జల విద్యుత్‌పై మళ్లీ ఆశలు | Sakshi
Sakshi News home page

జల విద్యుత్‌పై మళ్లీ ఆశలు

Published Fri, Sep 11 2015 2:19 AM

జల విద్యుత్‌పై మళ్లీ ఆశలు

సాక్షి, హైదరాబాద్/జూరాల: జల విద్యుత్‌పై మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. జలాశయాలకు వరద నీటి ప్రవాహం జోరందుకుంటోంది. ఎగువ నుంచి వస్తున్న ప్రవాహంతో ప్రియదర్శని జూరాల జలాశయం పూర్తి సామర్థ్యం మేర నిండింది. దీంతో జలాశయం ఎగువ విద్యుదుత్పత్తి కేంద్రం ద్వారా గురువారం నుంచి విద్యుదుత్పత్తిని తెలంగాణ జెన్‌కో ప్రారంభించింది. 234 మెగావాట్ల సామర్థ్యమున్న ఈ కేంద్రంలో ప్రస్తుతం 4 టర్బైన్‌ల ద్వారా 156 మెగావాట్ల కరెంటును ఉత్పత్తి చేస్తూ 26 వేల క్యూసెక్కుల నీటిని దిగువన శ్రీశైలం జలాశయానికి విడుదల చేస్తున్నారు.

జూరాలకు వరద ప్రవాహం 50 వేల క్యూసెక్కులకు పెరిగితే ఈ కేంద్రం ద్వారా పూర్తి సామర్థ్యం మేరకు ఉత్పత్తి జరగనుంది.  వాస్తవానికి గత జూలైలోనే విద్యుదుత్పత్తి ప్రారంభమవుతుందని, ఆగస్టుకి 1,000 మెగావాట్ల జల విద్యుత్ అందుబాటులోకి వస్తుందని విద్యుత్ శాఖ ఆశలు పెట్టుకుంది. వర్షాభావం ఈ ఆశలను వమ్ము చేసింది. సీఎం కేసీఆర్ చైనా టూర్‌కు  ముందు విద్యుత్ సరఫరాపై సమీక్ష జరిపి ఇదే అంశంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఎట్టకేలకు జల విద్యుదుత్పత్తి ప్రారంభమవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

శ్రీశైలం, నాగార్జున సాగర్ జల విద్యుదుత్పత్తి కేంద్రాల నుంచి సైతం భవిష్యత్తులో ఉత్పత్తికి అవకాశం ఉందని జెన్‌కో అధికారుల అంచనా. ఖరీఫ్‌లో ఆలస్యంగా వేసిన పంటలు, రబీ పంటలకు విద్యుత్ సరఫరా అవసరాలు తీర్చడానికి జల విద్యుత్ కీలకం కానుంది. జూరాల రిజర్వాయర్ నీటిమట్టం 10.76 టీఎంసీలకు చేరడంతో ప్రధాన కాల్వల ద్వారా రిజర్వాయర్లు, చెరువులు నింపేందుకు వేయి క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఆయకట్టు పంటలకు సాగునీటిని విడుదల చేయడం లేదు. దిగువ జూరాల జల విద్యుదుత్పత్తి కేంద్రం నిర్మాణ పనులూ ముగింపు దశకు చేరుకున్నాయి.

Advertisement
Advertisement