Sakshi News home page

టూర్‌కి ట్రా‘వెల్’ బీమా భరోసా

Published Mon, Dec 14 2015 4:35 AM

టూర్‌కి ట్రా‘వెల్’ బీమా భరోసా

మనం ఎక్కడికైనా టూర్ వెళ్లాలంటే చాలా ప్రణాళికలను రచిస్తాం. ఏ ఏ ప్రదేశాలను చూడాలి, ఎక్కడ ఉండాలి, ఏ వస్తువులను కొనాలి, ఎక్కడ తినాలి ఇలా ఎన్నో అంశాలను ఒకటికి రెండుసార్లు సరిచూసుకున్న తర్వాతనే టూర్‌కు కదలుతాం. కానీ వీటన్నింటికన్నా ముఖ్యమైన అంశాన్ని మాత్రం వదిలేస్తాం. అదేనండి ట్రావెల్ ఇన్సూరెన్స్ విషయం. టూర్ ప్లాన్ చేసుకొని బయలుదేరామే అనుకోండి. అలా వెళ్లిన తర్వాత టూర్ మధ్యలో అక్కడి కొత్త వాతావరణం వల్ల మనకు అనారోగ్యం చేస్తే.. అప్పుడేంటి పరిస్థితి. మనం పట్టుకెళ్లిన డబ్బులను ఆరోగ్యం బాగుచేసుకోవడానికి వెచ్చించాల్సి వస్తుంది.

అనారోగ్యం కారణంగా టూర్‌కు వెళ్లినా ఎంజాయ్ మాత్రం చేయలేం. ఇక్కడ డబ్బుతో సహా కాలం కూడా వృథా అయినట్టే లెక్క. కాలాన్ని ఎలాగూ ఆపలేం కాబట్టి ఇక మిగిలింది డబ్బు. టూర్‌కు వెళ్లే సమయంలో ట్రావెల్ ఇన్సూరెన్స్ తీసుకుంటే మీ జేబులో డబ్బైనా మిగులుతుంది. ప్రస్తుతం ప్రతి కంపెనీ కూడా ట్రావెలర్స్ కోసం పలు రకాల ట్రావెల్ ఇన్సూరెన్స్ పథకాలను అందిస్తున్నాయి. ఈ పథకాలు లగేజ్ నుంచి మెడికల్ వరకు అన్ని రకాల సేవలను అందిస్తున్నాయి.
 
 ట్రావెల్ ఇన్సూరెన్స్ వేటికి వర్తిస్తుంది?

 లగేజ్ డ్యామేజ్ అయ్యింది. ఫ్లైట్ ఆలస్యమైంది. అనివార్య కారణాల వల్ల విమానం మిస్ అయ్యింది. వీటన్నింటికీ ట్రావెల్ ఇన్సూరెన్స్ వర్తిస్తుంది. అంటే ఈ పరిస్థితుల్లో సదరు బీమా కంపెనీ మీకు ప్రత్యామ్నాయ మార్గాన్ని ఏర్పాటు చేస్తుంది. మనకు అనారోగ్యం తలెత్తినప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీ మన అనారోగ్యానికి అయ్యే ఖర్చునంతటినీ భరిస్తుంది. ఎక్కడ మంచి వైద్యం లభిస్తుందో, దానికి ఎంత ఖర్చవుతుందో వంటి అంశాలు మనకు తెలియవు కదా. అప్పుడు అన్ని బాధ్యతలను బీమా కంపెనీయే తీసుకుంటుంది.ఇవే కాదండి.. ఎమర్జెన్సీ వసతి సదుపాయం, పాస్‌పోర్ట్ పోయినా, లీగల్ ఖర్చులు, ఓవర్ బుక్‌డ్ ఫ్లైట్, అనారోగ్య పరిస్థితుల్లో రోజూవారీ ఖర్చులు, పర్సనల్ యాక్సిడెంట్, ఫైనాన్షియల్ ఎమర్జెన్సీలకు కూడా ట్రావెల్ ఇన్సూరెన్స్ వర్తిస్తుంది. ఇటీవల కాలంలో కొన్ని దేశాలు వెళ్లాలంటే వీసాతోపాటే బీమా తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. 85 ఏళ్లు ఉన్న వారికి కూడా అందుబాటులో పథకాలు ఉన్నాయి.
 
ట్రావెల్ ఇన్సూరెన్స్ రకాలు
వ్యక్తిగత ట్రావెల్ ఇన్సూరెన్స్
కుటుంబ ట్రావెల్ ఇన్సూరెన్స్
స్టూడెంట్ ట్రావెల్ ఇన్సూరెన్స్
సీనియర్ సిటిజన్ ట్రావెల్ ఇన్సూరెన్స్
బిజినెస్ మల్టీ ట్రిప్ ట్రావెల్ ఇన్సూరెన్స్
కార్పొరేట్ ట్రావెల్ ఇన్సూరెన్స్
దేశీ ట్రావెల్ ఇన్సూరెన్స్
అంతర్జాతీయ ట్రావెల్ ఇన్సూరెన్స్
ట్రావెల్ ఇన్సూరెన్స్ కంపెనీలు
 
బజాజ్ అలియాంజ్, హెచ్‌డీఎఫ్‌సీ ఎర్గో, టాటా ఏ ఐజీ, న్యూ ఇండియా అస్యూరెన్స్, ఫ్యూచర్ జనరా లీ ఇండియా, ఐసీఐసీఐ లంబార్డ్, నేషనల్ ఇన్సూరెన్స్, రిలయన్స్ జెనరల్, రెలిగేర్ హెల్త్, చోళమండలం ఎంఎస్ జనరల్, ఎస్‌బీఐ జనరల్, యునెటైడ్ ఇండియా, స్టార్‌హెల్త్, అపోలో మ్యూనిచ్, ఓరియంటల్ ఇన్సూరెన్స్‌తో సహా పలు కంపెనీలు ట్రావెల్ ఇన్సూరెన్స్ పథకాలను అందిస్తున్నాయి.
 
 ట్రావెల్ ఇన్సూరెన్స్ తీసుకునే ముందు జాగ్రత్తలు
 దఇన్సూరెన్స్ పథకాన్ని ఆఫర్ చేస్తున్న సంస్థ దేశీ, అంతర్జాతీయంగా ఏ ఏ కంపెనీలతో భాగస్వామ్యమై ఉందో తెలుసుకోండి. ఎందుకంటే టూర్‌కు వెళ్లినప్పుడు అక్కడ ట్రిప్‌లో ఏదైనా ఆలస్యం జరిగినా, ట్రిప్ రద్దైనా ఇతర కంపెనీలతో భాగస్వామ్యమై ఉంటే మళ్లీ కొత్త ట్రిప్ ఏర్పాటుకు అవకాశాలు ఉంటాయి.

దఆ ఇన్సూరెన్స్ కంపెనీ క్లెయిమ్ సెటిల్‌మెంట్ చరిత్రకు సంబంధించిన విషయాలను తెలుసుకోండి. దసదరు బీమా కంపెనీ ఏదైనా టోల్‌ఫ్రీ నెంబర్‌ను అందుబాటులో ఉంచిందో.. లేదో.. గమనించండి. దటోల్-ఫ్రీ నెంబర్ అందుబాటులో ఉంటే.. మీకు ఏదైనా ఎమర్జెన్సీ వస్తే కాల్ చేసి తగిన సహాయాన్ని పొందొచ్చు.  దఏ కంపెనీలు ఆఫర్ అందిస్తున్నాయో ఆన్‌లైన్‌లో వెతకండి. అలాగే ఒక కంపెనీ ప్రీమియంకు మరో కంపెనీ ప్రీమియాన్ని సరిపోల్చండి. మీకు ఏ కంపెనీ పాలసీ నచ్చుతుందో దాన్నే తీసుకోండి. టూర్ ట్రిప్‌లో ట్రావెల్ ఇన్సూరెన్స్ వ్యయం దాదాపుగా 1 శాతం కన్నా తక్కువగానే ఉంటుంది.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement