కేంద్ర మంత్రిగా మహిళా సీఎం? | Sakshi
Sakshi News home page

కేంద్ర మంత్రిగా మహిళా సీఎం?

Published Tue, Mar 14 2017 10:41 AM

కేంద్ర మంత్రిగా మహిళా సీఎం? - Sakshi

న్యూఢిల్లీ: పార్లమెంట్ సమావేశాలు ముగిసిన తర్వాత కేంద్ర కేబినెట్ లో భారీ మార్పులు జరగనున్నాయని వార్తలు వస్తున్నాయి. బడ్జెట్ సమావేశాలు ముగిసిన తర్వాత మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశముందని ప్రచారం జరుగుతోంది. ఉత్తరాదిలోని బీజేపీ పాలిత రాష్ట్ర ముఖ్యమంత్రిని కేబినెట్ లోకి తీసుకునే అవకాశముందని సీనియర్ ప్రధాన కార్యదర్శి ఒకరు వెల్లడించారు. ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎంపిక చేసేందుకు బీజేపీ కేంద్రం బృందం ఉత్తరాది రాష్ట్రానికి వెళ్లనుందని చెప్పారు. రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజేను కేంద్ర మంత్రిగా నియమిస్తారని సూచనప్రాయంగా వెల్లడించారు.

'పార్లమెంట్ సమావేశాలు ముగిసిన తర్వాత కేబినెట్ పునర్వ్యస్థీకరణ జరిగే అవకాశముంది. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ముఖ్యమంత్రుల పనితీరుపై తీవ్ర మదింపు జరుగుతోంది. ఉదాహరణకు రాజస్థాన్ సీఎం వసుంధరా రాజే పేరును కేంద్ర మంత్రి పదవికి పరిశీలిస్తున్నారు. వాజపేయి హయాంలో ఆమె కేంద్ర మంత్రిగా పనిచేశారు. రాజస్థాన్ కే చెందిన పార్టీ ప్రధాన కార్యదర్శి ఓమ్ మాథుర్ ను అక్కడికి పంపించే అవకాశముంది. ఢిల్లీ నుంచి ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్ కు ఎవరినైనా పంపిస్తే కేబినెట్ మరిన్ని ఖాళీలు ఏర్పడతాయ'ని విశ్వసనీయ వర్గాలు వివరించాయి. మనోహర్ పరీకర్ ఇప్పటికే రక్షణ మంత్రి పదవికి రాజీనామా చేసి గోవా సీఎం పగ్గాలు చేపట్టేందుకు వెళ్లారు. పరీకర్ కోసం రాజీనామాకు సిద్ధపడిన గోవా ఉప ముఖ్యమంత్రి ఫ్రాన్సిన్ డిసౌజాను కేంద్ర కేబినెట్ లోకి తీసుకుంటారని కూడా వార్తలు వస్తున్నాయి.

పెరిగిన మోదీ పట్టు
ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించడంతో పార్టీ, ప్రభుత్వంపై ప్రధాని నరేంద్ర మోదీ పట్టు పెరిగిందని బీజేపీ వర్గాలు వెల్లడించాయి. ముఖ్యమంత్రులతో సహా ఎవరూ ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడే సాహసం చేయకపోవచ్చని పేర్కొన్నాయి. పార్టీలోనూ భారీ మార్పులు ఉండొచ్చన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి.

Advertisement
Advertisement