సోనియా చెంతకు బీజేపీ కీలక నేతలు | Sakshi
Sakshi News home page

సోనియా చెంతకు బీజేపీ కీలక నేతలు

Published Wed, Jun 14 2017 4:52 PM

సోనియా చెంతకు బీజేపీ కీలక నేతలు - Sakshi

- హస్తినలో హీటెక్కిన రాజకీయం
- రాష్ట్రపతి ఎన్నికల కోసం మెట్టుదిగిన అధికారపక్షం
- కాంగ్రెస్‌ అధినేత్రిని కలిసి మద్దతు కోరనున్న బీజేపీ కమిటీ
- సీపీఎం, ఎన్సీపీ, బీఎస్పీతోనూ మంతనాలు
- పరిణామాలపై ఉమ్మడిగా చర్చించిన విపక్షాలు


న్యూఢిల్లీ:
రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి మరో కీలక పరిణామం చోటుచేసుకోనుంది. అభ్యర్థి ఎంపిక విషయంలో ఇన్నాళ్లూ ఏకపక్షంగా వ్యవహరించిన బీజేపీ.. తొలిసారి దిగివచ్చింది. విపక్షాల మద్దతు కూడా కూడగట్టేందుకు కసరత్తు ప్రారంభించింది. ఈ క్రమంలోనే బీజేపీ త్రిసభ్య కమిటీ నేడో రేపో కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ చెంతకువెళ్లి మద్దతు కోరనుంది.

రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు కూడగట్టేందుకుగానూ బీజేపీ ఏర్పాటుచేసిన కమిటీలోని సభ్యులు వెంకయ్యనాయుడు, రాజ్‌నాథ్‌సింగ్‌లు సోనియా గాంధీని కలవనున్నట్లు బుధవారం వార్తలు వెలువడ్డాయి. అటు సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి కూడా బీజేపీ కమిటీ కలవనుంది.

మరోవైపు శరద్‌పవార్‌ నేతృత్వంలోని నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ(ఎన్సీపీ), మాయవతి నాయకత్వంలోని బహుజన్‌ సమాజ్‌ పార్టీ(బీఎస్పీ)లతోనూ బీజేపీ కమిటీ ఇప్పటికే మంతనాలు జరిపింది. ఎన్సీపీ కీలక నేత ప్రఫుల్ల పటేల్‌, బీఎస్పీ నాయకుడు సతీశ్‌ మిశ్రాలతో వెంకయ్య, రాజ్‌నాథ్‌లు జరిపిన చర్చలు ఫలించినట్లు సమాచారం.

రాష్ట్రపతి ఎన్నికలకు నేడు (జూన్‌ 14న) నోటిఫికేషన్‌ వెలువడనుంది. ఈ రోజు నుంచే నామినేషన్లు స్వీకరిస్తారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ఈ నెల 23న నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. ఆ అభ్యర్థి ఎవరనేది ప్రస్తుతానికి సస్పెన్స్‌. అన్ని పార్టీల మద్దతు కూడగట్టిన తర్వాతే ఎన్డీఏ తన అభ్యర్థి పేరును ప్రకటించనుంది.

విపక్షాల దూకుడు
ఒకవైపు బీజేపీ త్రిసభ్య కమిటీ సోనియా, సీతారాం ఏచూరిలతో చర్చలకు సిద్ధమైన వేళ.. విపక్షపార్టీలు కీలక చర్చలు జరిపాయి. పార్లమెంట్‌ ఆవరణలో జరిగిన భేటీకి కాంగ్రెస్‌ నుంచి గులాం నబీ ఆజాద్‌, మల్లికార్జున ఖర్గే, ఆర్జేడీ నుంచి లాలూ ప్రసాద్‌ యాదవ్‌, సీపీఎం తరఫున సీతారాం ఏచూరి, తృణమూల్‌ కాంగ్రెస్‌ నుంచి ఎంపీ ఒబ్రెయిన్‌, పీఎంకే నుంచి అన్బుమణి రాందాస్‌, సమాజ్‌వాదీ పార్టీ నుంచి రాంగోపాల్‌ యాదవ్‌ తదితర నాయకులు హాజరయ్యారు. విపక్షాల ఉమ్మడి అభ్యర్థిని నిలబెడతాయా?లేక బీజేపీ దిగొచ్చినందున ఎన్డీఏ అభ్యర్థికే మద్దతు తెలుపుతాయా? తేలాల్సిఉంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement