నేడు సంజయ్ దత్ విడుదల | Sakshi
Sakshi News home page

నేడు సంజయ్ దత్ విడుదల

Published Thu, Feb 25 2016 6:28 AM

నేడు సంజయ్ దత్ విడుదల

శిక్షలో రెమిషన్‌తో ముందుగానే విముక్తి
సాక్షి, పుణే/ముంబై: ముంబై  బాంబు పేలుళ్ల కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్‌కు గురువారం పుణేలోని ఎరవాడ జైలు నుంచి విడుదలకానున్నారు. సత్ప్రవర్తన కారణంగా ఐదేళ్ల శిక్షలో మినహాయింపు (రెమిషన్) లభించడంతో ఎనిమిది నెలల 16 రోజులు ముందుగానే విడుదల కానున్నారు. ఇదిలా ఉంటే సంజయ్‌ను ప్రభుత్వం ముందుగానే విడుదల చేయడాన్ని సవాలు చేస్తూ ప్రదీప్ భలేకర్ అనే సామాజిక కార్యకర్త బుధవారం బాంబే హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు.

చిన్న చిన్న కేసుల్లో అనేకమంది సాధారణ ఖైదీలు ఏళ్ల తరబడి జైళ్లలో మగ్గు తున్నారని, శిక్ష మినహాయింపుపై వారి దరఖాస్తులను పట్టించుకోకుండా దత్ విషయంలో వీఐపీ మర్యాదలతో ప్రత్యేక శ్రద్ధ చూపారని ఆరోపించారు.
 
ప్రైవేట్ విమానంలో ముంబైకి..
జైలు నుంచి బయటకొచ్చాక దత్ ముంబైకి ప్రైవేట్ విమానంలో రానున్నారని సమాచారం. పుణే-ముంబై హైవేపై ట్రాఫిక్ సమస్య, మీడియా నుంచి ఇబ్బంది పడకుండా ఉండేందుకు విమానంలో వెళ్తున్నట్లు సమాచారం. విడుదలయ్యే సమయంలో జైలు వద్దకు ఆయన భార్య మాన్యతా దత్‌తోపాటు మరి కొందరు సన్నిహితులు వెళ్లనున్నట్టు సమాచారం.
 
ఉచితంగా చికన్ సంజుబాబా..
సంజయ్ దత్ విడుదలవుతున్న నేపథ్యంలో దక్షిణ ముంబైలోని ‘నూర్ మహమ్మదీ హోటల్’లో చికన్ సంజుబాబా పేరుతో కస్టమర్లకు గురువారం ఒక్కరోజు ఉచితంగా ప్రత్యేక వంటకాన్ని పంపిణీ చేయనున్నారు.

Advertisement
Advertisement