ప్రైవేటు విమానాల్లో కూడా.. | Sakshi
Sakshi News home page

ప్రైవేటు విమానాల్లో కూడా..

Published Sat, Apr 8 2017 2:03 PM

ప్రైవేటు విమానాల్లో కూడా..

శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్‌ మీద నిషేధాన్ని ఎయిరిండియా ఎత్తేయడంతో.. ప్రైవేటు విమానయాన సంస్థలు సైతం అదే బాటలో నడిచాయి. కావాలనుకుంటే తమ విమానాల్లో కూడా గైక్వాడ్‌ ప్రయాణం చేయొచ్చని తెలిపాయి. ఎంపీ చేసిన ప్రకటనతో సంతృప్తి చెందిన తర్వాత ఎయిర్‌ ఇండియా సంస్థ ఆయనను అనుమతించాలని నిర్ణయించడంతో, ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఎయిర్‌లైన్స్‌లో సభ్యత్వం ఉన్న విమానయాన సంస్థలు అన్నీ గైక్వాడ్‌ను తమ విమానాల్లో అనుమతించాలని నిర్ణయించినట్లు ఎఫ్‌ఐఏ డైరెక్టర్‌ ఉజ్వల్‌ డే తెలిపారు. అయితే, ఇదే సందర్భంలో తమ సిబ్బంది, ఆస్తులకు తగిన రక్షణ ఇవ్వాలని, వాళ్లు ప్రతిరోజూ ఎంతగానో కష్టపడుతున్నందున ఆ కష్టానికి తగిన గౌరవం ఇవ్వాలని.. ఆ మేరకు హామీ వచ్చిన తర్వాతే ఆయనకు విమాన ప్రయాణం చేసే అవకాశం ఇస్తున్నామని డే చెప్పారు.

ఇండిగో, స్పైస్‌ జెట్, గోఎయిర్, టాటా గ్రూపు ఎయిర్‌లైన్స్, విస్తారా, ఎయిర్‌ఏషియా ఇండియా తదితర సంస్థలకు ఎఫ్‌ఐఏలో సభ్యత్వం ఉంది. ఇవన్నీ కూడా మార్చి 24వ తేదీ నుంచి గైక్వాడ్‌ను తమ విమానాల్లో ఎక్కించుకునేది లేదంటూ నిషేధం విధించాయి. ఢిల్లీ విమానాశ్రయంలో దాదాపు 60 ఏళ్ల వయసున్న ఎయిరిండియా అధికారి ఒకరిని గైక్వాడ్‌ చెప్పుతో కొట్టి విమానం మెట్ల మీద నుంచి కిందకు తోసేందుకు ప్రయత్పినంచడంతో విమానయాన సంస్థలన్నీ ఆయనను నిషేధించాయి. ఆ తర్వాతి నుంచి ఎయిరిండియా సహా పలు సంస్థల విమానాలు ఎక్కడానికి గైక్వాడ్‌పలు రకాలుగా ప్రయత్నించారు గానీ, ప్రతిసారీ ఆయన టికెట్లు రద్దవుతూనే వచ్చాయి.

రెండు వారాల పాటు నిషేధం విధించిన తర్వాత ప్రభుత్వ సూచన మేరకు ఆ నిషేధాన్ని ఎత్తేశాయి. రవీంద్ర గైక్వాడ్‌ క్షమాపణలు తెలిపారని, ఆయన ఇక మీదట సత్ప్రవర్తన కలిగి ఉంటానని హామీ కూడా ఇచ్చారని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశవ్యాప్తంగా సిబ్బందితోను, ఇతర ప్రయాణికులతోను అగౌరవంగా ప్రవర్తించే వ్యక్తులతో కూడిన ఒక ‘నో ఫ్లై జాబితా’ను సిద్ధం చేయాలని విమానయాన మంత్రిత్వశాఖ భావిస్తోంది. ఈ మేరకు వచ్చేవారం ఒక ముసాయిదా సిద్ధం చేసి ప్రజల నుంచి కూడా దానిపై స్పందనలు తీసుకుంటారు.  

Advertisement
Advertisement