సిరియాలో రసాయన దాడి, 1300 మంది బలి | Sakshi
Sakshi News home page

సిరియాలో రసాయన దాడి, 1300 మంది బలి

Published Thu, Aug 22 2013 12:38 AM

డమాస్కస్ లో రసాయన ఆయుధాల దాడుల్లో మరణించిన చిన్నారులు

* పౌరులపై ప్రభుత్వ బలగాల ఘాతుకం  
* డమాస్కస్ శివారులోని రెబల్స్ స్థావరాలపై దాడి
* మృతుల్లో పెద్ద సంఖ్యలో పిల్లలు  వందలాది మందికి అస్వస్థత
* మొదట రసాయన ఆయుధాలతో, తర్వాత విమానాల నుంచి బాంబులతో..
* జాతీయ విపక్ష కూటమి వెల్లడి.. దాడి వార్తలు కట్టుకథలన్న ప్రభుత్వం
 
బీరుట్: అంతర్యుద్ధంతో అట్టుడుకుతున్న సిరియాలో బుధవారం చరిత్ర ఎరుగని దారుణ మారణహోమం జరిగింది. ప్రభుత్వ బలగాలు జరిపిన రసాయన ఆయుధ దాడిలో 1,300 మందికి పైగా బలయ్యారు. మృతుల్లో పెద్ద సంఖ్యలో పిల్లలు ఉన్నారు. వందల సంఖ్యలో అస్వస్థతకు గురయ్యారు. ఈమేరకు ప్రధాన విపక్ష కూటమి ‘నేషనల్ కొయిలిషన్’ వెల్లడించింది. ఆ ఆరోపణను ప్రభుత్వం ఖండించింది. అయితే మీడియాలో వచ్చిన ఫోటోలు, వీడియో దృశ్యాలు దాడికి నిదర్శనంగా నిలిచాయి. కొందరు నురగలు కక్కుతూ చనిపోతున్నట్లు, కొందరు ఎగశ్వాస తీసుకుంటున్నట్లు వాటిలో కనిపించారు. మృదేహాలపై ఎలాంటి గాయాలూ కనిపించకపోవడం రసాయన దాడి జరిగిందనడానికి ఊతమిస్తోంది.
 
విషపు దాడి.. బాంబుల మోత..
దేశ రాజధాని డమాస్కస్‌కు దగ్గర్లోని తూర్పు గౌటాలో తిరుగుబాటుదారుల స్థావరాలపై ప్రభుత్వ బలగాలు ఉదయం రసాయనిక ఆయుధాలతో కూడిన రాకెట్లతో దాడి చేశాయని విపక్ష కూటమి తెలిపింది. విష వాయువులు పీల్చి వందలాది మంది చనిపోయారని, ఊచకోతలో కుటుంబాలకు కుటుంబాలు అసువులు బాశాయని ‘లోకల్ కోఆర్డినేషన్ కమిటీస్’ పేర్కొంది. రసాయనిక దాడి తర్వాత, యుద్ధవిమానాల నుంచి బాంబుల వర్షం కురిపించారని తెలిపింది. కడపటి వార్తలు అందే సమయానికి రసాయనిక దాడి సాగుతోందని చెప్పింది.

ఇర్బిన్, దూమా, మాధామియా తదితర ప్రాంతాల్లో పదుల సంఖ్యలో చనిపోయారని తెలిపింది. దాడుల దృశ్యాలుగా పేర్కొంటూ కొంతమంది సామాజిక కార్యకర్తలు మీడియాలో కొన్ని వీడియోలు ప్రసారం చేశారు. రోడ్లపై వరుసగా ఉన్న పిల్లల మృతదేహాలు, ఆస్పత్రుల్లో ఆక్సిజన్ చికిత్స పొందుతున్న చిన్నారులు ఈ దృశ్యాల్లో కనిపించారు. బాధితులకు మసీదుల్లో, స్కూళ్లలో చికిత్స చేస్తున్నామని ఘాజ్వాన్ విదనీ అనే వైద్యుడు తెలిపాడు.

రసాయనిక ప్రభావానికి విరుగుడు మందైన ఏట్రోపైన్ తగినంత స్థాయితో తమ వద్ద లేదన్నారు. కాగా, దేశ సమస్యకు రాజకీయ పరిష్కారం లభిస్తుందన్న ఆశలకు ఈ దాడితో గండి కొట్టారని విపక్ష కూటమి నేత జార్జి సబ్రా వ్యాఖ్యానించారు. సిరియాలో రసాయన ఆయుధాలు ఉన్నాయో లేవో తేల్చడానికి ఐరాస నిపుణుల బృందం ఆదివారం సిరియాకు వచ్చిన నేపథ్యంలో ఈ దాడి ఉదంతం చోటుచోసుకోవడం గమనార్హం.
 
దాడి జరగలేదు: ప్రభుత్వం
రసాయనిక దాడి వార్తలు పచ్చి అబద్ధమని ప్రభుత్వం తెలిపింది. రసాయనిక ఆయుధాలు ఉన్నాయో లేవో తనిఖీ చేయడానికి వచ్చిన ఐక్యరాజ్య సమితి బృంద కార్యకలాపాలకు ఆటంకం కలిగించడానికే ఈ వార్తలను ప్రచారం చేస్తున్నారని ఆరోపించింది.
 
 దర్యాప్తు జరపాలి: ప్రపంచ దేశాల డిమాండ్..
 సిరియాలో రసాయనిక దాడి జరిగిందన్న వార్తలపై ప్రపంచ దేశాల నుంచి మిశ్రమ స్పందన లభించింది. కొన్ని దాడిని ఖండించగా, కొన్ని ఈ వార్తల వెనుక కుట్ర ఉందన్నాయి. దాడి జరిగి ఉంటే అది ఆమోదయోగ్యం కాదని, దీనిపై వెంటనే దర్యాప్తు జరపాలని యూరోపియన్ యూనియన్(ఈయూ) డిమాండ్ చేసింది.

మారణ కాండపై స్పందించి, పరిస్థితి మరింత దిగజారకుండా చూడాలని ఐక్యరాజ్య సమితి, ఈయూలకు సౌదీ అరేబియా విజ్ఞప్తి చేసింది. దాడి వార్తల సంగతిని ఐరాస భద్రతా మండలి దృష్టికి తీసుకెళ్తామని బ్రిటన్ తెలిపింది. ఐరాస తనిఖీ బృందం సంఘటన ప్రాంతానికి వెళ్లి వాస్తవాలేమిటో తెలుసుకోవాలని అరబ్ లీగ్‌తోపాటు జర్మనీ, స్వీడన్, అమెరికా, ఫ్రాన్స్ తదితర దేశాలు కోరాయి. కాగా, సిరియా విపక్ష ఆరోపణలు రెచ్చగొట్టేలా ఉన్నాయని, పథకం ప్రకారమే ప్రచారంలోకి తెచ్చారని సిరియా సర్కారుకు మద్దతిస్తున్న రష్యా ఆరోపించింది.

ఐరాస తనిఖీ బృందం సిరియాకు రాగానే ఈ ఆరోపణలు చేయడం అనుమానాలు రేకెత్తిస్తోందని పేర్కొంది. మరోపక్క.. పరిస్థితిపై చర్చించేందుకు భద్రతా మండలి బుధవారం రాత్రి అత్యవసరంగా సమావేశమైంది. సిరియాలో ప్రభుత్వం కానీ, రెబెల్స్ కానీ రసాయన దాడులు జరపడం ఆమోదయోగ్యం కాదని ఐరాస ప్రధాన కార్యదర్శి బాన్‌కీ మూన్ అన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement