3 నుంచి షర్మిల పరామర్శ యాత్ర | Sakshi
Sakshi News home page

3 నుంచి షర్మిల పరామర్శ యాత్ర

Published Fri, Jan 1 2016 4:27 AM

3 నుంచి షర్మిల పరామర్శ యాత్ర - Sakshi

* మెదక్, నిజామాబాద్ జిల్లాల్లో నాలుగురోజుల పాటు యాత్ర
* వైఎస్ హఠాన్మరణాన్ని తట్టుకోలేక మరణించిన వారి కుటుంబాలకు పరామర్శ
* యాత్రను విజయవంతం చేయాలని వైఎస్సార్‌సీపీ పిలుపు
* గ్రేటర్ ఎన్నికలయ్యాక హైదరాబాద్‌లోనూ యాత్ర: శివకుమార్

సాక్షి, హైదరాబాద్: జన నేత వైఎస్ రాజశేఖరరెడ్డి హఠాన్మరణాన్ని తట్టుకోలేక చనిపోయిన వారి కుటుంబసభ్యులను పరామర్శించేందుకు ఆయన తనయ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల జనవరి 3 నుంచి మెదక్, నిజామాబాద్ జిల్లాల్లో పర్యటించనున్నారు.

ఆమె పరామర్శ యాత్ర షెడ్యూల్‌ను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రధాన కార్యదర్శి నల్లా సూర్యప్రకాశ్  గురువారం వెల్లడించారు. మరో ప్రధాన కార్యదర్శి కె. శివకుమార్‌తో కలిసి లోటస్‌పాండ్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. మెదక్ జిల్లాలో యాత్ర జనవరి 3, 4, 5 తేదీల్లో జరుగుతుందని తెలిపారు. ‘‘గజ్వేల్‌లో యాత్ర ప్రారంభించి జిల్లాలో 13 కుటుంబాలను షర్మిల పరామర్శిస్తారు. పటాన్‌చెరు మినహా మెదక్‌లోని 9 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటిస్తారు. 5వ తేదీ నారాయణఖేడ్‌లో పెద్ద బహిరంగ సభ ఉంటుంది.

అదే రోజు మధ్యాహ్నం యాత్ర నిజామాబాద్ జిల్లాలోకి ప్రవేశిస్తుంది. జుక్కల్ నియోజకవర్గం పిట్లంతో మొదలుపెట్టి జిల్లాలో మూడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఏడు కుటుంబాలను షర్మిల పరామర్శిస్తారు. జనవరి 6 సాయంత్రం తిరిగి లోటస్‌పాండ్ చేరుకుంటారు’’ అని వివరించారు. వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, నల్లగొండ, మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల్లో పూర్తిగా, నిజామాబాద్‌లో కొంతమేరకు షర్మిల పరామర్శ యాత్ర ఇప్పటికే పూర్తయిన విషయాన్ని గుర్తు చేశారు.

ఎన్ని ఆటంకాలు ఎదురైనా,ప్రజలకిచ్చిన మాట మేరకు వైఎస్ జగన్ ఇప్పటికే కోస్తా, రాయలసీమల్లో ఓదార్పు యాత్ర చేశారని, తెలంగాణలోనూ ఖమ్మం జిల్లాలో ఓదార్పు యాత్ర పూర్తి చేశారని నల్లా గుర్తు చేశారు. వైఎస్ మరణాన్ని తట్టుకోలేక చనిపోయిన కుటుం బాలకు ‘మేమున్నాం’ అనే భరోసా కల్పించేందుకే షర్మిల పరామర్శ యాత్ర చేస్తున్నారని శివకుమార్ అన్నారు. గ్రేటర్ ఎన్నికల తర్వాత హైదరాబాద్‌లో కూడా షర్మిల పరామర్శ యాత్ర ఉంటుందని తెలిపారు.

షర్మిల యాత్రను జయప్రదం చేసేందుకు పార్టీ ప్రధాన కార్యదర్శులు, కార్యవర్గసభ్యులు, అనుబంధ విభాగాల అధ్యక్షులు, శ్రేణులందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. వైఎస్సార్‌సీపీ కార్మిక విభాగం అధ్యక్షుడు నర్రా భిక్షపతి, పార్టీ జాయింట్ సెక్రటరీ సంజీవరావు, మెదక్ జిల్లా పార్టీ అధ్యక్షుడు గౌరిరెడ్డి, నేతలు సిద్దిపేట జగదీశ్వర్ గుప్తా, శ్రీధర్ రెడ్డి తదితరులు మీడియా సమావేశంలో పాల్గొన్నారు.

Advertisement
Advertisement