ఈ బస్సులదే నెక్ట్స్ మార్కెట్! | Sakshi
Sakshi News home page

ఈ బస్సులదే నెక్ట్స్ మార్కెట్!

Published Thu, Jan 26 2017 4:23 PM

ఈ బస్సులదే నెక్ట్స్ మార్కెట్! - Sakshi

పుణే : పర్యావరణ రహిత ఎలక్ట్రిక్, హైబ్రిడ్ బస్సులను దేశీయ మార్కెట్లోకి విడుదల చేసిన టాటా మోటార్స్ వచ్చే ఏడాది కల్లా వీటి మార్కెట్ భారీగా పెరుగనుందని అంచనావేస్తోంది. 400-500 యూనిట్ల టార్గెట్కు వీటి మార్కెట్ చేరుకుంటుందని టాటా మోటార్స్ చెబుతోంది. వచ్చే ఏళ్లలో వీటి వృద్ది మరింత పెరిగి, తర్వాత మార్కెట్ వీటిదే కాబోతుందట. ప్రత్యామ్నాయ ఇంధనాలతో అరడజను వాహనాలను ఇప్పటికే టాటా మోటార్స్ రోడ్లపై పరుగులు పెట్టిస్తోంది. లండన్, బీజింగ్ మాదిరి ఇండియన్ సిటీల్లో కూడా ప్రజా రవాణాకు హైబ్రిడ్, ఎలక్ట్రిక్ వాహనాలను వాడతారని కంపెనీ భావిస్తోంది. పెరిగిపోతున్న గాలి కాలుష్యాన్ని తగ్గించేందుకు కంపెనీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. దీనిలో భాగంగానే పర్యావరణ రహిత వాహనాలను మార్కెట్లోకి విడుదల చేస్తోంది.
 
అవసరాలకు అనుగుణంగానే కాకుండా, పర్యావరణాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని వాహనాలను తయారు చేస్తున్నామని టాటా మోటార్స్ కమర్షియల్ వెహికిల్ బిజినెస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రవీంద్ర చెప్పారు. బుధవారం ఎలక్ట్రిక్, హైబ్రిడ్ బస్సులను టాటా మోటార్స్ దేశీయ విపణిలోకి ప్రవేశపెట్టింది. ఈ బస్సుల ధర రూ.1.6 కోట్ల నుంచి రూ.2 కోట్ల మధ్య ఉంచింది. వచ్చే ఏడాది కల్లా వివిధ రాష్ట్రాల రవాణా వ్యవస్థల నుంచి కనీసం 300-400 హైబ్రిడ్ బస్సులకు ఆర్డర్లు వస్తాయని అంచనావేస్తున్నట్టు రవీంద్ర చెప్పారు. 

Advertisement
Advertisement