తిరుపతి చిన్నారుల పాంచ్ పటాకా | Sakshi
Sakshi News home page

తిరుపతి చిన్నారుల పాంచ్ పటాకా

Published Sat, Mar 5 2016 4:35 AM

తిరుపతి చిన్నారుల పాంచ్ పటాకా

తిరుపతి కల్చరల్: ‘మేక్ మై బేబీ జీనియస్’ అనే సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన వినూత్న మెమరీ విన్యాసంలో తిరుపతికి చెందిన చిన్నారులు అంతర్జాతీయ రికార్డులు నమోదు చేశారు. తిరుపతి విశ్వం టాలెంట్ స్కూల్లో జరిగిన ఈ కార్యక్రమంలో ఒకటో తరగతి చదువుతున్న సంగరాజు మంజునాథ్ 1 నుంచి 5వ తరగతి వరకు గల తెలుగు పాఠ్య పుస్తకాల్లో ఉన్న 49 గేయాలు, 38 పద్యాలను 18.30 నిమిషాల్లో వల్లించి రికార్డు నెలకొల్పాడు. ఆరేళ్ల మందాకపు శివాత్మిక 100 వేమన పద్యాలను 9.01 నిమిషాల్లో చెప్పి రికార్డుల్లోకెక్కింది.

నాలుగో తరగతి చదువుతున్న బి.ధనూష్ నాయక్ ఆవర్తన పట్టికలోని 118 మూలకాల పేర్లను 43 సెకన్లలోనే చెప్పి రికార్డు సృష్టించాడు. ఏడో తరగతి చదువుతున్న బి.వినయ సృష్టి ఒకటో తరగతి తెలుగు పుస్తకంలోని 150 పేజీలను రెప్లికా ఆర్ట్ ద్వారా రోజుకు 10 గంటల చొప్పున ఏడు రోజుల్లో 70 గంటల్లో గీసి రికార్డులు నమోదు చేసింది. ఎనిమిదో తరగతి చదువుతున్న కాయం తేజ అనే బాలిక ఆవర్తన పట్టికను 2.30 నిమిషాల్లో రాసి రికార్డులు సొంతం చేసుకుంది.

Advertisement
Advertisement