బ్రిటన్ పాస్‌పోర్టుకు వన్నె తగ్గుతోంది | Sakshi
Sakshi News home page

బ్రిటన్ పాస్‌పోర్టుకు వన్నె తగ్గుతోంది

Published Thu, Jun 30 2016 4:47 PM

బ్రిటన్ పాస్‌పోర్టుకు వన్నె తగ్గుతోంది

లండన్: యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ తప్పుకోనుండడంతో బ్రిటన్ పాస్‌పోర్టులకు వన్నె తగ్గుతోంది. ఇప్పటి వరకు మిగతా 27 యూరోపియన్ యూనియన్ దేశాల్లో ఎలాంటి వీసాలు అవసరం లేకుండా స్వేచ్ఛగా పర్యటించే అవకాశం బ్రిటన్ పాస్‌పోర్టుల ద్వారా లభిస్తోంది. రెండేళ్ల తర్వాత ఆ అవకాశం ఉండకపోవచ్చు.

ఎందుకంటే బ్రెగ్జిట్ రిఫరెండమ్ కారణంగా యూరోపియన్ యూనియన్ నుంచి రెండేళ్లలోగా బ్రిటన్ తప్పుకోవాల్సి ఉంటుంది. అప్పుడు బ్రిటన్ పాస్‌పోర్టు హోల్డర్లకు యూరోపియన్ యూనియన్ కొత్త వీసా నిబంధనలు అమల్లోకి వస్తాయి. అలాంటప్పుడు బ్రిటన్ పాస్‌పోర్టుదారులకు ఎంతమేరకు వెసులుబాటు ఉంటుందనే విషయం యూరోపియన్ యూనియన్‌తో జరిపే చర్చలు, చేసుకునే ఒప్పందాలపై ఆధారపడి ఉంటుంది.

రెండేళ్ల తర్వాత యూరోపియన్ యూనియన్ దేశాలకు వెళ్లాలంటే మహా అంటే టూరిస్ట్ వీసాలను తీసుకోవాల్సిన రావచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఇప్పటివరకు బ్రిటన్ పాస్‌పోర్టుపై యూరోపియన్ యూనియన్ దే శాలు సహా ప్రపంచంలో వీసా లేకుండా 157 దేశాలకు వెళ్లే అవకాశం ఉంది. ఇక ముందు ఈ సంఖ్య 123 దేశాలకే పరిమితం అవుతుందని ప్రపంచ దేశాల పాస్‌పోర్టులకు రేటింగ్‌లు ఇచ్చే ఆర్టన్ కేపిటల్ సంస్థ తెలియజేసింది.

ప్రస్తుతం ప్రపంచంలో బ్రిటన్ పాస్‌పోర్టులకు రెండో స్థానం ఉందని, యూరోపియన్ యూనియన్ నుంచి నిష్ర్కమించాక ఆ స్థానం 26కు పడిపోతుందని ఆ సంస్థ అంచనా వేసింది. ప్రపంచంలో వీసా లేకుండా 158 దేశాల్లో పర్యటించేందుకు వీలు కల్పిస్తున్న జర్మనీ, స్వీడన్ పాస్‌పోర్టులు మొదటి స్థానంలో ఉన్నాయి. బ్రిటన్ పౌరసత్వాన్ని కోరుకునే బడా పెట్టుబడిదారుల సంఖ్య కూడా గణనీయంగా పడిపోవచ్చని చెబుతోంది. సంపన్నులైన వ్యాపారవేత్తలకు బహుళ పౌరసత్వం కల్పించేందుకు ఆర్టన్ కేపిటల్ సంస్థ ప్రధానంగా కృషి చేస్తున్న విషయం తెల్సిందే.

బ్రిటన్ పాస్‌పోర్టులకు వన్నె తగ్గనుందన్న విషయాన్ని ముందుగానే అంచనా వేస్తున్న బ్రిటన్ పౌరులు యూరోపియన్ యూనియన్‌లోనే కొనసాగనున్న ఉత్తర ఐర్లాండ్ పాస్‌పోర్టుల కోసం ఎగబడుతున్నారు. తల్లిదండ్రులుగానీ, వారి తల్లిదండ్రులుగానీ ఐర్లాండ్ పౌరులైతే బ్రిటన్ పాస్‌పోర్టుదారులకు కూడా ఐర్లాండ్ పాస్‌పోర్టులు లభిస్తాయి. ఇలాంటి అవకాశం ఉన్నవారంతా ఇప్పుడు ఆ దేశం పాస్‌పోర్టుల కోసం దరఖాస్తు చేసుకుంటున్నారని ఐర్లాండ్ విదేశాంగ శాఖ వెల్లడించింది.

Advertisement
Advertisement