ఆ బాలిక పరిస్థితి దయనీయం.. | Sakshi
Sakshi News home page

ఆ బాలిక పరిస్థితి దయనీయం..

Published Mon, Aug 31 2015 11:25 AM

ఆ బాలిక పరిస్థితి దయనీయం.. - Sakshi

సింగ్భమ్: అదొక మారుమూల ప్రాంతం. గుట్టలు, పుట్టలు... నడిచేందుకు బాటకూడా సరిగా లేని వైనం.. తిండికూడా దొరకని పరిస్థితి. కడుపునిండా భోజనం లేక కొంత మేర కృశించిన శరీరంతో తొమ్మిదేళ్ల బాలిక. ఆ బాలికపై ఓ కామాంధుడి కళ్లుపడ్డాయి. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆ బాలికను తీసుకెళ్లి ఓ నది ఒడ్డున పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు.

దీంతో దాదాపు చచ్చుబడిపోయినట్లుగా మారిపోయిందా బాలిక శరీరం. ఈ దారుణానికి పాల్పడిన వాడిని అరెస్టు చేశారు కానీ.. ఆ బాలిక పరిస్థితి దయనీయంగా మారింది. తిరిగి తమ కూతురును మాములు స్థితిలోకి మార్చుకోవాలని నిరక్ష్యరాస్యులైన ఆ తల్లిదండ్రుల చేస్తున్న పోరాటం అంతా ఇంతా కాదు. ఇది జార్ఖండ్ రాష్ట్రంలోని తూర్పు సింగ్భమ్ జిల్లాలోని ఓ మారుమూల గ్రామంలో జరిగిన ఓ అమానవీయ ఘటన.

రాంచీకి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆ బాధిత కుటుంబం.. తమ కన్న కూతురికి తిరిగి పునరుజ్జీవం అందించేందుకు రెండు నెలలుగా ప్రాయసపడుతోంది. దాదాపు నాలుగు కిలోమీటర్లు ఆ బాలిక తండ్రి తన భుజాలపై ఎత్తుకొని రాంఛీలోని ప్రభుత్వ ఆస్పత్రికి కాలినడకన తీసుకెళుతున్నాడు. ఈ విషయం హైకోర్టు దృష్టికి వెళ్లడంతో కాస్త వారికి ఉపశమనం లభించింది. బ్లాక్ స్థాయి అధికారులు ముందుకొచ్చి ఆ కుటుంబానికి బాసటగా నిలుస్తామని హామీ ఇచ్చారు.

ఆ బాలికను తీసుకెళ్లేందుకు సైకిల్ ఏర్పాటు చేస్తామని, కోర్టు ఆదేశించినట్లుగా తక్షణమే లక్ష రూపాయలు అందిస్తామని, ఇతర ఆర్థిక పరమైన అవసరాలు కూడా తీరుస్తామని హామీ ఇచ్చారు. తండ్రికి గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద దీర్ఘకాలిక ఉపాధి ఇప్పిస్తామని, వ్యవసాయ భూమి కూడా ఇస్తామని స్పష్టం చేశారు. దీంతో ఆ కుటుంబానికి కొంత ఊరట కలిగింది. వైద్యులు కూడా బాలిక ప్రాణానికి ప్రాణాపాయం లేదని స్పష్టం చేశారు. ఈ బాలికపై లైంగిక దాడికిపాల్పడిన వ్యక్తిపై గతంలో కూడా ఇలాంటి కేసులు ఉన్నాయి.

Advertisement
Advertisement