ఓటమికి 14 కారణాలు | Sakshi
Sakshi News home page

ఓటమికి 14 కారణాలు

Published Tue, Jun 24 2014 12:49 AM

ఓటమికి 14 కారణాలు - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయానికి 14 కారణాలున్నాయని ఏపీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి ఏఐసీసీకి నివేదిక ఇచ్చారు. పార్టీ పరాజయం, భావి కార్యాచరణపై సోమవారం ఇక్కడ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏఐసీసీ నేతలు సమీక్షించారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి దిగ్విజయ్‌సింగ్ సమక్షంలో జరిగిన సమావేశంలో ఏఐసీసీ కార్యదర్శి తిరునావక్కరసు, రాజ్యసభ సభ్యులు చిరంజీవి, జైరాం రమేశ్, జేడీ శీలం, మాజీ కేంద్ర మంత్రి పల్లంరాజు, డొక్కా మాణిక్యప్రసాద్ తదితరులు ఓటమికి గల కారణాలను విశ్లేషించారు.
 
 జూన్ 17న విజయవాడలో జరిగిన సమావేశంలో పార్టీ అభ్యర్థులు పార్టీ పరాజయంపై, భవిష్యత్తు కార్యాచరణపై చేసిన విశ్లేషణలను క్రోడీకరించి ఒక నివేదికను ఏపీసీసీ అధ్యక్షుడు అందించగా.. వాటన్నింటిపై చర్చించి భవిష్యత్తు కార్యాచరణ రూపొందించారు. కేంద్రంలో, రాష్ట్రంలో పదేళ్ల కాంగ్రెస్ పాలన, అధిక ధరలు, ఆధార్‌ను గ్యాస్‌కు అనుసంధానం చేయడంవంటి కారణాలవల్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని తెలిపారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్న కిరణ్‌కుమార్‌రెడ్డి రహస్య ఎజెండాతో పనిచేయడం, ఢిల్లీ పరిశీలకుల వ్యాఖ్యలు, పార్టీకి రాజీనామా చేసిన నేతల తీవ్ర విమర్శలు పరాజయానికి కారణాలని పేర్కొన్నారు. కాంగ్రెస్‌కు మీడియా మద్దతు లేకపోవడం కూడా మరో కారణమని చెప్పారు. పార్టీని అన్ని స్థాయిల్లో పునర్నిర్మించుకోవాలని, సొంత మీడియాను ఏర్పాటు చేసుకోవాలని 16 భవిష్యత్ కార్యాచరణ సూత్రాలను సూచించారు. దాదాపు గంటన్నరపాటు జరిగిన ఈ సమావేశం అనంతరం రఘువీరా ఆయా వివరాలు మీడియాకు వెల్లడించారు. జులైలోగా మండల స్థాయి నుంచి పీసీసీ స్థాయి వరకు కమిటీలు ఏర్పాటుచేసి.. ఆయా కమిటీల ప్రతినిధులతో ఆగస్టు 2వ వారంలో రెండు రోజుల సమావేశం ఏర్పాటుచేయనున్నట్టు వివరించారు. తొలి రోజు సమావేశానికి సోనియాగాంధీ, మలి రోజు సమావేశానికి రాహుల్ గాంధీ హాజరవుతారని వివరించారు.

Advertisement
Advertisement