పోలీసుల అదుపులో పోలీసులు.. | Sakshi
Sakshi News home page

పోలీసుల అదుపులో పోలీసులు..

Published Fri, Aug 21 2015 9:29 AM

పోలీసుల అదుపులో పోలీసులు.. - Sakshi

తిరుపతి: పోలీసుల అదుపులో పోలీసులు. ఇదేదో సినిమా కథ కాదు...రియల్ స్టోరీనే.  ఎర్రచందనం స్మగ్లర్‌ నుంచి అదనపు డబ్బు డిమాండ్‌ చేసిన ఖాకీలు.. చివరకూ పోలీసులకు చిక్కిన ఘటన చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది.  వివరాల్లోకి వెళితే... ఎర్రచందనం స్మగ్లర్లను బెదిరించి డబ్బులు వసూలు చేసిన కేసులో చిత్తూరు జిల్లా వడమాలపేట ఎస్ఐ, ఐడీ హెడ్‌కానిస్టేబుళ్లని రేణిగుంట పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. వారిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

 పోలీసుల కథనం ప్రకారం ... ఎర్రచందనం స్మగ్లర్ శివని ఇటీవల వడమాల ఎస్ఐ రాజశేఖరరెడ్డి అదుపులోకి తీసుకున్నారు. శివ ద్వారా ఎర్రచందనం స్మగ్లర్ల వివరాలను సేకరించారు. సదరు స్మగ్లర్లను శివ ద్వారా బెదిరించి సుమారు రూ. 20 లక్షల వరకు నగదును ఎస్ఐ రాజశేఖరెడ్డి హెడ్ కానిస్టేబుల్ కుమార్, కానిస్టేబుల్ చినబాబు రాబట్టినట్లు తెలిసింది.

ఆ క్రమంలో శివను వీరు మరింత వేధింపులకు గురి చేసి... మరో రూ.4 లక్షలు రాబట్టాలని ఆదేశించారు. ఆ క్రమంలో శివను వీరు భౌతికంగా గాయపరిచినట్లు సమాచారం. ఈ వేధింపులు తాళలేక శివ గురువారం మధ్యాహ్నం రేణిగుంట రూరల్ సీఐను ఆశ్రయించాడు. దాంతో సీఐ ఆదేశాల మేరకు వడమాల పోలీసులపై రేణిగుంట పోలీసులు కేసు నమోదు చేశారు.

ఆ క్రమంలో వడమాల పోలీస్ స్టేషన్లో రేణిగుంట పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఎస్ఐ రాజశేఖరరెడ్డి టేబుల్ డ్రాయిర్లోనే దాదాపు రూ. 5 లక్షల నగదు దొరికినట్లు తెలిసింది. స్మగ్లర్ శివ ఫిర్యాదు అనంతరం రేణిగుంట పోలీసులు తనిఖీలలో వడమాల పోలీసులు వద్ద దాదాపు రూ. 11 లక్షల నగదు లభ్యమైనట్లు సమాచారం. అదుపులోకి తీసుకున్న వీరిని ...పోలీసులు రహస్యంగా విచారణ చేపడుతున్నారు. అయితే ఈ విషయాలను మాత్రం బయటకు పొక్కనీయడం లేదు.

Advertisement
Advertisement