రీలంక, భూటాన్, మాల్దీవులు సైతం భారత్ నిర్ణయాన్ని సమర్థిస్తూ పాక్ లో జరగాల్సిన సార్క్ సమావేశాలను బహిష్కరించారు. దీంతో పాక్ దక్షిణాసియాలో ఒంటరైపోయింది. తన మిత్రులైన చైనా, ఇరాన్ లతో గ్రేటర్ అలయెన్స్ ఏర్పాటుచేసి తన మళ్లీ అందరితో కలవాలని పాక్ ప్రయత్నిస్తోంది. కాగా, ఒక్క అఫ్ఘానిస్థాన్ కు తప్ప సార్క్ లోని ఏ దేశానికి ఈ కొత్త కూటమి వల్ల ఎలాంటి ప్రయోజం ఉండదు. కాబట్టి అవేవీ పాక్ కూటమిలో చేరే అవకాశం లేదు. అఫ్ఘానిస్థాన్ ఉన్నదే మధ్య ఆసియాలో కాబట్టి ఆర్థిక ప్రయోజనాల రీత్యా అటువైపు మొగ్గుచూపొచ్చు. అప్పుడు కూడా భారత్ సూచనలమేరకే అఫ్ఘాన్ నడుచుకుంటుందని పాక్ మీడియా రిపోర్టులో పేర్కొన్నారు.

Advertisement
Advertisement