ఆహార ధరలు ఆందోళనకరం | Sakshi
Sakshi News home page

ఆహార ధరలు ఆందోళనకరం

Published Thu, Nov 14 2013 2:26 AM

ఆహార ధరలు ఆందోళనకరం - Sakshi

  •  ఆర్‌బీఐ గవర్నర్ రాజన్
  •      రూపాయి స్థిరీకరణకు మరిన్ని చర్యలు
  •      క్యాడ్ 56 బిలియన్ డాలర్లు దాటదు...
  • ముంబై: దేశంలో ఆహార ధరలు ఆందోళన కలిగిస్తున్నాయని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురామ్ రాజన్ పేర్కొన్నారు. అయితే తాజా పంట దిగుబడుల వల్ల రానున్న నెలల్లో ధరలు అదుపులోకి వస్తాయన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. రూపాయి విలువ స్థిరీకరణకు రిజర్వ్ బ్యాంక్ తగిన చర్యలు అన్నింటినీ తీసుకుందని పేర్కొన్నారు. మరిన్ని చర్యలు తీసుకుంటామని సైతం ఉద్ఘాటించారు. రూపాయి విలువ క్షీణతకు ప్రధాన కారణాల్లో ఒకటైన కరెంట్ అకౌంట్ లోటు (క్యాడ్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అంచనాలను సైతం ఆయన తగ్గించారు. ఈ పరిమాణం 56 బిలియన్ డాలర్లకు (స్థూల దేశీయోత్పత్తి- జీడీపీలో 3 శాతం) దాటబోదన్నది తమ తాజా అంచనా అని వివరించారు.
     
     బుధవారం  ఇక్కడ హడావిడిగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ మేరకు కీలక ప్రకటనలు చేశారు. తద్వారా  రూపాయి విలువ క్షీణతను అడ్డుకొని, తద్వారా ధరల అదుపునకు తగిన ప్రయత్నాలన్నీ జరుగుతాయని ప్రజలకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. క్యాపిటల్ ఇన్‌ఫ్లోస్-ఎఫ్‌ఐఐ, ఎఫ్‌డీఐ, ఈసీబీ మినహా దేశంలోకి వచ్చీ-పోయే విదేశీ మారక ద్రవ్య నిల్వల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని క్యాడ్‌గా పరిగణిస్తారు. విదేశీ మారకంతో రూపాయి విలువ క్షీణతకు ప్రధాన కారణమైన క్యాడ్ 2012-13 జీడీపీలో 4.8 శాతం (88.2 బిలియన్ డాలర్లు). ఇది ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 3.7 శాతానికి (దాదాపు 60 బిలియన్ డాలర్ల)కు తగ్గుతుందన్నది ఆర్థికశాఖ తాజా అంచనా.

Advertisement
Advertisement