ఇరవై ఏళ్ల తర్వాత తల్లిదండ్రుల చెంతకు! | Sakshi
Sakshi News home page

ఇరవై ఏళ్ల తర్వాత తల్లిదండ్రుల చెంతకు!

Published Mon, Aug 31 2015 3:46 AM

ఇరవై ఏళ్ల తర్వాత తల్లిదండ్రుల చెంతకు! - Sakshi

పెద్దేముల్: పన్నెండేళ్ల వయసులో ఉన్న ఊరు.. కన్న తల్లిదండ్రులను వదిలిపెట్టి బతుకుదెరువు కోసం వెళ్లిన ఓ బాలుడు ఇరవై ఏళ్ల తర్వాత భార్యాపిల్లలతో సొంత గ్రామానికి వచ్చాడు. కొడుకు ఇక రాడేమోనని దిగులుతో ఉన్న తల్లిదండ్రులు.. తమ కుమారుడు భార్యాబిడ్డలతో రావడంతో  ఉద్వేగంతో సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. సోదరి రాఖీ కట్టింది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా పెద్దేముల్ మండలం మన్‌సాన్‌పల్లిలో ఆదివారం వెలుగుచూసింది. వివరాలు..గ్రామానికి చెందిన లింబ్యానాయక్, సోనాబాయి దంపతులకు కూతురు కిమ్నీబాయి, కుమారులు దుర్గ్యానాయక్, హర్యానాయక్, సురేష్ ఉన్నారు. దుర్గ్యానాయక్ 12 ఏళ్ల వయసులో ఉండగా.. పని కోసం పుణే వెళ్లాడు. అక్కడ పని దొరక్కపోవడంతో ఓ లారీపై క్లీనర్‌గా పనిచేయసాగాడు. ఈ క్రమంలో కర్ణాటక రాష్ట్రం బీజాపూర్ వెళ్తుండగా మార్గంమధ్యలో దుమ్ముగూడ తండాకు చెందిన అనూషబాయి పరిచయమైంది.

అనంతరం కొంతకాలానికి ఆమె చెల్లెలు చాలుబాయిని దుర్గ్యానాయక్ వివాహం చేసుకున్నాడు. అక్కడే ఉంటూ స్థానికంగా ఇస్లామ్‌పూర్ దగ్గర ఓ దాబాలో పనిచేయసాగాడు. ఇతడికి పిల్లలు సోను (7), అభిషేక్ (5), హరిత (1) ఉన్నారు. దుర్గ్యానాయక్ (32) ఇరవై ఏళ్ల తర్వాత తల్లిదండ్రులను గుర్తుచేసుకొని స్వగ్రామానికి శనివారం భార్యాపిల్లలతో కలసి వచ్చాడు. తమ కుమారుడు ఇక రాడేమోననే బెంగతో ఉన్న తల్లిదండ్రులు దుర్గ్యానాయక్‌తో పాటు కోడలు, మనవలు, మనవరాలిని చూసి సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. శనివారం రాఖీ పండుగ సందర్భంగా దుర్గ్యా నాయక్‌కు సోదరి కిమ్నీబాయి రాఖీ కట్టింది.

Advertisement
Advertisement